
Ethanol Blended Petrol: మీ వాహనానికి 20% ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ సురక్షితమేనా? కేంద్రం క్లారిటీ
ఈ వార్తాకథనం ఏంటి
ఇథనాల్ మిశ్రమంతో ఉన్న పెట్రోల్ (E20) సురక్షితం కాదంటూ కొన్ని కథనాలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. ఇది పాత తరహా వాహనాల పనితీరును దెబ్బతీస్తుందా? డ్రైవింగ్ అనుభవాన్ని ప్రభావితం చేస్తుందా? అంటూ ఓ పోస్టు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. దీంతో ప్రజల్లో భయాలు, సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దీనిపై స్పందిస్తూ స్పష్టతనిచ్చింది. పెట్రోలియం,సహజ వాయువు మంత్రిత్వశాఖ ఒక వివరణ విడుదల చేసింది. ఇ20 ఇంధనంపై జరుగుతున్న నెగటివ్ ప్రచారాన్ని ఖండిస్తూ, అందులో పేర్కొన్న భయాలు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేనివని తేల్చింది. నిపుణుల విశ్లేషణ ప్రకారం ఇవన్నీ అవాస్తవాలని స్పష్టం చేసింది.
వివరాలు
ఈ మిశ్రమ ఇంధనం వలన కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయి
ఇథనాల్ మిశ్రమంతో ఉన్న పెట్రోల్ వాడకం వలన వాహనాల ఇంజిన్‌కు ఎటువంటి సమస్యలు ఏర్పడవని మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. ఈ మిశ్రమ ఇంధనం వలన కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయని,అదే సమయంలో గ్రామీణ ప్రాంతాల ఆర్థిక వ్యవస్థకు ఇది కలిసివచ్చే అవకాశముందని పేర్కొంది. ఇథనాల్‌కు పెట్రోలుతో పోలిస్తే తక్కువ శక్తి (ఎనర్జీ డెన్సిటీ) ఉన్నా,దాని ప్రభావం మైలేజ్‌పై చాలా స్వల్పంగా మాత్రమే ఉంటుందని తెలిపింది. లక్ష కిలోమీటర్ల ప్రయాణం చేసిన వాహనాలపై సంప్రదాయ పెట్రోల్,ఇ20 వాడకం మధ్య తేడాలు ఏవైనా ఉన్నాయా అనే విషయంలో పరిశీలన జరిపితే.. పవర్, టార్క్, ఇంధన సామర్థ్యంలో గణనీయమైన తేడాలు లేవని తేలిందని పేర్కొంది.
వివరాలు
2014-15 నుండి ఇప్పటివరకు రూ.1.40 లక్షల కోట్ల విదేశీ మారకద్రవ్యం ఆదా
ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ARAI), ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం (IIP), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) వంటి సంస్థలు నిర్వహించిన అధ్యయనాల్లో ఇంజిన్ పనితీరుపై ఎలాంటి ప్రతికూల ప్రభావాలు కనిపించలేదని వెల్లడించింది. ఇ20 ఉపయోగం వల్ల భారత్ 2014-15 నుండి ఇప్పటివరకు సుమారు రూ.1.40 లక్షల కోట్ల విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేసిందని ప్రభుత్వం తెలిపింది. అలాగే, ఇథనాల్ సేకరణ కార్యక్రమాల ద్వారా రూ.1.20 లక్షల కోట్ల మేర రైతుల ఆదాయంగా చేరిందని, దీనివల్ల ఉపాధి అవకాశాలు కూడా పెరిగాయని వివరించింది.
వివరాలు
ఇథనాల్ సరఫరా ఏడాది వంబరు నుండి అక్టోబరు వరకు
ఇ20కి మారడం అకస్మాత్తుగా జరిగిన ప్రక్రియ కాదని కేంద్రం స్పష్టం చేసింది. దీనిపై అవగాహన లేకుండా అమలు చేశారన్న వాదన తప్పుడు అని ఖండించింది. 2021 నుంచే దీనికి సంబంధించి సమాచారం అందుబాటులో ఉందని పేర్కొంది. 2022 జూన్ నాటికి ప్రభుత్వ రంగ చమురు సంస్థలు 10 శాతం ఇథనాల్‌ను పెట్రోల్‌లో కలపాలన్న లక్ష్యాన్ని ఐదు నెలల ముందుగానే చేరుకున్నాయని ఈ ఏడాది మార్చిలో కేంద్రం తెలిపింది. సాధారణంగా ఇథనాల్ సరఫరా ఏడాది(ఈఎస్‌వై) నవంబరు నుండి అక్టోబరు వరకు ఉంటుంది. 2022-23 సరఫరా సంవత్సరానికి 12.06 శాతం, 2023-24లో 14.60 శాతం, 2024-25 నవంబర్-ఫిబ్రవరి మధ్య 17.98 శాతం స్థాయికి పెరిగింది. ఇక 2025 ఫిబ్రవరిలో ఇది 19.68 శాతానికి చేరిందని వివరించింది.
వివరాలు
ఇథనాల్ బ్లెండింగ్‌ను 2030 కల్లా 20 శాతానికి పెంచాలన్నది లక్ష్యం
ఇథనాల్ బ్లెండింగ్‌ను 2030 కల్లా 20 శాతానికి పెంచాలన్నది మొదటిసారి నిర్దేశించిన లక్ష్యం. కానీ 2022లోనే దాన్ని ముందుగానే 2025-26 సరఫరా సంవత్సరానికి ముందుగానే సాధించాలనే లక్ష్యంగా మార్పు చేశారు. ప్రస్తుతం ప్రపంచ రవాణా రంగం శిలాజ ఇంధనాల తగ్గుదల, ముడి చమురు ధరల్లో మార్పులు, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన కఠినమైన నిబంధనల వంటి సవాళ్లను ఎదుర్కొంటున్న నేపథ్యంలో, ఇథనాల్‌ను ఒక శుద్ధమైన, పర్యావరణ అనుకూలమైన ప్రత్యామ్నాయ ఇంధనంగా భావిస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది.