LOADING...
ITR Filing 2026: ఐటీఆర్ గడువులు మారాయి.. ఉద్యోగులు,వ్యాపారులకు కొత్త డెడ్‌లైన్లు
ఐటీఆర్ గడువులు మారాయి.. ఉద్యోగులు,వ్యాపారులకు కొత్త డెడ్‌లైన్లు

ITR Filing 2026: ఐటీఆర్ గడువులు మారాయి.. ఉద్యోగులు,వ్యాపారులకు కొత్త డెడ్‌లైన్లు

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 30, 2026
12:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రతి ఏడాది జూలై 31లోపు ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేసే వారికి ఈసారి కీలక మార్పు వచ్చింది. అసెస్‌మెంట్ ఇయర్ 2026-27 (2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయం) కోసం కేంద్ర ప్రభుత్వం ఐటీఆర్ గడువులను కొత్తగా విభజించింది. ఇకపై అందరికీ ఒకే జూలై 31 గడువు ఉండదు.మీరు ఏ ఐటీఆర్ ఫారం దాఖలు చేస్తున్నారనే దానిపై చివరి తేదీ ఆధారపడి ఉంటుంది. బడ్జెట్ 2026లో తీసుకొచ్చిన మార్పుల ప్రకారం జీతం పొందే ఉద్యోగులు,పెన్షనర్లు,పెట్టుబడిదారులు దాఖలు చేసే ITR-1,ITR-2 ఫారాలకు గడువు యథావిధిగా 2026 జూలై 31గానే ఉంటుంది. జీతం,వడ్డీ ఆదాయం,మూలధన లాభాలు లేదా ఒకటి,రెండు ఇళ్ల నుంచి వచ్చే ఆదాయం ఉన్నవారు ఈ గడువులోపు రిటర్న్ దాఖలు చేయాలి.

వివరాలు 

ట్యాక్స్ ఆడిట్ తప్పనిసరి అయిన కేసులకు మాత్రం ఎలాంటి మార్పులేదు

అయితే వ్యాపారం లేదా వృత్తి ద్వారా ఆదాయం పొందుతూ ట్యాక్స్ ఆడిట్ అవసరం లేని వారు దాఖలు చేసే ITR-3,ITR-4 ఫారాలకు అదనంగా ఒక నెల సమయం ఇచ్చారు. వీరి చివరి తేదీ 2026 ఆగస్టు 31గా నిర్ణయించారు. ఫ్రీలాన్సర్లు,కన్సల్టెంట్లు,వైద్యులు,న్యాయవాదులు,చిన్న వ్యాపారులు,భాగస్వామ్య సంస్థల భాగస్వాములు, ప్రిజంప్టివ్ ట్యాక్సేషన్ పరిధిలో ఉన్న వారికి ఈ నిర్ణయం పెద్ద ఊరటగా మారింది. దీంతో ఖాతాలపరిశీలన,లెక్కల సరిపోల్చడం,తప్పులు సరిదిద్దుకోవడానికి అదనపు సమయం లభిస్తుంది. ట్యాక్స్ ఆడిట్ తప్పనిసరి అయిన కేసులకు మాత్రం ఎలాంటి మార్పులేదు. అలాంటి వారు 2026 అక్టోబర్ 31లోపు ఐటీఆర్ దాఖలు చేయాలి. ఆడిట్ రిపోర్టును సెప్టెంబర్ 30లోపు సమర్పించాల్సి ఉంటుంది. ట్రాన్స్‌ఫర్ ప్రైసింగ్‌కు సంబంధించిన కేసులకు గడువు 2026 నవంబర్ 30గానే కొనసాగుతుంది.

వివరాలు 

కొత్త ఐటీఆర్ గడువులు

ITR-1, ITR-2 - 2026 జూలై 31 ITR-3, ITR-4 (ఆడిట్ అవసరం లేనివి) - 2026 ఆగస్టు 31 ట్యాక్స్ ఆడిట్ కేసులు - 2026 అక్టోబర్ 31 ట్రాన్స్‌ఫర్ ప్రైసింగ్ కేసులు - 2026 నవంబర్ 30 ఆలస్యంగా దాఖలు చేసే రిటర్న్ (Belated Return) - 2026 డిసెంబర్ 31 సవరించిన రిటర్న్ (Revised Return) - 2027 మార్చి 31

Advertisement

వివరాలు 

సవరించిన రిటర్న్‌కు సంబంధించిన కీలక మార్పు

మరో కీలక మార్పు సవరించిన రిటర్న్‌కు సంబంధించినది. ఇప్పటి వరకు రిటర్న్‌లో ఏదైనా పొరపాటు కనిపిస్తే అదే అసెస్‌మెంట్ ఇయర్‌లో డిసెంబర్ 31లోపు మాత్రమే సవరించే అవకాశం ఉండేది. ఇకపై ఈ గడువును 2027 మార్చి 31 వరకు పొడిగించారు.సెక్షన్ 80C మినహాయింపు నమోదు చేయడం మరిచిపోయినా, AIS లేదా ఇతర వివరాల్లో పొరపాట్లు ఉన్నా వాటిని సరిదిద్దుకోవడానికి పన్ను చెల్లింపుదారులకు మరింత సమయం లభిస్తుంది. అయితే గడువు దాటితే కేవలం ఆలస్య రుసుమే కాదు,మరిన్ని నష్టాలు ఎదురవుతాయి. ఆలస్యంగా రిటర్న్ దాఖలు చేస్తే సెక్షన్ 234F ప్రకారం రూ.5,000వరకు జరిమానా విధిస్తారు. మొత్తం ఆదాయం రూ.5లక్షలలోపు ఉంటే ఈ జరిమానా రూ.1,000మాత్రమే ఉంటుంది. చెల్లించాల్సిన పన్నుపై వడ్డీ కూడా చెల్లించాల్సి వస్తుంది.

Advertisement

వివరాలు 

కొత్త పన్ను విధానంలోకి..

అంతేకాదు, గడువు దాటితే పాత పన్ను విధానాన్ని (Old Tax Regime) ఎంచుకునే అవకాశం కోల్పోయి, డిఫాల్ట్‌గా కొత్త పన్ను విధానంలోకి వెళ్లాల్సి రావచ్చు. అలాగే కొన్ని రకాల నష్టాలను భవిష్యత్తు సంవత్సరాలకు బదిలీ చేసుకునే హక్కును కూడా కోల్పోతారు. అందుకే గడువులను తప్పకుండా పాటించాలని పన్ను నిపుణులు సూచిస్తున్నారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, అసెస్‌మెంట్ ఇయర్ 2026-27 అనేది 1961 ఆదాయపు పన్ను చట్టం కింద జరిగే చివరి ఐటీఆర్ ఫైలింగ్ సీజన్.

వివరాలు 

రిటర్న్ దాఖలు చేసే ముందు..

2025 ఆదాయపు పన్ను చట్టం 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చినప్పటికీ, ఈ ఏడాది ఉపయోగించే ఐటీఆర్ ఫారాలు మాత్రం పాత చట్టం ప్రకారమే ఉంటాయి. రిటర్న్ దాఖలు చేసే ముందు ఫారమ్-16, ఫారమ్-26AS, AIS వివరాలను ఒకసారి సరిపోల్చుకోవాలి. అలాగే పాత, కొత్త పన్ను విధానాల్లో ఏది లాభదాయకమో పరిశీలించి రిటర్న్ దాఖలు చేయాలి. రిటర్న్ సమర్పించిన తర్వాత 30 రోజుల్లోపు ఈ-వెరిఫికేషన్ పూర్తి చేయడం కూడా తప్పనిసరి.

Advertisement