India: ఆఫ్ఘన్‌పై పాక్ వైమానిక దాడులు.. సార్వభౌమత్వ ఉల్లంఘన అంటూ భారత్ ఆగ్రహం
ఈ వార్తాకథనం ఏంటి
ఆఫ్ఘనిస్తాన్‌పై పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడుల్లో మహిళలు, చిన్నారులు సహా అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆందోళన కలిగించిందని పేర్కొంది. పాకిస్థాన్ చర్య అఫ్గానిస్థాన్ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమే కాకుండా, ప్రాంతీయ శాంతి, భద్రతకు కూడా తీవ్రమైన ముప్పుగా మారుతుందని భారత్ స్పష్టం చేసింది. ఈ విషయంపై భారత విదేశాంగశాఖ సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. పాకిస్థాన్ బాధ్యతారాహిత్యానికి, దుందుడుకు వైఖరికి ఈ దాడులే నిదర్శనమని పేర్కొంది. దేశంలో నెలకొన్న అంతర్గత సమస్యలు, వైఫల్యాలను దాచిపెట్టేందుకు సరిహద్దులు దాటి హింసాత్మక చర్యలకు పాల్పడుతోందని పాకిస్థాన్‌పై విమర్శలు గుప్పించింది.
వివరాలు
అఫ్గాన్ కుటుంబాలకు భారత్ ప్రగాఢ సానుభూతి
దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన అఫ్గాన్ కుటుంబాలకు భారత్ ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, అఫ్గానిస్థాన్ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతకు తమ మద్దతు ఎప్పటికీ కొనసాగుతుందని మరోసారి పునరుద్ఘాటించింది. ఇక పాకిస్థాన్ వైమానిక దాడుల్లో కనీసం 36 మంది పౌరులు మరణించగా, మరో 163 మంది గాయపడినట్లు తాలిబన్ డిప్యూటీ ప్రతినిధి హమ్దుల్లా ఫిత్రత్ సోమవారం వెల్లడించారు. ఆదివారం రాత్రి అఫ్గానిస్థాన్‌లోని పక్తియా, పక్తికా, కునార్ ప్రావిన్సులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయని తెలిపారు.
వివరాలు
నివాస గృహంపై బాంబులు విసిరిన పాకిస్థాన్ యుద్ధ విమానాలు
పక్తియా ప్రావిన్స్‌లోని త్సమ్కానీ జిల్లాలో ఉన్న ఒక నివాస గృహంపై పాకిస్థాన్ యుద్ధ విమానాలు మొదట బాంబులు విసిరాయని, ఆ తర్వాత సహాయక చర్యల కోసం గ్రామస్థులు అక్కడికి చేరుకున్న సమయంలో రెండోసారి బాంబుదాడి నిర్వహించారని ఫిత్రత్ ఆరోపించారు. ఈ ఒక్క ఘటనలోనే 28 మంది గ్రామస్థులు మృతి చెందగా, 158 మంది గాయపడినట్లు ఆయన వివరించారు. మరోవైపు, ఈ దాడులను తాలిబన్ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ ఇప్పటికే తీవ్రంగా ఖండించారు. పాకిస్థాన్ చర్యను పిరికిపంద చర్యగా, అఫ్గానిస్థాన్‌పై జరిగిన దురాక్రమణగా ఆయన అభివర్ణించారు.