LOADING...
Kakinada SEZ: కాకినాడ సెజ్‌లో భారీ పెట్టుబడుల జోరు.. రూ.1,550 కోట్లకు ఎంఓయూలు
కాకినాడ సెజ్‌లో భారీ పెట్టుబడుల జోరు.. రూ.1,550 కోట్లకు ఎంఓయూలు

Kakinada SEZ: కాకినాడ సెజ్‌లో భారీ పెట్టుబడుల జోరు.. రూ.1,550 కోట్లకు ఎంఓయూలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 30, 2026
08:49 am

ఈ వార్తాకథనం ఏంటి

దాదాపు రెండు దశాబ్దాలుగా ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగని కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్‌)లో ఇప్పుడు పెట్టుబడుల జోరు మొదలైంది. చాలా కాలం తర్వాత దేశీయ,విదేశీ పారిశ్రామిక సంస్థలు ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పేందుకు ముందుకు వస్తున్నాయి. గత మూడు నెలల్లోనే సుమారు రూ.1,550 కోట్ల పెట్టుబడులకు సంబంధించి పలు సంస్థలు కాకినాడ సెజ్‌తో అవగాహన ఒప్పందాలు (ఎంఓయూలు) కుదుర్చుకోవడం విశేషం. రెండు దశాబ్దాల క్రితం సెజ్‌ను ఏర్పాటు చేసినప్పటికీ, భూసేకరణ వివాదాలు,రైతుల ఆందోళనలు, పెండింగ్ సమస్యల కారణంగా పరిశ్రమలు పెద్దగా రాలేదు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదిలోనే సెజ్ అభివృద్ధికి అడ్డుగా ఉన్న ప్రధాన సమస్యలను పరిష్కరించింది.

వివరాలు 

కాకినాడ సెజ్‌లో అడుగుపెడుతున్న మరిన్ని భారీ పరిశ్రమలు

గతంలో సెజ్ కోసం బలవంతంగా సేకరించిన రెండు వేల ఎకరాలకు పైగా భూములను రైతుల పేర్లపై ఉచితంగా తిరిగి రిజిస్ట్రేషన్ చేయించింది. అలాగే, సెజ్‌కు అనుబంధంగా నిర్మిస్తున్న గేట్‌వే పోర్టు కోసం సేకరించిన భూములకు సంబంధించిన పరిహారం సమస్యను కూడా ప్రభుత్వం పరిష్కరించింది. అన్నవరం నుంచి గేట్‌వే పోర్టు వరకు ప్రతిపాదించిన రైల్వే మార్గం భూసేకరణలో ఉన్న అడ్డంకులు తొలగించడంతో పారిశ్రామికవేత్తల్లో విశ్వాసం పెరిగింది. దీంతో ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న లైఫియస్, క్యూలే ఫార్మా సంస్థలకు తోడుగా మరిన్ని భారీ పరిశ్రమలు కాకినాడ సెజ్‌లో అడుగుపెడుతున్నాయి.

వివరాలు 

ఇటీవల కుదిరిన ప్రధాన ఒప్పందాలు

చెన్నైకి చెందిన గ్రీన్ కోక్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కాకినాడ సెజ్‌లో 80 ఎకరాల విస్తీర్ణంలో రూ.700 కోట్ల పెట్టుబడితో ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ఎంఓయూ కుదుర్చుకుంది. ఈ సంస్థ ఉక్కు తయారీలో ఉపయోగించే మెటలర్జికల్ కోక్‌ను ఉత్పత్తి చేయనుంది. ఈ పరిశ్రమ ప్రారంభమైన తర్వాత ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు రెండు వేల మందికి ఉపాధి లభించనుంది. బ్లూ ఓషన్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.250 కోట్ల పెట్టుబడితో 20 ఎకరాల్లో కొత్త పరిశ్రమ ఏర్పాటు చేయనుంది. టైర్లు, రబ్బరు, పాదరక్షలు,రంగులు,స్పెషాలిటీ కెమికల్స్ తయారీలో ఉపయోగించే కీలక ముడి పదార్థమైన ప్రెసిపిటేటెడ్ సిలికాను ఈ సంస్థ ఉత్పత్తి చేయనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా,పరోక్షంగా సుమారు 350 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

Advertisement

వివరాలు 

విదేశీ పెట్టుబడులపై ప్రత్యేక దృష్టి

శ్రవణ్ షిప్పింగ్ సర్వీసెస్ గేట్‌వే పోర్టులో రూ.100 కోట్ల పెట్టుబడితో అత్యాధునిక లిక్విడ్ స్టోరేజ్ మౌలిక వసతులను అభివృద్ధి చేయడానికి ఒప్పందం చేసుకుంది. ఎల్‌ఎన్‌జీ,ఎల్పీజీ, రసాయనాలు, సాల్వెంట్లు వంటి ద్రవరూప సరుకుల నిల్వ, నిర్వహణ సేవలను ఈ సంస్థ అందించనుంది. విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు కూడా కాకినాడ సెజ్ యాజమాన్యం చురుకుగా చర్యలు చేపడుతోంది. ఇటీవల సింగపూర్‌లో నిర్వహించిన సీఐఐ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు,ఆంధ్రప్రదేశ్ సీఈవోల బృందంతో కలిసి కాకినాడ సెజ్ ఎండీ రామ్‌రెడ్డి ఓజిలి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాకినాడలో పరిశ్రమల స్థాపనకు ఉన్న అవకాశాలను విదేశీ పెట్టుబడిదారులకు వివరించారు. అంతేకాకుండా,దక్షిణాఫ్రికా ఉన్నతస్థాయి మంత్రుల బృందం,ఆస్ట్రేలియన్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ కమిషన్ ప్రతినిధులు గేట్‌వే పోర్టును సందర్శించి వాణిజ్య అవకాశాలను పరిశీలించారు.

Advertisement

వివరాలు 

రూ.500 కోట్లతో స్పెషాలిటీ కెమికల్స్ ప్లాంట్

కాకినాడ సెజ్‌లో మరో భారీ పెట్టుబడి కూడా ఖరారైంది. గుజరాత్‌కు చెందిన డీఏసీఎల్ ఫైన్ కెమ్ లిమిటెడ్ రూ.500 కోట్ల పెట్టుబడితో అత్యాధునిక స్పెషాలిటీ కెమికల్స్ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. తొండంగి మండలం పెరుమాళ్లపురం సమీపంలో 50 ఎకరాల్లో ఈ పరిశ్రమను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి సోమవారం హైదరాబాద్‌లో కాకినాడ సెజ్ సీఈవో రామ్‌రెడ్డి ఓజిలి, డీఏసీఎల్ ఫైన్ కెమ్ లిమిటెడ్ ఛైర్మన్ అమిత్ మెహతా మధ్య అధికారిక ఒప్పందం కుదిరింది. ఈ పరిశ్రమ ఏర్పాటుతో ప్రత్యక్షంగా 500 మందికి, పరోక్షంగా మరో 500 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

Advertisement