LOADING...
Hwaseung: కుప్పంలో హ్వాసెంగ్‌ మెగా ప్లాంట్‌.. రూ.898 కోట్ల పెట్టుబడి
కుప్పంలో హ్వాసెంగ్‌ మెగా ప్లాంట్‌.. రూ.898 కోట్ల పెట్టుబడి

Hwaseung: కుప్పంలో హ్వాసెంగ్‌ మెగా ప్లాంట్‌.. రూ.898 కోట్ల పెట్టుబడి

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 30, 2026
08:57 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ క్రీడా ఉత్పత్తుల బ్రాండ్ అడిడాస్‌కు బూట్లు (షూస్‌) తయారు చేసి సరఫరా చేసే ప్రధాన భాగస్వామి హ్వాసెంగ్‌ సంస్థ భారత్‌లో తన తొలి తయారీ యూనిట్‌ను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే దక్షిణ కొరియా, తైవాన్‌, వియత్నాం, ఇండోనేసియా, చైనాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ.. ఇప్పుడు భారత్‌లో పెట్టుబడులకు ఏపీని ఎంచుకుంది. మొదట ఈ ప్రాజెక్టును తమిళనాడుకు తీసుకెళ్లేందుకు అక్కడి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నించింది. గత ఏడాది ఆగస్టులో నాన్‌-లెదర్‌ స్పోర్ట్స్‌ షూస్‌ తయారీ ప్లాంటు ఏర్పాటుకు హ్వాసెంగ్‌తో ఒప్పందం కుదుర్చుకుని, తూత్తుకుడి జిల్లాలో పరిశ్రమను నెలకొల్పాలని ప్రాథమికంగా నిర్ణయించింది.

వివరాలు 

పొగురుపల్లెలో 100 ఎకరాల భూమిని కేటాయించిన ప్రభుత్వం

అయితే ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలకు అనుకూల వాతావరణం ఉండడం, సింగిల్‌ డెస్క్‌ విధానంలో వేగంగా అనుమతులు మంజూరు చేయడం, అవసరమైన ప్రోత్సాహకాలు, రాయితీలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉండటంతో హ్వాసెంగ్‌ సంస్థ తన నిర్ణయాన్ని మార్చుకుంది. రాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన చర్చల అనంతరం ఏపీలోనే పెట్టుబడి పెట్టేందుకు అంగీకారం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచన మేరకు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి కంపెనీ సుముఖత వ్యక్తం చేసింది. ఇందుకోసం కుప్పం సమీపంలోని గుడుపల్లె మండలం పొగురుపల్లెలో 100 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది.

వివరాలు 

17,465 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు

ఈ ప్రాజెక్టు కోసం హ్వాసెంగ్‌ సంస్థ మూడు విడతల్లో మొత్తం రూ.898 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ ప్లాంట్‌ ద్వారా 17,465 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు లభించనున్నాయి. ముఖ్యంగా మహిళలకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కుప్పం ప్రాంతానికి పలు పెట్టుబడులు వచ్చినప్పటికీ, ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను కల్పించే పరిశ్రమగా నిలవనుంది.

Advertisement

వివరాలు 

తయారయ్యే బూట్లలో అధిక భాగాన్ని విదేశీ మార్కెట్లకు..

ఈ తయారీ కేంద్రంలో ప్రతి ఏడాది 20 లక్షల జతల స్పోర్ట్స్‌ షూస్‌ను ఉత్పత్తి చేయనున్నారు. ఇక్కడ తయారయ్యే బూట్లలో అధిక భాగాన్ని విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేయనున్నట్లు సమాచారం. జులై 3 లేదా 4 తేదీల్లో పొగురుపల్లెలో ఈ యూనిట్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు, హ్వాసెంగ్‌ సంస్థ ప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేయనున్నారు. అదే కార్యక్రమంలో మరికొన్ని పరిశ్రమల ఏర్పాటుకు కూడా ముఖ్యమంత్రి భూమిపూజ నిర్వహించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

Advertisement