Jio IPO: జియో ఐపీవోకు రంగం సిద్ధం.. రూ.12 లక్షల కోట్ల విలువ అంచనా..
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలోనే అతిపెద్ద ఐపీఓల్లో ఒకటిగా నిలవనున్న జియో ప్లాట్‌ఫామ్స్ పబ్లిక్ ఇష్యూకు సిద్ధమవుతోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన ఈ డిజిటల్ ప్లాట్‌ఫామ్ షేర్ల విక్రయం ఈ నెల 21న ప్రారంభమై.. 23న ముగిసే అవకాశం ఉందని కంపెనీ వర్గాలను ఉటంకిస్తూ సమాచారం వెలువడింది. అనంతరం ఈ నెల 28న స్టాక్ మార్కెట్లలో జియోను లిస్ట్ చేయాలని సంస్థ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల చివర్లో మార్కెట్లోకి రానున్న జియో ప్లాట్‌ఫామ్స్ విలువ సుమారు 143-146 బిలియన్ డాలర్లుగా ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి. భారత కరెన్సీలో ఇది దాదాపు రూ.12 లక్షల కోట్లకు సమానం. ఈ స్థాయి విలువతో జియో ఐపీవో మార్కెట్లోకి వస్తే దేశంలోనే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా నిలిచే అవకాశం ఉంది.
వివరాలు
రూ.3.8 బిలియన్ ఐపీవో
జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీవో పరిమాణం సుమారు 3.8బిలియన్ డాలర్లుగా ఉండొచ్చని అంచనా.అయితే ఈ వివరాలపై కంపెనీ అధికారికంగా స్పందించలేదు.
ఐపీవోకు సంబంధించిన ప్రశ్నలకు జియో వర్గాలు స్పందించేందుకు నిరాకరించినట్లు సమాచారం.
ఈ పబ్లిక్ ఇష్యూ మరో కారణంతోనూ ప్రత్యేకంగా నిలవనుంది.
2008 తర్వాత రిలయన్స్ గ్రూప్ నుంచి వస్తున్న తొలి ఐపీవో ఇదే కానుంది.దీంతో జియో ఐపీవోపై మార్కెట్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
సెబీకి దరఖాస్తు.. గ్రీన్‌సిగ్నల్
జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీవోకు సంబంధించి సంస్థ ఆగస్టు 28న మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి దరఖాస్తు సమర్పించింది.
ఆదరఖాస్తును పరిశీలించిన సెబీ గత నెలలో ఐపీవోకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
తాజాగా షేర్ల విక్రయం,లిస్టింగ్ తేదీలపై వెలువడుతున్న వివరాలు అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది.