
Infosys: ఇన్ఫోసిస్ మైసూరు క్యాంపస్ నుండి మరికొంతమంది ట్రైనీల తొలగింపు..
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys) ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తోంది.
ఉద్యోగులు వారానికి 70 గంటలు పనిచేయాలంటూ నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలతో మొదలై, ఉద్యోగుల లేఆఫ్స్, ఫ్రెషర్స్ విషయంలో సంస్థ తీసుకున్న నిర్ణయాలు, శాలరీ హైక్స్ వంటి అంశాలతో నిత్యం హెడ్‌లైన్స్‌లో ఉంది.
ఇప్పుడోసారి మైసూరు క్యాంపస్‌లో 30 నుంచి 45 మంది ట్రైనీలను తొలగించినట్లు సమాచారం.
ఇంటర్నల్ అసెస్‌మెంట్‌లో ఉత్తీర్ణత సాధించకపోవడంతో వారిని తొలగించినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.
వివరాలు
400 మంది ట్రైనీలకు లేఆఫ్స్ - కేంద్రం జోక్యం
ఇటీవల మైసూరు క్యాంపస్‌లో శిక్షణ పొందుతున్న 400 మందికి పైగా ట్రైనీలను లేఆఫ్ చేసిన విషయం తెలిసిందే.
ఈ నిర్ణయం తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. వ్యవహారం ప్రధానమంత్రి కార్యాలయం (PMO) దాకా వెళ్లడంతో కేంద్ర కార్మిక శాఖ (Labour Ministry) దర్యాప్తునకు ఆదేశించింది.
ఈ పరిణామాల మధ్య, ఇన్ఫోసిస్ కొత్త ఆఫర్ ఇచ్చింది. లేఆఫ్‌కు గురైన ట్రైనీలకు "బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్" (BPM) రోల్‌లో ఉద్యోగ అవకాశాన్ని కల్పిస్తోంది.
ఇందులో 12 వారాల శిక్షణ కూడా అందించనుంది. అలాగే, తొలగించిన ట్రైనీలకు రిలీవింగ్ లెటర్ మరియు ఒక నెల ఎక్స్‌గ్రేషియా కూడా అందించేందుకు సిద్ధమైంది.
వివరాలు
ట్రాన్స్పోర్ట్ సౌకర్యం - తాత్కాలిక వసతి
BPM మార్గాన్ని తీసుకోవడానికి ఇష్టపడని ట్రైనీలకు బెంగళూరుకు రవాణా సదుపాయం అందించనున్నట్లు సమాచారం.
వారు స్వస్థలాలకు వెళ్లేందుకు అయ్యే ప్రయాణ ఖర్చులను కంపెనీ భరిస్తుందని తెలుస్తోంది.
తొలగింపు తేది వరకు మైసూరు ఎంప్లాయీ కేర్ సెంటర్‌లో (Employee Care Centre) వసతి పొందే అవకాశం ఉంది.
మార్చి 27లోపు కంపెనీకి తమ నిర్ణయం తెలియజేయాలని ట్రైనీలకు సూచించింది.
వివరాలు
ఇన్ఫోసిస్ అల్టిమేటం - ట్రైనీల నిరసనలు
ఇన్ఫోసిస్ గతంలో కూడా ఫ్రెషర్లను కఠిన షరతులతో నియమించి, కొంతమందిని తొలగించిన ఘటనలు ఉన్నాయి.
ఫిబ్రవరి 7న, మైసూరు క్యాంపస్‌లో 400 మంది ట్రైనీలకు లేఆఫ్స్ ప్రకటించగా, మూడు అంచనా పరీక్షల్లో విఫలమైన వారిని తొలగిస్తున్నట్లు సంస్థ పేర్కొంది.
ట్రైనీలను 50 మందుల బ్యాచ్‌లుగా పిలిచి, మ్యూచువల్ సెపరేషన్ లెటర్‌పై సంతకాలు చేయించినట్లు వార్తలు వచ్చాయి.
కంపెనీ సాయంత్రం 6 గంటల్లోపు క్యాంపస్ విడిచిపెట్టాలని ట్రైనీలకు అల్టిమేటం ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే, ఇన్ఫోసిస్ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.
వివరాలు
ప్రధాని కార్యాలయానికి ట్రైనీల విజ్ఞప్తి
తొలగింపులపై తీవ్ర అసంతృప్తితో ట్రైనీలు ప్రధానమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. 100కి పైగా ఫిర్యాదులు అందాయి.
తమ ఉద్యోగాలను తిరిగి ఇప్పించాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రధాని కార్యాలయాన్ని కోరారు.
ఈ అంశంపై కేంద్ర కార్మిక శాఖ కర్ణాటక కార్మిక శాఖకు నోటీసులు పంపింది. ఫిబ్రవరి 25న దర్యాప్తు జరిపి నివేదిక అందించాల్సిందిగా ఆదేశించింది.
ఈ వ్యవహారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఐటీ పరిశ్రమలో తీవ్ర చర్చకు దారితీసింది.