LOADING...
SEBI: ఆన్‌లైన్‌లో బంగారం పెట్టుబడి? ముందుగా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే!
ఆన్‌లైన్‌లో బంగారం పెట్టుబడి? ముందుగా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే!

SEBI: ఆన్‌లైన్‌లో బంగారం పెట్టుబడి? ముందుగా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 09, 2025
10:22 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగారం ధరలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో పసిడిలో పెట్టుబడి పెట్టాలనుకునే వారు కొత్త మార్గాల కోసం తహతహలాడుతున్నారు. ఈ పరిస్థితిలో డిజిటల్‌ గోల్డ్‌ (Digital Gold) అనే కొత్త పెట్టుబడి పద్ధతి చాలామందిని ఆకర్షిస్తోంది. నేరుగా బంగారం కొనుగోలు చేయకుండా, ఆన్‌లైన్‌ ద్వారా చిన్న మొత్తాలతోనే బంగారంలో మదుపు చేసే అవకాశాలను ఇవి కల్పిస్తున్నాయి. దీంతో పలు వెబ్‌సైట్లు, మొబైల్‌ యాప్‌లు, అలాగే చెల్లింపుల సేవలు అందించే సంస్థలూ డిజిటల్‌ గోల్డ్‌ పథకాలను ప్రవేశపెట్టాయి. తక్కువ మొత్తంతోనూ పెట్టుబడి పెట్టొచ్చనే సౌకర్యం కారణంగా అనేక మంది ఈ పథకాల వైపు మొగ్గుచూపుతున్నారు.

Details

దివాళా తీస్తే పెట్టుబడిదారులకు నష్టం

అయితే, ఈ పథకాలు ఎంత వెసులుబాటు కలిగించాయన్నదానికంటే భారీ ప్రమాదాలకే గురిచేయగలవని మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) హెచ్చరించింది. శనివారం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో సెబీ స్పష్టం చేసింది. డిజిటల్‌ గోల్డ్‌ లేదా ఇ-గోల్డ్‌ ఉత్పత్తులు సెబీ పరిధిలోకి రావు. ఇవి కమొడిటీ డెరివేటివ్‌ విభాగంలోనూ లేవు. అందువల్ల వీటిలో పెట్టుబడులు పెట్టిన వారికి ఎటువంటి పెట్టుబడిదారుల రక్షణ హామీ ఉండదు. ఒకవేళ ఆ సంస్థ లేదా యాప్‌ మూసివేయబడినా, దివాలా తీసినా పెట్టుబడిదారుల సొమ్ము నష్టపోయే అవకాశం ఉంది.

Details

సెబీ సూచించిన సురక్షిత మార్గాలు

బంగారంలో మదుపు చేయాలనుకునేవారు సెబీ ఆమోదించిన పెట్టుబడి పథకాలలో మాత్రమే పెట్టుబడులు పెట్టాలని సూచించింది. వాటిలో ప్రధానంగా- గోల్డ్‌ ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్లు (Gold ETFs) గోల్డ్‌ మ్యూచువల్‌ ఫండ్లు ఇలక్ట్రానిక్‌ గోల్డ్‌ రశీదులు (EGRs) ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ డెరివేటివ్స్‌ వంటివి ఉన్నాయి. వీటిలో పెట్టుబడి చేసేటప్పుడు తప్పనిసరిగా సెబీ వద్ద నమోదు చేసిన మధ్యవర్తుల ద్వారా మాత్రమే చేయాలని పేర్కొంది.

Details

పెట్టుబడిదారులు చేయాల్సినవి 

1. డిజిటల్‌ గోల్డ్‌ లేదా ఇ-గోల్డ్‌ పథకాలు అందించే సంస్థలు/యాప్‌లు సెబీ రిజిస్ట్రేషన్‌ పొందాయా అని ముందుగా నిర్ధారించుకోండి. 2. గోల్డ్‌ ఈటీఎఫ్‌లు, ఈజీఆర్‌లలో పెట్టుబడులు పెట్టాలంటే డీమ్యాట్‌ ఖాతా ద్వారా మాత్రమే కొనుగోలు చేయండి. 3. ఆన్‌లైన్‌లో కనిపించే ఆకర్షణీయమైన ఆఫర్లకు మోసపోవద్దు. పెట్టుబడి పెట్టే ముందు నష్టం సంభవించే అవకాశాలు కూడా అంచనా వేయండి. 4. ఇప్పటికే డిజిటల్‌ గోల్డ్‌ పథకాలలో పెట్టుబడి పెట్టి ఉంటే అప్రమత్తంగా వ్యవహరించండి.

Details

సురక్షితమైన మార్గాలను ఎంచుకోవాలి

పెద్దగా పేరు లేని సంస్థలలో మదుపు చేసినట్లయితే, వీలైనంత త్వరగా ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నించండి. ఆ డబ్బును సెబీ నియంత్రిత మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు అందించే గోల్డ్‌ ఫండ్లు, గోల్డ్‌ ఈటీఎఫ్‌లు లేదా గోల్డ్‌ ఈటీఎఫ్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌ (FoFs) లాంటి సురక్షిత మార్గాల్లోకి మళ్లించడం ఉత్తమం. సంక్షిప్తంగా చెప్పాలంటే, డిజిటల్‌ గోల్డ్‌ ఆకర్షణీయంగా కనిపించినా సెబీ నియంత్రణ లేకపోవడంతో మదుపరులకు రక్షణ ఉండదు. కాబట్టి బంగారంలో మదుపు చేసేముందు తప్పనిసరిగా సెబీ ఆమోదం పొందిన, సురక్షితమైన మార్గాలను మాత్రమే ఎంచుకోవడం మేలని నిపుణులు సూచిస్తున్నారు.