Swiggy Instamart: ఒక్క ఏడాదిలో రూ.22 లక్షల షాపింగ్: స్విగ్గీ నివేదిక వెల్లడి
ఈ వార్తాకథనం ఏంటి
స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ ఆర్డర్ల విషయంలో దేశవ్యాప్తంగా హైదరాబాద్ అగ్రస్థానానికి చేరుకుంది. అత్యధిక విలువైన సింగిల్ ఆర్డర్ నమోదు చేసిన నగరంగా హైదరాబాద్ నిలిచింది. ఒక హైదరాబాదీ వినియోగదారుడు ఒక్క ఆర్డర్‌లోనే ఐఫోన్‌ల కొనుగోలుకు రూ.4.3 లక్షలు ఖర్చు చేసినట్లు స్విగ్గీ వెల్లడించింది. అంతేకాకుండా పాలు, బంగారం, స్మార్ట్‌ఫోన్లు, కండోమ్‌లు వంటి ఉత్పత్తులకు కూడా ఇన్‌స్టామార్ట్ ద్వారా భారీగా ఆర్డర్లు వచ్చినట్లు ఆ నివేదిక పేర్కొంది. భారతీయులు క్విక్ కామర్స్ యాప్‌లను ఎలా వినియోగిస్తున్నారనే అంశంపై 'హౌ ఇండియా ఇన్‌స్టామార్టెడ్ - 2025' అనే పేరుతో స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ ఓ సమగ్ర నివేదికను విడుదల చేసింది. 2025 సంవత్సరంలో దేశవ్యాప్తంగా తమ ప్లాట్‌ఫామ్‌లో జరిగిన ఆర్డర్ల సరళిని ఈ నివేదిక వివరించింది.
వివరాలు
పాల ఆర్డర్లతో 26 వేల స్విమ్మింగ్ పూల్స్ నింపవచ్చు
ఒక వినియోగదారుడు ఒక్క ఏడాదిలోనే మొత్తం రూ.22 లక్షలు ఖర్చు చేసినట్లు తెలిపింది. ఆ ఆర్డర్లలో 22 ఐఫోన్-17 మోడళ్లు, 24 క్యారెట్ బంగారు నాణేలు, ఎయిర్ ఫ్రైయర్‌తో పాటు పాలు, ఐస్‌క్రీమ్‌లు, తాజా పండ్లు వంటి రోజువారీ అవసరాలూ ఉన్నాయని స్విగ్గీ వెల్లడించింది. ఇన్‌స్టామార్ట్ వేదికపై దేశవ్యాప్తంగా ప్రతి సెకనుకు సగటున నాలుగు పాల ప్యాకెట్లు ఆర్డర్ అవుతున్నాయి. 2025లో వినియోగదారులు ఆర్డర్ చేసిన మొత్తం పాల పరిమాణంతో 26 వేల ఒలింపిక్ సైజ్ స్విమ్మింగ్ పూల్స్ నింపవచ్చని నివేదికలో పేర్కొన్నారు.
వివరాలు
ఊహించని స్థాయిలో కండోమ్‌ల ఆర్డర్లు
ఇన్‌స్టామార్ట్‌లో నమోదయ్యే ప్రతి 127 ఆర్డర్లలో ఒకటి కండోమ్‌కు సంబంధించినదే అని స్విగ్గీ తెలిపింది. చెన్నైకు చెందిన ఒక వినియోగదారుడు ఈ ఏడాది కండోమ్‌ల కొనుగోలుకే రూ.1.06 లక్షలు ఖర్చు చేశాడని, మొత్తం 228 ఆర్డర్లు కేవలం ఈ ఉత్పత్తికోసమే పెట్టినట్లు నివేదిక వెల్లడించింది. వాలెంటైన్స్ డే రోజున గులాబీ పువ్వుల ఆర్డర్లలో బెంగళూరు దూసుకెళ్లింది. నిమిషానికి 1,780 రోజ్ ఆర్డర్లతో ఆ నగరం రికార్డు సృష్టించింది. మొత్తం దేశవ్యాప్తంగా చూస్తే ప్రతి నిమిషం సగటున 666 ఆర్డర్లు నమోదైనట్లు స్విగ్గీ తెలిపింది. అయితే గులాబీలపై అత్యధికంగా ఖర్చు చేసింది మాత్రం హైదరాబాదీనేనని, ఆయన రూ.31,240 విలువైన ఆర్డర్ చేశారని పేర్కొంది.
వివరాలు
మరిన్ని ఆసక్తికర విషయాలు
బెంగళూరుకు చెందిన ఒక వినియోగదారుడు నూడిల్స్ కొనుగోలుకు రూ.4.36 లక్షలకుపైగా ఖర్చు చేయగా, చెన్నైలోని ఒక పెట్ పేరెంట్ తన పెంపుడు జంతువుల ఆహారం తదితర అవసరాల కోసం రూ.2.41 లక్షలు వెచ్చించారు. ముంబైలో ఒక వినియోగదారుడు బంగారం కోసం రూ.15.6 లక్షలు ఖర్చు చేయగా, మరో ఆసక్తికర ఘటనలో బెంగళూరుకు చెందిన ఒకరు రూ.1.7 లక్షల విలువైన ఐఫోన్‌తో పాటు 178 లైమ్ సోడాలను కూడా ఒకే ఆర్డర్‌లో బుక్ చేసినట్లు నివేదిక తెలిపింది. టిప్స్ రూపంలో ఇచ్చే దానంలో కూడా నగరాల మధ్య పోటీ కనిపించింది. బెంగళూరులో ఒక వినియోగదారుడు మొత్తం రూ.68,600 టిప్స్‌గా చెల్లించగా,చెన్నైకు చెందిన మరో వినియోగదారుడు రూ.59,505 టిప్స్‌గా ఇచ్చినట్లు స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ నివేదిక పేర్కొంది.