Page Loader
#NewsBytesExplainer: భారత రూపాయి గుర్తు ₹ ఎంపికలోనే వివాదం.. అదేంటో తెలుసా?
భారత రూపాయి గుర్తు ₹ ఎంపికలోనే వివాదం.. అదేంటో తెలుసా?

#NewsBytesExplainer: భారత రూపాయి గుర్తు ₹ ఎంపికలోనే వివాదం.. అదేంటో తెలుసా?

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 14, 2025
01:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

తాజాగా, కేంద్రం, తమిళనాడు డీఎంకే ప్రభుత్వాల మధ్య హిందీపై తలెత్తిన వివాదం 'రూపీ' చిహ్నంపై కూడా ప్రభావం చూపింది. తమిళనాడు రాష్ట్ర బడ్జెట్‌లో ఇప్పటివరకు ఉపయోగిస్తున్న ₹ చిహ్నాన్ని తొలగించి, తమిళ అక్షరంతో 'రూ' అనే గుర్తును ప్రవేశపెట్టారు. ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది. గమనించదగిన విషయం ఏమిటంటే, భారత రూపాయి ₹ చిహ్నాన్ని డిజైన్ చేసినది తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తే. 3,000కిపైగా ప్రతిపాదనలతో పోటీ జరిగినప్పటికీ, చివరికి ఈ చిహ్నం ఎంపికైంది. అయితే, ఈ ఎంపిక ప్రక్రియ కూడా వివాదాస్పదమైంది.

వివరాలు 

భారత రూపాయి చిహ్నం ఎంపిక - బ్యాక్‌గ్రౌండ్ 

2009 మార్చి 5న, భారత ప్రభుత్వం భారతీయ రూపాయికి ప్రత్యేకమైన గుర్తును రూపొందించేందుకు దేశవ్యాప్త పోటీ నిర్వహించింది. 2010 కేంద్ర బడ్జెట్ సందర్భంగా అప్పటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ, ఈ చిహ్నం భారతదేశ సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఉండాలని తెలిపారు. ఈ పోటీకి 3,331 డిజైన్లు సమర్పించబడ్డాయి. వీటిలో ఐదు శ్రేష్ఠమైన డిజైన్లు షార్ట్‌లిస్ట్ అయ్యాయి. ఫైనల్ రౌండ్‌కు వచ్చిన డిజైన్లు నందిత మెహ్రోత్రా, హితేశ్ పద్మశాలి, షిబిన్ కేకే, షారుఖ్ ఇరానీ, డి. ఉదయ్‌కుమార్ రూపొందించినవే. చివరకు 2010 జూన్‌లో కేంద్ర మంత్రివర్గం సమావేశమై, ఉదయ్‌కుమార్ రూపొందించిన ₹ చిహ్నాన్ని అధికారికంగా ఎంపిక చేసింది.

వివరాలు 

ఉదయ్‌కుమార్ ఎవరు? 

ఈ చిహ్నాన్ని రూపొందించిన డి. ఉదయ్‌కుమార్, తమిళనాడుకు చెందిన వ్యక్తి. ఆయన డీఎంకే మాజీ ఎమ్మెల్యే కుమారుడు. ₹ చిహ్నంలోని ప్రత్యేకతలు ఉదయ్‌కుమార్ రూపొందించిన రూపాయి చిహ్నం దేవనాగరి లిపిలోని 'ర',లాటిన్‌లోని 'R' అక్షరాల మేళవింపుతో రూపుదిద్దుకుంది. చిహ్నంలోని రెండు గీతలు భారత జాతీయ పతాకానికి సంకేతంగా ఉండటమే కాకుండా, సమానత్వాన్ని కూడా సూచిస్తాయి. భారతదేశ ఆర్థిక అసమానతలను తగ్గించాలనే భావనను ఇది ప్రతిబింబిస్తుంది. 2010 నుంచి ఈ చిహ్నం అధికారికంగా అమలులోకి వచ్చింది. నాణేలు, కరెన్సీ నోట్లతో పాటు, పోస్టల్ స్టాంపులు, బ్యాంకు చెక్కులు, ఇతర అధికారిక ప్రామాణిక డాక్యుమెంట్లపై కూడా ఈ చిహ్నం కనిపిస్తోంది.

వివరాలు 

ఎంపికపై వివాదం 

ఈ ఎంపిక ప్రక్రియ మొదటి నుంచి వివాదాస్పదంగా మారింది. రూపాయి చిహ్నం పోటీలో పాల్గొన్న రాకేశ్‌కుమార్ అనే వ్యక్తి ఎంపికలో నిబంధనలను పాటించలేదని, వివక్ష చూపించారని ఆరోపిస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆయన పేర్కొన్న కారణాలకు ఆధారాలు లేకపోవడంతో, హైకోర్టు సింగిల్ బెంచ్ ఈ పిటిషన్‌ను కొట్టివేసింది. అయితే, తరువాత డివిజన్ బెంచ్ ఈ వ్యవహారంపై కీలక ఆదేశాలు జారీ చేసింది. జాతీయ గుర్తులు, లోగోలు రూపొందించడానికి జరిగే పోటీల్లో అవకతవకలు జరగకుండా, ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందించాలని అన్ని మంత్రిత్వశాఖలకు సూచించింది. 2013 ఏప్రిల్‌లో ఆర్థికశాఖ దీనికి సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేసింది.