Indigo: ఇండిగోకు షాక్.. సీఈవో పదవికి పీటర్ ఎల్బర్స్ రాజీనామా
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో (IndiGo) సీఈవో పీటర్ ఎల్బర్స్ తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఆయన సమర్పించిన రాజీనామాను ఇండిగో మాతృ సంస్థ అయిన ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ బోర్డు ఆమోదించింది. అలాగే నోటీసు పీరియడ్ నుంచి మినహాయింపు ఇవ్వాలని పీటర్ ఎల్బర్స్ చేసిన అభ్యర్థనకూ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఆయన రాజీనామా వెంటనే అమల్లోకి వచ్చినట్లు కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. 2022లో ఇండిగో సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన పీటర్ ఎల్బర్స్ దాదాపు నాలుగేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు.
వివరాలు
తాత్కాలిక సీఈవోగా రాహుల్ భాటియా
కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ భాటియా తాత్కాలిక సీఈవోగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. కొత్త సీఈవో నియమితులయ్యే వరకు ఆయనే ఆ బాధ్యతలు చూసుకుంటారని సంస్థ వెల్లడించింది. కొత్త సీఈవో ఎవరు అన్న విషయాన్ని త్వరలో ప్రకటిస్తామని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. గత ఏడాది డిసెంబర్‌లో దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సేవలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఆ ఘటనపై కేంద్ర ప్రభుత్వం రూ.22 కోట్ల జరిమానా విధించింది. విమాన సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఎదుర్కొన్న ఇబ్బందులపై అప్పట్లో పీటర్ ఎల్బర్స్ క్షమాపణలు కూడా తెలిపారు. ఆ ఘటన జరిగిన దాదాపు మూడు నెలల తర్వాత ఆయన రాజీనామా చేయడం గమనార్హంగా మారింది.