Infosys: ఉద్యోగాల కోతలు లేవు.. నియామకాలు,నైపుణ్యాలపై దృష్టి: సీఈఓ సలీల్ పరేఖ్
ఈ వార్తాకథనం ఏంటి
కృత్రిమ మేధ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంస్థల్లో ఉద్యోగాల కోతలు కొనసాగుతున్న తరుణంలో, ఇన్ఫోసిస్ శుభవార్త తెలిపింది. తమ సంస్థలో ఉద్యోగుల తొలగింపులు చేపట్టబోమని స్పష్టం చేసింది. రాబోయే కాలంలో కొత్త నియామకాలు చేపట్టడంపై,ఉద్యోగుల నైపుణ్యాలను పెంపొందించడంపై ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు వెల్లడించింది. గత సంవత్సరంలో తమ సంస్థలో ఎలాంటి ఉద్యోగాల కోతలు జరగలేదని సంస్థ ప్రధాన కార్యనిర్వాహక అధికారి సలీల్ పరేఖ్ పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఈ విధానాన్ని కొనసాగిస్తామని చెప్పారు. కృత్రిమ మేధ ప్రవేశంతో ప్రారంభ స్థాయి ఉద్యోగాల్లో కొంత మార్పు వచ్చినా,మొత్తం పనితీరు విస్తరించనుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సాంకేతికత వల్ల ఉద్యోగ అవకాశాలు తగ్గవని,ఉద్యోగులకు కొత్త నైపుణ్యాల్లో శిక్షణ అందించి వారికి మరింత అవకాశాలు కల్పించనున్నట్లు వివరించారు.
వివరాలు
ప్రపంచంలోని పలు సాంకేతిక సంస్థల్లో ఉద్యోగాల కోతలు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కనీసం 20 వేల మంది కొత్తవారిని నియమించుకునే లక్ష్యంతో సంస్థ ముందుకు సాగుతోంది. ఇక మరోవైపు, ప్రపంచంలోని పలు సాంకేతిక సంస్థల్లో ఉద్యోగాల కోతలు కొనసాగుతున్నాయి. కృత్రిమ మేధ సేవలను విస్తరించేందుకు పెద్ద సంస్థలు డేటా కేంద్రాలు,మౌలిక సదుపాయాలపై భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. దీనితో వ్యయాలను తగ్గించే ప్రయత్నాలు ప్రారంభించాయి. ఇప్పటికే మెటా, మైక్రోసాఫ్ట్ వంటి ప్రముఖ సంస్థలు ఈ ఏడాది ఉద్యోగాల కోతలను ప్రకటించిన విషయం తెలిసిందే.