Health insurance: గాలి నాణ్యతను పరిగణనలోకి తీసుకోనున్న ఆరోగ్య బీమా సంస్థలు!
ఈ వార్తాకథనం ఏంటి
ఆరోగ్య బీమా జారీ చేసే సమయంలో బీమా కంపెనీలు సాధారణంగా వ్యక్తి వయసు, బరువు, ఆరోగ్య పరిస్థితి, ధూమపానం అలవాటు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటాయి.
వీటి ఆధారంగా ఆరోగ్య బీమా ప్రీమియం నిర్ణయిస్తారు. ధూమపానం చేసేవారి ప్రీమియం,చేయని వారి కంటే ఎక్కువగా ఉండేలా ప్రత్యేకంగా అమలు చేస్తారు.
అయితే ఇప్పుడు వాయు నాణ్యతను కూడా ఈ లెక్కల్లో భాగం చేసేందుకు బీమా సంస్థలు యోచిస్తున్నాయి.
విశేషంగా దేశ రాజధాని దిల్లీలో గాలి నాణ్యత అంతంత మాత్రంగానే ఉండటంతో, దీన్ని ప్రీమియం నిర్ణయానికి ఒక ప్రమాణంగా తీసుకోవాలని ఆలోచన కొనసాగుతోందని రాయిటర్స్ నివేదించింది.
ఈ విధానం అమలైనట్లయితే దిల్లీ ప్రజలు 10-15% అధిక ప్రీమియం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశముంది.
వివరాలు
బీమా నియంత్రణ సంస్థ ఆమోదిస్తుందా?
ప్రస్తుతం వివిధ బీమా సంస్థలు ఈ ప్రతిపాదనపై చర్చిస్తున్నాయి. అయితే ఇది అమలులోకి రావడానికి ముందుగా బీమా నియంత్రణ సంస్థ (IRDAI) అనుమతి అవసరం.
ఇదే జరిగితే దేశంలో ఆరోగ్య బీమా ప్రీమియాన్ని గాలి నాణ్యత ఆధారంగా నిర్ణయించే తొలి పరిణామంగా నిలుస్తుంది.
దీని ప్రభావం ఇతర నగరాల్లో కూడా చూపించవచ్చు, తద్వారా బీమా సంస్థలు తమ ప్రీమియం వసూళ్లను మరింత పెంచుకునే అవకాశం కలుగుతుంది.
వివరాలు
కాలుష్య ప్రభావం, ఆరోగ్య సమస్యలు
దిల్లీ గాలి కాలుష్యం నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ప్రధానంగా వాహన కాలుష్యం నిర్మాణ కార్యకలాపాలు రైతులు పంట వ్యర్థాలకు నిప్పు పెట్టడం వంటి కారణాల వల్ల గాలి నాణ్యత రోజురోజుకూ దిగజారుతోంది.
దీని ప్రభావంగా ఆస్తమా, శ్వాసకోశ వ్యాధులు పెరిగిపోతున్నాయి. ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.
గణాంకాల ప్రకారం 2023 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2025 నాటికి ఆరోగ్య బీమా ఉపయోగించుకునే వారి సంఖ్య 8% మేర పెరిగింది.
ఈ నేపథ్యంలో ప్రీమియం లెక్కింపు విధానంలో వాయు నాణ్యతను ఒక ప్రధాన అంశంగా చేర్చాలన్న ఆలోచన బీమా సంస్థల్లో బలపడుతోంది.
అయితే IRDAI దీనిని ఆమోదిస్తుందా? లేదా? అనే అంశం ఆసక్తికరంగా మారింది.