Hurun India list: దీపిందర్ గోయల్ అగ్రస్థానంలో.. రాధాకృష్ణ దమానీ వెనక్కి!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధాన విమానయాన సంస్థ ఇండిగో వ్యవస్థాపకులు రాహుల్ భాటియా,రాకేశ్ గంగ్వాల్ హురున్ ఇండియా జాబితాలో మొదటిసారిగా స్థానం సంపాదించారు. స్వయంకృషితో ఎదిగిన వ్యాపారవేత్తల జాబితాలో వీరు మూడవ స్థానంలో నిలిచారు. వీరు ఏర్పాటు చేసిన ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ మార్కెట్ విలువ రూ.2.2 లక్షల కోట్లు అని హురున్ లెక్కించింది. ఈ జాబితాలో జొమాటో మాతృ సంస్థ ఎటెర్నల్ సీఈఓ దీపిందర్ గోయల్ అగ్రస్థానంలో ఉన్నారు. ఆయన స్థాపించిన ఎటెర్నల్ కంపెనీ రూ.3.2 లక్షల కోట్లు మార్కెట్ విలువను సాధించింది, ఏడాదిలో 27 శాతం వృద్ధి నమోదు చేసింది. ఇదే కారణంగా డీమార్ట్ అధినేత రాధాకృష్ణ దమానీను దీపిందర్ వెనక్కి నెట్టాడు.
వివరాలు
IDFC First Private,Hurun India Top 200 వ్యాపారవేత్తల జాబితా 2025 విడుదల
అయితే, అదే సమయంలో అవెన్యూ సూపర్‌మార్ట్స్ మార్కెట్ విలువ 13 శాతం తగ్గి రూ.3 లక్షల కోట్లుకు పరిమితమైంది. ఈ నేపథ్యంలో IDFC First Private,Hurun India Top 200 వ్యాపారవేత్తల జాబితా 2025 విడుదల చేశారు. ఈ జాబితా సెప్టెంబర్ 25 వరకు ఉన్న మార్కెట్ విలువలను ప్రామాణికంగా తీసుకొని తయారుచేశారు. ఇటీవల ఇండిగోకు ఎదురైన సంక్షోభం కంపెనీ షేర్లపై ప్రభావం చూపినా, దేశీయ విమానయాన రంగంలో 65 శాతం మార్కెట్ వాటాతో ఇండిగో అగ్రగామిగా కొనసాగుతుందని హురున్ పేర్కొంది. ఆధునిక పద్ధతులు ద్వారా కంపెనీ అంతర్జాతీయ విస్తరణను కూడా కొనసాగించుతోందని జాబితా పేర్కొంది.
వివరాలు
దేశవ్యాప్తంగా 800 నగరాల్లో సేవలు అందిస్తున్న జొమాటో
దీపిందర్ గోయల్ ఈ జాబితాలో మొదటిసారిగా స్థానం పొందారు. ఆయన ప్రారంభించిన జొమాటో దేశవ్యాప్తంగా 800 నగరాల్లో సేవలు అందిస్తోంది. పోటీ కంపెనీ స్విగ్గీ సహ వ్యవస్థాపకులు శ్రీహర్ష్ మాజేటి,నందన్ రెడ్డి ఐదో స్థానంలో ఉన్నారు. ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ.1.06 లక్షల కోట్లు, గతేడాదితో పోలిస్తే 5 శాతం వృద్ధి చెందింది. పేటియం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ జాబితాలో 8వ స్థానంలో ఉన్నారు. ఆయన వ్యాపార సంస్థ మార్కెట్ విలువ రూ.72,800 కోట్లు, గతేడాదితో పోలిస్తే 67 శాతం వృద్ధి నమోదు చేసింది.
వివరాలు
బెంగళూరు కేంద్రంగా జాబితాలో స్థానం పొందిన 52 కంపెనీలు
ఇటీవల మార్కెట్‌లోకి ప్రవేశించిన లెన్స్‌కార్ట్ కూడా 60శాతం వృద్ధితో రూ.67వేల కోట్లు మార్కెట్ విలువ సాధించింది. ఈ కంపెనీని స్థాపించిన పీయూష్ బన్సల్, అమిత్ చౌదరి, నేహా బన్సల్, సుమిత్ కపాహీ జాబితాలో 10వ స్థానంలో నిలిచారు. హురున్ ప్రకారం,ఈ జాబితాలోని కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.42 లక్షల కోట్లు, గత ఏడాదిలో ఇది రూ.36 లక్షల కోట్లు కాగా, ఏడాదిలో 15 శాతం వృద్ధి నమోదైంది. స్వయంకృషితో బిలియన్ డాలర్ కంపెనీలను ఏర్పరచిన వ్యాపారవేత్తల సంఖ్య గతేడాది 121గా ఉంటే, ఈ ఏడాది 128కి పెరిగింది. జాబితాలో స్థానం పొందిన 52 కంపెనీలు బెంగళూరు కేంద్రంగా ఉన్నాయని నివేదిక పేర్కొంది. దీంతో మరోసారి బెంగళూరు తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది.