LOADING...
Block: ఏఐ ప్రభావం: బ్లాక్‌లో 4,000 ఉద్యోగాల కోత
ఏఐ ప్రభావం: బ్లాక్‌లో 4,000 ఉద్యోగాల కోత

Block: ఏఐ ప్రభావం: బ్లాక్‌లో 4,000 ఉద్యోగాల కోత

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 27, 2026
09:22 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా ఆధారిత ఆర్థిక సేవల సంస్థ 'బ్లాక్‌' (Block)సుమారు 4,000మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు అధికారికంగా వెల్లడించింది. ఈ విషయాన్ని సంస్థ సీఈఓ జాక్ డోర్సే ప్రకటించారు. ఏఐ టెక్నాలజీలు సంస్థల పని విధానాన్ని పూర్తిగా మార్చేస్తున్నాయని,ఆ మార్పుల ప్రభావం తమ కంపెనీలో ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తోందని డోర్సే తెలిపారు. కొద్దిమంది సిబ్బందే అధునాతన ఏఐ టూల్స్‌ను సమర్థంగా వినియోగిస్తూ మెరుగైన ఫలితాలు సాధించగలరని ఆయన పేర్కొన్నారు. అనేక సంస్థలు ఈ వాస్తవాన్ని ఆలస్యంగా గుర్తిస్తున్నాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కంపెనీ చరిత్రలో అత్యంత కఠినమైన నిర్ణయాల్లో ఇదొకటిగా ఈ లేఆఫ్‌లను ఆయన వివరించారు. ఉద్యోగాలు కోల్పోతున్న సిబ్బందికి 20వారాల జీతాన్ని పరిహారంగా అందించడంతో పాటు,ఆరు నెలలపాటు హెల్త్ ఇన్సూరెన్స్ సదుపాయం కల్పిస్తామని తెలిపారు.

వివరాలు 

భారీగా పెరిగిన బ్లాక్ షేర్లు..

కొత్త ఉద్యోగాలు వెతుక్కొనే ప్రక్రియలో వారికి పూర్తి సహకారం అందిస్తామని కూడా హామీ ఇచ్చారు. ఏఐ సాధనాలు అధిక సామర్థ్యంతో పని చేస్తున్న నేపథ్యంలో,ఇతర సంస్థలు కూడా తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించే అవకాశముందని డోర్సే అభిప్రాయపడ్డారు. లేఆఫ్‌ల ప్రకటన అనంతరం బ్లాక్‌ కంపెనీ షేర్లు గణనీయంగా పెరిగాయి. ఎక్స్టెండెడ్ ట్రేడింగ్‌లో ఒక్కో షేరు ధర 24 శాతానికి పైగా పెరుగుదల నమోదు చేసింది. జాక్ డోర్సే ట్విటర్ (ప్రస్తుతం 'ఎక్స్‌') వ్యవస్థాపకుల్లో ఒకరు. ఆయన 2009లో 'స్క్వేర్‌' అనే సంస్థను స్థాపించారు. అనంతరం 2021లో దాని పేరును 'బ్లాక్‌'గా మార్చారు. కంపెనీ ఉపయోగిస్తున్న బ్లాక్‌చెయిన్ సాంకేతికతను ప్రతిబింబించేలా ఈ పేరు మార్పు చేశారు.

Advertisement