ITR Refund Delay: మీ ఆదాయపు పన్ను రీఫండ్ ఇంకా రాలేదా.. కారణాలేంటి?
ఈ వార్తాకథనం ఏంటి
2024-25 ఆర్థిక సంవత్సరం (2025-26 అసెస్‌మెంట్ ఇయర్)కు సంబంధించిన ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు ప్రక్రియ ఇప్పటికే ముగిసింది. గతేడాది జులైలో ప్రారంభమైన ఈ ప్రక్రియకు సెప్టెంబర్ 16తో తుది గడువు పూర్తయింది. సాధారణంగా ఐటీఆర్ ఫైల్ చేసిన తర్వాత 4 నుంచి 5 వారాల లోపే రిఫండ్ బ్యాంక్ ఖాతాలో జమ కావాలి. కానీ ఈసారి మాత్రం చాలా మందికి రిఫండ్ ఆలస్యమవుతోంది. రిటర్న్స్ దాఖలు చేసి ఎన్నో రోజులు గడిచినా ఇప్పటికీ ఖాతాల్లో డబ్బులు పడకపోవడంతో పన్ను చెల్లింపుదారులు ఆందోళనగా ఎదురుచూస్తున్నారు.
వివరాలు
ఈ-వెరిఫికేషన్ పూర్తయిన 30 రోజుల్లోపు రిఫండ్..
వాస్తవంగా చెల్లించాల్సిన పన్ను కంటే ఎక్కువ మొత్తాన్ని ప్రభుత్వం వసూలు చేసినప్పుడు, ఆదాయపు పన్ను శాఖ ఆ అదనపు మొత్తాన్ని రిఫండ్‌గా చెల్లిస్తుంది. అలాగే టీడీఎస్ వంటి అంశాల్లో తేడాలు వచ్చినా,వాటిని సర్దుబాటు చేసి రిఫండ్ ప్రక్రియను ప్రారంభిస్తుంది. సాధారణంగా ఐటీఆర్ దాఖలు చేసి ఈ-వెరిఫికేషన్ పూర్తయిన 30 రోజుల్లోపు రిఫండ్ ప్రాసెస్ కావాలి. చట్టప్రకారం 2025-26 అసెస్‌మెంట్ ఇయర్‌కు సంబంధించిన రిటర్న్స్‌ను ప్రాసెస్ చేయడానికి 2026 డిసెంబర్ 31 వరకూ ఐటీ శాఖకు గడువు ఉంది. అయినప్పటికీ 2025 సంవత్సరం పూర్తయ్యే దశకు వచ్చినా చాలామంది ఇంకా రిఫండ్ కోసం వేచి చూస్తున్నారు. రిఫండ్ ఆలస్యం అయితే,ఆ ఆలస్యానికి ప్రతిగా పన్ను చెల్లింపుదారులకు నెలకు 0.5 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.
వివరాలు
రిటర్న్స్‌లో ఏదైనా తేడా కనిపిస్తే..
ఈసారి ముఖ్యంగా సాంకేతిక సమస్యలు, అలాగే ఐటీఆర్ ఫైల్ చేసిన వారి నుంచి అదనపు స్పష్టత కోరడం వంటి కారణాల వల్ల రిఫండ్లు ఆలస్యం అవుతున్నాయి. సాధారణంగా రిటర్న్స్‌లో ఏదైనా తేడా కనిపిస్తే, ఆదాయపు పన్ను శాఖ నోటీసుల ద్వారా టాక్స్ పేయర్లకు సమాచారం అందిస్తుంది. ఆ సమస్యలు పరిష్కారమైన తర్వాతే రిఫండ్ విడుదల అవుతుంది. రిటర్న్స్‌లో ఎలాంటి వ్యత్యాసాలు లేకపోతే మాత్రం రిఫండ్ వేగంగా ఖాతాలో జమ అవుతుంది.
వివరాలు
రిఫండ్ లేట్ కావడానికి కారణాలు..
ఫారం 26AS లేదా AIS వివరాలతో పోల్చినప్పుడు, ఐటీఆర్‌లో ఇచ్చిన సమాచారం సరిపోలకపోతే రిఫండ్ ఆలస్యం అవుతుంది. అలాగే బ్యాంక్ అకౌంట్ వివరాలు తప్పుగా నమోదు చేయడం, ఖాతాను ముందుగా ధ్రువీకరించుకోకపోవడం కూడా రిఫండ్ లేట్ కావడానికి కారణాలు. అంతేకాదు, అర్హత లేని లేదా తప్పు మినహాయింపులను క్లెయిమ్ చేయడం వల్ల కూడా సమస్యలు తలెత్తుతాయి. ఐటీఆర్ ఫైల్ చేసిన తర్వాత తప్పనిసరిగా ఈ-వెరిఫికేషన్ చేయాలి. అది పూర్తికాకపోతే రిఫండ్ వచ్చే అవకాశమే ఉండదు.
వివరాలు
ధ్రువీకరణ పూర్తయిన వెంటనే రిఫండ్..
అదే సమయంలో, అధిక విలువ కలిగిన లావాదేవీలు ఉన్నప్పటికీ వాటిని రిటర్న్స్‌లో చూపించకపోతే కూడా రిఫండ్ ఆలస్యం అవుతుంది. పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి నోటీసులు రాకపోతే, ప్రత్యేకంగా ఏమీ చేయాల్సిన అవసరం లేదు. అంతర్గత తనిఖీలు, ధ్రువీకరణ పూర్తయిన వెంటనే రిఫండ్ స్వయంగా బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. అయితే పై కారణాల్లో ఏదైనా మీకు వర్తిస్తే, ఐటీ శాఖ ఇచ్చిన నోటీసుల ప్రకారం అప్డేటెడ్ రిటర్న్స్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం జరిమానాతో రిటర్న్స్ సవరించే అవకాశం ఉండటంతో, ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఖాతాలో డబ్బులు జమయ్యే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.