IndiGo: ఇండిగోకు భారీ దెబ్బ.. ఒక్క త్రైమాసికంలోనే రూ.2,537 కోట్ల నష్టం
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో జనవరి-మార్చి త్రైమాసికంలో రూ.2,537 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ క్షీణించడం, కార్మిక చట్టాల్లో మార్పులు, అలాగే కార్యకలాపాల నిర్వహణలో ఎదురైన సవాళ్లు ఈ నష్టానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే త్రైమాసికంలో సంస్థ రూ.3,067.50 కోట్ల నికర లాభాన్ని ఆర్జించడం గమనార్హం. అదే సమయంలో ఏడాది వ్యవధిలో మొత్తం ఆదాయం రూ.23,097.50 కోట్ల నుంచి 3 శాతం పెరిగి రూ.23,830.70 కోట్లకు చేరింది.
వివరాలు
కీలక వివరాలను వెల్లడించిన కంపెనీ
2025-26 పూర్తి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కూడా ఇండిగో రూ.2,393.60 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది.అయితే 2024-25 ఆర్థిక సంవత్సరంలో సంస్థ రూ.7,502.50 కోట్ల నికర లాభాన్ని ఆర్జించిన విషయం తెలిసిందే. అదే ఏడాదిలో మొత్తం ఆదాయం 6.4 శాతం పెరిగి రూ.89,513.40 కోట్లకు చేరింది. నష్టాలకు కారణాలను వివరిస్తూ కంపెనీ కీలక వివరాలు వెల్లడించింది. 2025-26లో విదేశీ మారకపు ద్రవ్యం కారణంగా రూ.8,100 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపింది. అలాగే 2025 డిసెంబరులో విమాన సర్వీసుల్లో ఏర్పడిన భారీ అంతరాయాల వల్ల రూ.580 కోట్ల ప్రతికూల ప్రభావం పడిందని పేర్కొంది.
వివరాలు
కొత్త కార్మిక చట్టాలతో ఖర్చులే రూ. 1200 కోట్లు
కొత్త కార్మిక చట్టాల అమలుతో సంబంధించి ఖర్చులు రూ.1,200 కోట్లుగా నమోదయ్యాయని వెల్లడించింది. ఈ సందర్భంగా ఇండిగో ఎండీ రాహుల్ భాటియా మాట్లాడుతూ, 2025-26 ఆర్థిక సంవత్సరం అత్యంత సవాళ్లతో కూడినదిగా నిలిచిందని తెలిపారు. ఈ పరిణామాలే లాభదాయకతపై ప్రభావం చూపాయని ఆయన పేర్కొన్నారు. అయితే, ఈ పరిస్థితుల మధ్య కూడా తమ సీట్ల సామర్థ్యం 9.5 శాతం పెరిగిందని ఆయన వివరించారు.