LOADING...
Iran: హర్మూజ్ జలసంధిపై ఇరాన్ తాజా ప్రకటన.. భారత్‌కు ఊరట కలిగే అవకాశం
హర్మూజ్ జలసంధిపై ఇరాన్ తాజా ప్రకటన.. భారత్‌కు ఊరట కలిగే అవకాశం

Iran: హర్మూజ్ జలసంధిపై ఇరాన్ తాజా ప్రకటన.. భారత్‌కు ఊరట కలిగే అవకాశం

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 06, 2026
08:20 am

ఈ వార్తాకథనం ఏంటి

గురువారం వెలువడిన తాజా ప్రకటన భారత్‌కు కొంత ఉపశమనం కలిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మన దేశానికి చమురు, గ్యాస్ సరఫరా చేసే నౌకల ప్రయాణంలో హర్మూజ్ జలసంధి కీలక పాత్ర పోషిస్తుంది. మంగళవారం వరకు చైనా జెండా ఉన్న నౌకలకు మాత్రమే హర్మూజ్‌లో ప్రవేశం ఉంటుందని ఇరాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఇరాన్ ఈ విషయంపై స్పష్టత ఇవ్వడంతో భారత్‌కు అనుకూల పరిస్థితులు ఏర్పడే అవకాశముందని భావిస్తున్నారు. ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే సముద్ర మార్గాల్లో ఒకటైన హర్మూజ్ జలసంధిలో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ప్రారంభమైన ఫిబ్రవరి 28 నుంచి దాదాపు అన్ని వాణిజ్య నౌకల రాకపోకలు నిలిచిపోయాయి.

వివరాలు 

ఐఆర్‌ఐబీ హెచ్చరిక 

అమెరికా, ఇజ్రాయెల్, ఐరోపా దేశాలు లేదా వారి మద్దతుదారులకు చెందిన నౌకలు జలసంధిలో కనిపిస్తే వాటిని ధ్వంసం చేస్తామని ఐఆర్‌ఐబీ ముందుగానే హెచ్చరించింది. అంతర్జాతీయ చట్టాలు, సంబంధిత తీర్మానాలకు అనుగుణంగా యుద్ధ పరిస్థితుల్లో హర్మూజ్ జలసంధిలో జరిగే నౌకా రాకపోకలపై నియంత్రణ ఇరాన్ చేతిలో ఉంటుందని కూడా ఐఆర్‌ఐబీ పేర్కొంది.

వివరాలు 

ఎందుకింత ప్రాధాన్యం?

ప్రపంచవ్యాప్తంగా సముద్ర మార్గం ద్వారా తరలించే మొత్తం చమురులో దాదాపు ఐదో వంతు హర్మూజ్ జలసంధి ద్వారానే రవాణా అవుతోంది. ఈ మార్గం మూతపడితే ఆసియా-యూరప్ మధ్య తూర్పు-పడమర సముద్ర మార్గానికి పెద్దగా ఇబ్బంది ఉండకపోయినా, కువైట్, ఇరాక్, ఇరాన్ సరిహద్దుల్లో ఉన్న పర్షియన్ గల్ఫ్ ప్రాంతానికి మాత్రం తీవ్ర అంతరాయం కలుగుతుంది. దుబాయ్‌లోని జెబెల్ అలి పోర్టుకు వెళ్లే ప్రధాన మార్గం కూడా ఇదే కావడంతో సుమారు 12 దేశాలకు సరుకు రవాణా ప్రభావితమవుతోంది. ఇంతకుముందు 1980 నుంచి 1988 వరకు సాగిన ఇరాక్-ఇరాన్ యుద్ధ సమయంలో కూడా వాణిజ్య నౌకల రాకపోకలకు పెద్దగా ఆటంకాలు ఏర్పడలేదు.

Advertisement

వివరాలు 

గ్యాస్ సరఫరాకు ముందుకొచ్చిన దేశాలు

పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ఖతార్ నుంచి గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో భారత్ ప్రత్యామ్నాయ దేశాల నుంచి సరఫరా పొందేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో భారత్‌కు గ్యాస్ అందించేందుకు ఆస్ట్రేలియా, కెనడా ముందుకు వచ్చాయి. అలాగే చమురు సరఫరా చేయడానికి అమెరికా కూడా సిద్ధంగా ఉందని తెలిపింది. ప్రస్తుతం భారత్ రోజుకు సుమారు 195 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్లు (MMSCMD) గ్యాస్ దిగుమతి చేసుకుంటోంది. ఇందులో దాదాపు 60 MMSCMD గ్యాస్ ఖతార్ నుంచే వస్తోంది. ఇదే సమయంలో చమురు,ఎల్పీజీ సరఫరాల కోసం అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA), పెట్రోలియం ఎగుమతి దేశాల సమాఖ్య (OPEC)లతో భారత ప్రభుత్వం చర్చలు కొనసాగిస్తోంది.

Advertisement

వివరాలు 

గ్యాస్ సరఫరాకు ముందుకొచ్చిన దేశాలు

హర్మూజ్ మార్గంలో ప్రయాణించే నౌకలకు ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (IDFC) ద్వారా బీమా కవరేజీ లభించేలా అమెరికా అధికారులతో భారత్ సంప్రదింపులు జరుపుతోంది. ప్రస్తుతం దేశంలో సుమారు ఎనిమిది వారాలకు సరిపడా ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల నిల్వలు ఉన్నాయని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అలాగే ఎల్పీజీ, ఎల్ఎన్‌జీ సరఫరాల విషయంలో కూడా భారత్ సురక్షిత స్థితిలోనే ఉందని సమాచారం.

వివరాలు 

ఈ ఏడాది చమురు ధర సగటు 63 డాలర్లు: ఫిచ్

యుద్ధ పరిస్థితుల కారణంగా బీమా కంపెనీలు నౌకలకు కవరేజీ ఇవ్వడం నిలిపివేయడంతో హర్మూజ్ మార్గంలో నౌకలు ప్రయాణించడం తగ్గిందని అమెరికా-బ్రిటన్ క్రెడిట్ రేటింగ్ సంస్థ ఫిచ్ తెలిపింది. అయితే ఈ మార్గం అధికారికంగా మూసివేయలేదని కూడా స్పష్టం చేసింది. దీంతో చమురు ధరలు భారీగా పెరిగే అవకాశం లేదని ఫిచ్ అంచనా వేస్తోంది. ఈ ఏడాది బ్యారెల్ చమురు సగటు ధర 63 డాలర్లుగా ఉంటుందని పేర్కొంది. ప్రస్తుతం మార్కెట్లో బ్యారెల్ చమురు ధర 82 నుంచి 85 డాలర్ల మధ్య ట్రేడవుతోంది.

వివరాలు 

ఫార్మా రంగానికి భారీ నష్టం?

ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధ ప్రభావంతో సరఫరా, రవాణా వ్యవస్థల్లో ఆటంకాలు ఏర్పడితే దేశీయ ఫార్మా పరిశ్రమకు రూ.2,500 నుంచి రూ.5,000 కోట్ల వరకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని పరిశ్రమ సంఘం ఫార్మెగ్జిల్ అంచనా వేస్తోంది.

Advertisement