Jayshree: భారత సంతతి సీఈఓల్లో అగ్రస్థానంలో జయశ్రీ ఉల్లాల్
ఈ వార్తాకథనం ఏంటి
భారత సంతతికి చెందిన అంతర్జాతీయ స్థాయి సంపన్న సీఈఓల జాబితాలో సంచలన మార్పు చోటుచేసుకుంది. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌లను వెనక్కి నెట్టి అరిస్టా నెట్‌వర్క్స్ ప్రెసిడెంట్, సీఈఓ జయశ్రీ ఉల్లాల్ అగ్రస్థానంలో నిలిచారు. 'హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025' ప్రకారం, జయశ్రీ ఉల్లాల్ రూ.50,170 కోట్ల నికర సంపదతో భారత సంతతికి చెందిన అత్యంత సంపన్న సీఈఓగా తొలి స్థానాన్ని దక్కించుకున్నారు. కంప్యూటర్ నెట్‌వర్కింగ్ రంగంలో ప్రముఖ సంస్థగా గుర్తింపు పొందిన అరిస్టా నెట్‌వర్క్స్‌లో జయశ్రీ ఉల్లాల్ 2008 నుంచి కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
Details
జయశ్రీ ఉల్లాల్‌కు సుమారు 3 శాతం వాటా
ఫోర్బ్స్ నివేదిక ప్రకారం, ఆమె నాయకత్వంలో 2024లో అరిస్టా నెట్‌వర్క్స్ 7 బిలియన్ డాలర్ల (సుమారు రూ.63,000 కోట్లు) ఆదాయాన్ని నమోదు చేసింది. ఇది 2023తో పోలిస్తే దాదాపు 20 శాతం వృద్ధిగా ఉండడం విశేషం. ప్రస్తుతం అరిస్టా నెట్‌వర్క్స్‌లో జయశ్రీ ఉల్లాల్‌కు సుమారు 3 శాతం వాటా ఉంది. జయశ్రీ ఉల్లాల్ 1961 మార్చి 27న లండన్‌లో భారత సంతతికి చెందిన హిందూ కుటుంబంలో జన్మించారు. ఆమె శాన్‌ఫ్రాన్సిస్కో స్టేట్ యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో బ్యాచ్‌లర్ ఆఫ్ సైన్స్ పూర్తి చేశారు. అనంతరం 1986లో శాంటా క్లారా యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని సాధించారు.
Details
ఇంజినీరింగ్ రంగంలో గౌరవ డాక్టరేట్
2025లో ఆమెకు ఇంజినీరింగ్ రంగంలో గౌరవ డాక్టరేట్ కూడా లభించింది. ఇదే జాబితాలో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల రూ.9,770 కోట్ల నికర సంపదతో జయశ్రీ ఉల్లాల్ తర్వాత స్థానంలో నిలిచారు. ఇక గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ రూ.5,810 కోట్ల సంపదతో ఏడో స్థానాన్ని దక్కించుకున్నారు. దీంతో భారత సంతతికి చెందిన గ్లోబల్ సీఈఓల సంపన్నుల జాబితాలో జయశ్రీ ఉల్లాల్ అగ్రస్థానంలో నిలవడం విశేషంగా మారింది.