Maoist Commander Hidma: మావోయిస్టు పార్టీలో భీకర గెరిల్లా దాడులకు వ్యూహకర్తగా పేరొందిన మద్వి హిడ్మా ఎవరు?
ఈ వార్తాకథనం ఏంటి
వరుసగా ఎదుర్కొంటున్న పరాజయాలతో ఇప్పటికే ఒత్తిడిలో ఉన్న మావోయిస్టులకు మరో గట్టి దెబ్బ తగిలింది. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భద్రతాదళాలు చేపట్టిన ఆపరేషన్‌లో మావోయిస్టుల కీలక నాయకుడు, అగ్ర శ్రేణి వ్యూహకర్త మద్వి హిడ్మా అలియాస్ సంతోష్ మృతి చెందాడు. భారీ గెరిల్లా దాడులకు పథకాలు రచించడంలో పేరు పొందిన హిడ్మా మృతి చెందడం భద్రతా బలగాలకు ఒక పెద్ద విజయంగా భావిస్తున్నారు. భద్రతా బలగాలపై కనీసం 26 సాయుధ దాడులకు ఇతడు పథక రచన చేసినట్లు సమాచారం.
వివరాలు
17 ఏళ్ల వయసులో ఉద్యమం వైపు..
ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లా పూవర్తి గ్రామానికి చెందిన హిడ్మాకు విలాస్, హిడ్మాల్, సంతోష్ వంటి పేర్లు కూడా వినియోగంలో ఉన్నాయి. మావోయిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితుడై కేవలం 17 వయసులోనే పార్టీలో చేరాడు. మురియా తెగకు చెందిన అతనికి ఇంగ్లీష్,హిందీ,గోండు,తెలుగు,కోయ,బెంగాలీ భాషల్లో మంచి పట్టు ఉంది. దండకారణ్య ప్రాంతంలో పార్టీ కార్యకలాపాలను నడిపించడంలో అతడు ప్రముఖ పాత్ర పోషించాడు. భారీ దాడుల వ్యూహ రచనలో అతని పేరు ముందుంటుంది. అరణ్యాల్లో ఉన్న కేంద్ర బలగాల శిబిరాలపై ఆకస్మిక దాడులు చేయడంలో ఘన అనుభవం కలిగిన కమాండర్‌గా ప్రాచుర్యం పొందాడు. పీఎల్‌జీఏ తొలి బెటాలియన్‌కు నాయకత్వం వహిస్తూ, పెద్ద దాడులలో స్వయంగా పాల్గొనడం వలన అతడు కేంద్ర దళాలకు మోస్ట్ వాంటెడ్ నేరస్తుడిగా మారాడు.
వివరాలు
పోలీసులకు కొరకరాని కొయ్య..
ఇటీవల కేంద్రకమిటీలో కూడా చోటు సంపాదించాడు. సాధారణంగా ఈ పదవిలో తెలుగు రాష్ట్రాల కార్యకర్తలు ఎక్కువగా ఉంటారు, కాని సుక్మా ప్రాంతానికి చెందిన వ్యక్తిగా ఆయన మొదటివాడు. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ(పీఎల్‌జీఏ)నంబర్ 1 బెటాలియన్‌కు హిడ్మా నేతృత్వం వహిస్తున్నాడు. దీనిలోని సభ్యులు అత్యాధునిక ఆటోమేటిక్ ఆయుధాలను వినియోగిస్తారు. ఇందులో దాదాపు 350మంది వరకు ఉన్నారని అంచనా. భద్రతా దళాలపై దాడుల తర్వాత స్వాధీనం చేసుకున్న ఆధునిక ఆయుధాలు,బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు ఈ బెటాలియన్ విస్తృతంగా ఉపయోగిస్తుంది. వీరు ప్రత్యేక యూనిఫాం ధరించి పనిచేస్తారని సమాచారం. హిడ్మా నేతృత్వంలో జరిగే దాడుల్లో మావోయిస్టులకు కలిగే ప్రాణనష్టం భద్రతా బలగాల నష్టంతో పోలిస్తే చాలా తక్కువగా.. సుమారు 10 శాతం కన్నా తక్కువగా.. ఉంటుందని చెబుతారు.
వివరాలు
కేడర్‌కు యుద్ధ నైపుణ్యాలు బోధించడంలో అతడికి అపార అనుభవం
ఇప్పటికే రెండు దశాబ్దాలుగా ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో జరిగిన అనేక ప్రముఖ దాడుల్లో అతని పాత్ర ఉందని నిఘా వర్గాలు గుర్తించాయి. చింతల్నార్, డోర్నాపాల్, తాడిమెట్ల, మినప ప్రాంతాల్లో జరిగిన భారీ ఆపరేషన్లలో అతను ప్రత్యక్షంగా వ్యవహరించి, దాదాపు 200 మందికి పైగా పోలీసులు మరణించడానికి కారణమయ్యాడని చెబుతారు. కేడర్‌కు యుద్ధ నైపుణ్యాలు బోధించడంలో అతడికి అపార అనుభవం ఉంది. కూంబింగ్ ఆపరేషన్లు చేస్తున్న పోలీసు దళాలు, సీఆర్పీఎఫ్ శిబిరాలపై మెరుపుదాడులు చేయడంలో ముందుండేవాడు. పార్టీ ఆర్‌అండ్‌డీ విభాగం కూడా అతడి పర్యవేక్షణలో పనిచేస్తుంది.
వివరాలు
హిడ్మా జరిపిన దాడుల్లో కొన్ని..
2010 దంతెవాడ దాడి - 76 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతిచెందారు 2013 జైరామ్ ఘాటి దాడి - 27 మంది మరణించారు; వీరిలో పలువురు కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారు 2021 సుక్మా-బీజాపుర్ దాడి - 22 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు
వివరాలు
బలమైన సమాచార వ్యవస్థ
హిడ్మా స్థానిక ఆదివాసీ తెగకు చెందినవాడని, అందువల్ల గ్రామస్థుల మద్దతు అతనికి బలంగా లభించేదని నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి నేపథ్యం వల్ల అతడు శక్తివంతమైన ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్‌ను నిర్మించుకున్నాడు. అతడు ఉన్న ప్రాంతానికి కిలోమీటర్ల దూరంలో జరిగినా భద్రతా దళాల కదలికలు అతడికి ముందుగానే తెలిసేవని అంటారు. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల సరిహద్దులు కలిసే ప్రాంతంలో అతని స్థావరం ఉండటం కూడా అతనికి ప్రయోజనకరమైంది. ఏడో తరగతి వరకు మాత్రమే చదివినా ఇంగ్లీష్‌లో ఫ్లూయెంట్‌గా మాట్లాడగలడని 2015లో ఒక విలేకరి పేర్కొన్నారు.
వివరాలు
కర్రెగుట్టల దాడితో ఆంధ్రాకు వచ్చి..
హిడ్మాను పట్టుకునేందుకు ఛత్తీస్‌గఢ్ పోలీసులు, సీఆర్పీఎఫ్ కోబ్రా ఫోర్సులు, తెలంగాణ గ్రేహౌండ్స్ బలగాలు విస్తృత కూంబింగ్ ఆపరేషన్లు కొనసాగిస్తున్నాయి. ఈ ఏడాది జనవరిలో కర్రెగుట్టలు, అబూజ్‌మడ్ పర్వతాలు, నేషనల్ పార్కు ప్రాంతాల్లో విస్తృత శోధన చేపట్టడంతో అనేకమంది మావోయిస్టు అగ్రనేతలు హతమయ్యారు. అప్పట్లో హిడ్మా కూడా పార్కులోనే తన బెటాలియన్‌తో ఉన్నట్లు అనుమానాలు చెలరేగాయి. ఆ సమయంలో అతడి తాజా ఫోటో బయటకు రావడంతో మరింత చర్చ జరిగింది.
వివరాలు
కర్రెగుట్టల దాడితో ఆంధ్రాకు వచ్చి..
భద్రతా దళాలు అతని స్థావరాన్ని కొద్ది గంటల వ్యవధిలో తప్పించుకున్నాడని అప్పటి నిఘా వివరాలు తెలిపాయి. తర్వాత సమీప పర్వత ప్రాంతంలో దాగినట్లు తెలిసింది. ఒక దశలో లొంగిపోవచ్చనే వార్తలు కూడా వినిపించాయి. ఆపరేషన్లు వరుసగా కొనసాగడంతో హిడ్మా తన బృందంతో కలిసి ఛత్తీస్‌గఢ్‌ను విడిచి ఆంధ్రా సరిహద్దుల వైపు కదిలాడని సమాచారం. మారేడుమిల్లి దారిగా ఆంధ్రాలోకి ప్రవేశించి, అక్కడినుంచి ఒడిశాకు చేరడానికి ప్రయత్నించగా, వారి కదలికలపై సమాచారం అందడంతో భద్రతా బలగాలు తాజాగా చేపట్టిన ఆపరేషన్‌లో అతడు మట్టుపడ్డాడు.