Intel: ట్రంప్ కీలక ప్రకటన.. ఆపిల్‌తో చిప్ ఒప్పందం.. 10% పెరిగిన ఇంటెల్ షేర్లు!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా సెమీకండక్టర్ దిగ్గజం ఇంటెల్ (Intel) షేర్లు గురువారం ఏకంగా 10 శాతం వరకు లాభపడ్డాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇంటెల్, ఆపిల్ (Apple) మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం కుదిరినట్లు ప్రకటించడంతో మార్కెట్లో ఈ కంపెనీ షేర్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ ఒప్పందం ద్వారా అమెరికాలోనే అత్యాధునిక చిప్‌ల రూపకల్పన, తయారీ చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ట్రంప్ సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో స్పందిస్తూ.. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా తైవాన్‌తో పాటు ఇతర దేశాలు అమెరికా సెమీకండక్టర్ పరిశ్రమను తమవైపు తిప్పుకున్నాయని విమర్శించారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా చిప్‌ల తయారీ మళ్లీ అమెరికాలోనే జరగాలని భావించి ఇంటెల్‌కు మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు.
వివరాలు
ఇంటెల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 608.7 బిలియన్ డాలర్లకు..
ఇటీవల కాలంలో ఇంటెల్ షేర్లు విశేషంగా పుంజుకున్నాయి. గత ఏడాదితో పోలిస్తే కంపెనీ స్టాక్ విలువ 464 శాతం పెరగగా,మార్కెట్ క్యాపిటలైజేషన్ 608.7 బిలియన్ డాలర్లకు చేరుకుంది. గత ఏడాది ప్రారంభంలో సీఈవోగా బాధ్యతలు చేపట్టిన లిప్-బు టాన్ నాయకత్వంలో కంపెనీ తిరిగి పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. నివిడియా (NVIDIA)తో పాటు ట్రంప్ ప్రభుత్వం కూడా ఇంటెల్‌కు మద్దతు ప్రకటించడం విశేషం. ఇంటెల్ ప్రతిష్ఠాత్మక 'టెరాఫ్యాబ్' (Terafab) ప్రాజెక్ట్ కూడా ఈ ఒప్పందంతో మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటి వరకు ప్రధానంగా తన ఉత్పత్తుల కోసం మాత్రమే చిప్‌లను తయారు చేసిన ఇంటెల్, ఇప్పుడు ఇతర ప్రముఖ కంపెనీల కోసం కూడా భారీ స్థాయిలో చిప్ తయారీ చేపట్టనుంది.
వివరాలు
90 శాతం పెరిగిన నాస్‌డాక్ పీహెచ్‌ఎల్‌ఎక్స్ సెమీకండక్టర్ సూచీ
ఇదే సమయంలో మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు సరఫరా వ్యవస్థలపై ప్రభావం చూపుతూ చమురు ధరలను పెంచుతున్నప్పటికీ, కృత్రిమ మేధ (AI) రంగం వృద్ధి టెక్నాలజీ కంపెనీల షేర్లకు బలాన్నిస్తోంది. ఈ ఏడాది నాస్‌డాక్ పీహెచ్‌ఎల్‌ఎక్స్ సెమీకండక్టర్ సూచీ సుమారు 90 శాతం పెరిగింది. మరోవైపు, ఆపిల్ కూడా తన చిప్ తయారీ సామర్థ్యాన్ని విస్తరించుకునే వ్యూహంలో భాగంగానే ఇంటెల్‌తో చేతులు కలిపినట్లు తెలుస్తోంది.
వివరాలు
ఆపిల్, ఇంటెల్ మధ్య ప్రాథమిక ఒప్పందం
ప్రస్తుతం ఆపిల్ ప్రధానంగా టీఎస్‌ఎంసీ (TSMC)పై ఆధారపడుతుండగా, ఏఐ చిప్‌లకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా అదనపు తయారీ భాగస్వాములను వెతుకుతోంది. ఏడాదికిపైగా చర్చలు జరిగిన అనంతరం ఆపిల్, ఇంటెల్ మధ్య ప్రాథమిక ఒప్పందం కుదిరినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ పరిణామం అమెరికా చిప్ పరిశ్రమకు కొత్త ఊపు తీసుకురావడంతో పాటు ప్రపంచ సెమీకండక్టర్ రంగంలో కీలక మార్పులకు దారి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి.