Telangana: తెలంగాణ విద్యుత్కేంద్రాల్లో బొగ్గు సంక్షోభం.. ఉత్పత్తిపై ఆందోళన
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలోని విద్యుత్కేంద్రాల్లో బొగ్గు నిల్వలు ఆందోళనకర స్థాయికి పడిపోవడంతో విద్యుదుత్పత్తిపై ప్రభావం పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కేంద్ర విద్యుత్ శాఖ మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలోని విద్యుత్కేంద్రాల్లో కనీసం 26 రోజులపాటు అంతరాయం లేకుండా విద్యుదుత్పత్తి కొనసాగేందుకు 25.54 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు ఉండాలి. అయితే జూన్ 28 నాటికి కేవలం 5.33లక్షల టన్నుల బొగ్గు మాత్రమే అందుబాటులో ఉందని, ఇది అవసరమైన నిల్వల్లో కేవలం 21 శాతమేనని కేంద్ర విద్యుత్ మండలి(సీఈఏ)తాజా నివేదిక వెల్లడించింది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని తెలంగాణలోని అన్ని విద్యుత్కేంద్రాలకు బొగ్గు సరఫరాను పెంచాలని కేంద్ర విద్యుత్ శాఖ సింగరేణి సంస్థను హెచ్చరించింది. సింగరేణికి చెందిన విద్యుత్కేంద్రంలో కూడా బొగ్గు నిల్వలు తీవ్రంగా తగ్గినట్లు నివేదికలో పేర్కొంది.
వివరాలు
64,400 టన్నుల బొగ్గు నిల్వలు
అక్కడ కనీసం 4.05లక్షల టన్నుల బొగ్గు నిల్వలు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం కేవలం 64,400 టన్నులు మాత్రమే ఉండటం, అంటే అవసరంలో 16శాతం మాత్రమే మిగిలి ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో సింగరేణి తమ విద్యుత్కేంద్రానికే సరిపడా బొగ్గు అందించలేకపోతే, రాష్ట్ర ప్రభుత్వ విద్యుదుత్పత్తి సంస్థ జెన్‌కోకు ఎలా సరఫరా చేస్తుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలోని కొన్ని విద్యుత్కేంద్రాల్లో విద్యుదుత్పత్తికి అవసరమైన కనీస నాణ్యత కలిగిన బొగ్గు కూడా అందుబాటులో లేదని జెన్‌కో తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. బొగ్గు కొరత కారణంగా యాదాద్రి (800 మెగావాట్లు), భద్రాద్రి (270 మెగావాట్లు), కొత్తగూడెం (250 మెగావాట్లు) విద్యుత్కేంద్రాల్లో వార్షిక మరమ్మతుల పేరుతో నెల రోజులపాటు విద్యుదుత్పత్తిని నిలిపివేయాలని జెన్‌కో యోచిస్తున్నట్లు సమాచారం.
వివరాలు
నాణ్యమైన బొగ్గుపై భిన్న వాదనలు
విద్యుత్కేంద్రాలు పూర్తిస్థాయిలో పనిచేయాలంటే జీ8, జీ9 గ్రేడ్‌కు చెందిన నాణ్యమైన బొగ్గును సరఫరా చేయాలని జెన్‌కో పలుమార్లు సింగరేణిని కోరుతోంది. అయితే ఆ స్థాయి నాణ్యత గల బొగ్గు ఉత్పత్తి ప్రస్తుతం తగినంతగా లేదని,అందువల్ల జీ13, జీ14 గ్రేడ్ బొగ్గును ఎక్కువగా పంపుతున్నామని సింగరేణి వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయాన్ని ప్లాంట్ల చీఫ్ ఇంజినీర్లు కూడా తమ నివేదికల్లో జెన్‌కోకు వివరించినట్లు సమాచారం. గత ఆర్థిక సంవత్సరంలో నాసిరకం బొగ్గు వినియోగం కారణంగా సుమారు రూ.3 వేల కోట్ల మేర నష్టం వాటిల్లిందని చీఫ్ ఇంజినీర్లు నివేదించారు.
వివరాలు
తెలంగాణ ప్రభుత్వ విద్యుత్కేంద్రాలకు తక్కువ నాణ్యత గల బొగ్గు సరఫరా
మరోవైపు బొగ్గు సరఫరాకు సంబంధించిన బిల్లులను జెన్‌కో పూర్తిగా చెల్లించడం లేదని, అందువల్ల అధిక నాణ్యత గల బొగ్గును ఇతర రాష్ట్రాలకు పంపిస్తూ తెలంగాణ ప్రభుత్వ విద్యుత్కేంద్రాలకు తక్కువ నాణ్యత గల బొగ్గును సరఫరా చేస్తున్నారని సీనియర్ ఇంజినీర్లు పేర్కొంటున్నారు. అయితే జీ8, జీ9 గ్రేడ్ బొగ్గు ఉత్పత్తి ప్రస్తుతం పరిమితంగానే ఉందని, అందుబాటులో లేని బొగ్గును ఎక్కడి నుంచి తీసుకొచ్చి సరఫరా చేయాలంటూ సింగరేణి వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో కోల్ ఇండియా గనుల నుంచి బొగ్గు కొనుగోలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని జెన్‌కో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు తెలుస్తోంది.