April 2026 Changes: ఏప్రిల్ 1 నుంచి భారీ మార్పులు.. మీ జేబుకు చిల్లు పడే 5 కీలక మార్పులు ఇవే..
ఈ వార్తాకథనం ఏంటి
మార్చి నెల ముగియబోతోంది.. మరో ఐదు రోజుల్లో ఏప్రిల్ నెల మొదలుకానుంది. ప్రతి నెలలాగే ఈసారి కూడా కొత్త నెలతో పాటు దేశంలో కొన్ని కీలక ఆర్థిక మార్పులు అమల్లోకి రానున్నాయి. ఈ మార్పుల ప్రభావం ప్రతి కుటుంబంపై, ప్రతి ఒక్కరి ఖర్చులపై స్పష్టంగా కనిపించనుంది. ముఖ్యంగా గ్యాస్ ధరలు, పన్ను నిబంధనలు, బ్యాంకింగ్ రూల్స్, పాన్ కార్డు మార్పులు, రైల్వే టిక్కెట్లపై కొత్త నిబంధనలు ప్రజలపై నేరుగా ప్రభావం చూపనున్నాయి.
వివరాలు
గ్యాస్, ఇంధన ధరల్లో మార్పులు
ప్రతి నెల మొదటి తేదీలా, ఈసారి కూడా ఏప్రిల్ 1 నుంచి ఎల్‌పీజీ సిలిండర్ ధరల్లో మార్పులు ఉండే అవకాశముంది. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల కారణంగా ఇప్పటికే ఎల్‌పీజీ సరఫరాలో ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో చమురు సంస్థలు గతంలోనే ధరలు పెంచాయి. ఇప్పుడు కొత్త నెల ప్రారంభంలో మరిన్ని ధరల మార్పులు ప్రకటించే అవకాశం ఉంది. ఇక ఎయిర్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ధరలతో పాటు సీఎన్‌జీ, పీఎన్‌జీ గ్యాస్ రేట్లలో కూడా మార్పులు ఉండవచ్చు. దీంతో ప్రయాణ ఖర్చులు, గృహ వినియోగ ఖర్చులు రెండూ పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
వివరాలు
కొత్త ఆదాయపు పన్ను చట్టం
ఏప్రిల్ 1 నుంచి దేశంలో కొత్త ఆదాయపు పన్ను చట్టం అమల్లోకి రానుంది. 1961 నుంచి అమల్లో ఉన్న పాత చట్టానికి బదులుగా 2025 కొత్త చట్టం వస్తోంది. పన్ను చెల్లింపుదారులకు సౌకర్యంగా ఉండేలా ఈ చట్టంలో మార్పులు చేశారు. ఇకపై ఐటీఆర్ ఫైలింగ్‌కు ఉపయోగించే ఫారం 16 అందుబాటులో ఉండదు. దాని స్థానంలో కొత్త ఫారం అందిస్తారు. ఫారం 16 ఇప్పటివరకు జీతానికి సంబంధించిన టీడీఎస్ సర్టిఫికేట్‌గా ఉపయోగించేవారు. అలాగే జీతేతర ఆదాయాల కోసం ఉపయోగించే ఫారం 16A పేరు మార్చి ఫారం 131గా పిలవనున్నారు. అద్దె, వడ్డీ, వ్యాపారం, కన్సల్టెన్సీ ఆదాయాలపై ఈ మార్పు వర్తిస్తుంది.
వివరాలు
బ్యాంకుల ATM నిబంధనల్లో మార్పులు
HDFC బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), బంధన్ బ్యాంక్ ఖాతాదారులకు కూడా ఏప్రిల్ 1 నుంచి కొత్త నియమాలు అమల్లోకి రానున్నాయి. HDFC బ్యాంక్: ఇప్పటివరకు వేరు లెక్కించిన UPI విత్‌డ్రాయల్స్‌ను ఇకపై ATM ఉచిత లావాదేవీల్లో కలపనుంది. దీంతో ఉచిత ట్రాన్సాక్షన్ల పరిమితి త్వరగా పూర్తయ్యే అవకాశం ఉంది. పరిమితి దాటితే ప్రతి లావాదేవీపై రూ.23 ఛార్జ్ వసూలు చేస్తారు. PNB: డెబిట్ కార్డ్ రోజువారీ విత్‌డ్రాయల్ పరిమితి తగ్గింది. ఇప్పుడు కార్డ్ ఆధారంగా రోజుకు రూ.50,000 నుంచి రూ.75,000 వరకు మాత్రమే డ్రా చేయగలరు. గతంలో ఇది రూ.1 లక్ష వరకు ఉండేది.
వివరాలు
పాన్ కార్డు నిబంధనలు కఠినతరం
బంధన్ బ్యాంక్: మెట్రో నగరాల్లో నెలకు 3 ఉచిత ట్రాన్సాక్షన్లు, ఇతర ప్రాంతాల్లో 5 ఉచిత లావాదేవీలు మాత్రమే. ఆ పరిమితి దాటితే ప్రతి ట్రాన్సాక్షన్‌కు రూ.23 ఛార్జ్ ఉంటుంది. బ్యాలెన్స్ లేక ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే రూ.25 జరిమానా విధిస్తారు. ఏప్రిల్ 1 నుంచి పాన్ కార్డు సంబంధిత నిబంధనలు మరింత కఠినంగా మారనున్నాయి. కొత్త పాన్ కోసం లేదా అప్‌డేట్ కోసం ఇకపై కేవలం ఆధార్ కార్డు సరిపోదు. అదనపు పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న పాన్ దరఖాస్తులను త్వరగా పూర్తి చేయాలని అధికారాలు సూచిస్తున్నాయి.
వివరాలు
రైల్వే టిక్కెట్ రద్దు ఖరీదు పెరుగుతుంది
రైల్వే ప్రయాణికులకు కూడా కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ముఖ్యంగా టిక్కెట్ రద్దుపై భారీ మార్పులు ఉన్నాయి. రైలు బయలుదేరే 8 గంటల ముందు వరకు రద్దు చేస్తే రీఫండ్ లేదు (ఇంతకు ముందు 4 గంటలు) 8-24 గంటల ముందు రద్దు చేస్తే 50% రీఫండ్ 24-72 గంటల ముందు రద్దు చేస్తే 25% తగ్గింపు 72 గంటల ముందు రద్దు చేస్తే గరిష్ట రీఫండ్ లభిస్తుంది దీంతో చివరి నిమిషంలో టిక్కెట్ రద్దు చేసే వారికి ఎక్కువ ఖర్చు పడనుంది.
వివరాలు
ఆర్థిక ప్రణాళికలు
మొత్తానికి ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న ఈ మార్పులు సాధారణ ప్రజల ఖర్చులపై నేరుగా ప్రభావం చూపనున్నాయి. గ్యాస్ ధరల నుంచి బ్యాంక్ ఛార్జీల వరకు, పన్ను నుంచి ప్రయాణ ఖర్చుల వరకు ప్రతి అంశంలో మార్పులు కనిపించనున్నాయి. కాబట్టి ముందుగానే ఈ మార్పులను తెలుసుకుని ఆర్థిక ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం మంచిది.