Jet fuel prices: ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. విమాన టికెట్లు మరింత ఖరీదు కానున్నాయి!
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ విమాన ప్రయాణికులకు షాక్ ఇచ్చే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. త్వరలో విమాన టికెట్ల ధరలు భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలతో విమానయాన రంగం ఒత్తిడిలో ఉండగా, ఇప్పుడు ఇంధన ధరల పెరుగుదల మరో పెద్ద భారం అయింది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్ (ATF)ధరలు రికార్డు స్థాయికి చేరుకుని మొదటిసారి రూ.2 లక్షల మార్క్‌ను దాటాయి. దీంతో విమానయాన సంస్థల నిర్వహణ ఖర్చులు మరింతగా పెరిగే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామం నేరుగా విమాన టికెట్ల ధరలపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా అంతర్జాతీయ చమురు ధరలను ఆధారంగా తీసుకుని ఆయిల్ కంపెనీలు ప్రతి నెల మొదటి తేదీన ఏటీఎఫ్ ధరలను సవరిస్తుంటాయి.
వివరాలు
విమానయాన రంగంలో అరుదైన పరిణామం
ఈ క్రమంలో తాజాగా బుధవారం భారీ పెరుగుదల నమోదైంది. కిలో లీటర్ ఏటీఎఫ్ ధర ఒక్కసారిగా రూ.1,10,703.08 పెరిగి, దేశ రాజధాని ఢిల్లీలో రూ.2,07,341.22కు చేరుకుంది. ఇప్పటివరకు కిలో లీటర్ ఏటీఎఫ్ ధర రూ.96,638 ఉండగా, తాజా పెరుగుదలతో దాదాపు 114.5 శాతం పెరిగినట్లైంది. ఈ స్థాయి పెరుగుదల విమానయాన రంగంలో అరుదైన పరిణామంగా భావిస్తున్నారు. ఈ పెరుగుదలపై విమానయాన సంస్థలు ఇంకా అధికారికంగా స్పందించకపోయినా, దీని ప్రభావం త్వరలోనే టికెట్ ధరలపై కనిపించే అవకాశముందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా విమానయాన సంస్థల నిర్వహణ ఖర్చుల్లో దాదాపు 40 శాతం వరకు ఇంధన ఖర్చులే ఉంటాయి.
వివరాలు
ఎయిర్‌లైన్లు టికెట్లపై ఫ్యూయెల్ సర్‌ఛార్జ్
ఇక పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా కొన్ని మార్గాల్లో మార్పులు చేసి, ప్రత్యామ్నాయ రూట్లలో విమానాలను నడపాల్సి వస్తోంది. దీంతో ఇప్పటికే ఎయిర్‌లైన్లపై అదనపు వ్యయం పడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంధన ధరలు ఒక్కసారిగా రెండింతలు కావడంతో, సంస్థలపై ఆర్థిక ఒత్తిడి మరింత పెరగనుంది. ఈ భారాన్ని తగ్గించుకోవడానికి విమానయాన సంస్థలు టికెట్ల ధరలను పెంచే దిశగా అడుగులు వేయవచ్చని అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే కొన్ని ఎయిర్‌లైన్లు టికెట్లపై ఫ్యూయెల్ సర్‌ఛార్జ్ విధిస్తున్న విషయం తెలిసిందే. తాజా పరిణామాలతో ఈ ఛార్జీలు మరింత పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.