ఉద్యోగుల జీతాలను తగ్గిస్తున్న ఇంటెల్ సీఈఓ వేతనంలో 25 శాతం కోత
కాలిఫోర్నియాలోని ఫోల్సమ్ క్యాంపస్‌లో సుమారు 340 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించిన తర్వాత, వేతన కోతలను అమలు చేసినట్లు ఇంటెల్ సంస్థ తెలిపింది. ఈ తగ్గింపులు మిడ్-లెవల్ ఉద్యోగుల నుండి ఎగ్జిక్యూటివ్ వరకు ఉంటాయి. కంపెనీ ఆదాయం వేగంగా పడిపోవడంతో, సంస్థ ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. సంస్థ వార్షిక ఆదాయం 20% తగ్గింది. కంపెనీ సీఈఓ తన వేతనంలో 25% కోత తీసుకుంటుండగా, అతని ఎగ్జిక్యూటివ్ టీమ్ కు జీతంలో 15% తగ్గింది. సీనియర్ మేనేజర్ల వేతనం 10% తగ్గింది, మిడ్-టైర్ మేనేజర్లు 5% వేతన కోత తీసుకుంటున్నారు. కంపెనీ గంటలవారీ కార్మికులు, లెవెల్ 7 క్రింద ఉన్నవారికి ఎటువంటి కోతలు లేవు.
కాలిఫోర్నియాలో 544 మంది ఉద్యోగులను తొలగించాలని ఆలోచిస్తున్న ఇంటెల్
డిసెంబర్ 31న ముగిసిన త్రైమాసికంలో, ఇంటెల్ ఆదాయంలో సంవత్సరానికి 32% క్షిణించింది. కంపెనీ అమ్మకాలు తగ్గడం ఇది వరుసగా నాలుగో త్రైమాసికం. 2021లో $4.62 బిలియన్ల లాభంతో పోలిస్తే, $664 మిలియన్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. ఇంటెల్ ఇప్పటివరకు వందలాది ఉద్యోగాలను తగ్గించింది. కంపెనీ తన మూడవ త్రైమాసిక ఫలితాల సమయంలో ఉద్యోగుల తొలగింపు గురించి మొదట ప్రకటించింది. కాలిఫోర్నియా ఎంప్లాయ్‌మెంట్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌కు దాఖలు చేసిన వర్కర్ అడ్జస్ట్‌మెంట్ అండ్ రీట్రైనింగ్ నోటీసు (వార్న్) ప్రకారం, కంపెనీ కాలిఫోర్నియాలో 544 మంది ఉద్యోగులను తొలగించాలని ఆలోచిస్తుంది. ఇందులో శాంటా క్లారా కార్యాలయంలో 201 మంది, ఫోల్సమ్ క్యాంపస్‌లో 343 మంది ఉన్నారు.