Vi-BSNL: టెలికాం రంగంలో కీలక డీల్.. ఒప్పందం దిశగా వొడాఫోన్ ఐడియా-బీఎస్‌ఎన్‌ఎల్
ఈ వార్తాకథనం ఏంటి
అప్పుల భారంతో సతమతమవుతున్న టెలికాం సంస్థలు వొడాఫోన్ ఐడియా (Vodafone Idea), భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) కలిసి పనిచేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ రెండు సంస్థలు తమ టవర్లు, ఫైబర్ కేబుళ్లు, స్పెక్ట్రమ్‌ను పరస్పరం పంచుకునే దిశగా ముందుకెళ్తున్నాయి. కవరేజ్‌ను మెరుగుపరచడం, ఖర్చులను తగ్గించడం లక్ష్యంగా ఇప్పటికే ఈ అంశంపై పరస్పర చర్చలు జరిపినట్లు సమాచారం. నెట్‌వర్క్ నాణ్యతను పెంచడంతో పాటు 5జీ సేవల విస్తరణను వేగవంతం చేయడానికి ఈ భాగస్వామ్యం ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
Details
గ్రామీణ ప్రాంతాల్లో కూడా నెట్‌వర్క్ కవరేజ్ మెరుగుపడే అవకాశముంది
టెలికాం రంగంలో ఒకటి రెండు సంస్థలే ఆధిపత్యం చెలాయించకుండా పోటీ వాతావరణాన్ని కొనసాగించేందుకు కూడా ఇది దోహదపడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఈ రెండు సంస్థలు 4జీ సైట్లు ఏర్పాటు చేయడం, అప్‌గ్రేడ్‌ల కోసం భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో కలిసి పనిచేయడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కూడా నెట్‌వర్క్ కవరేజ్ మెరుగుపడే అవకాశముంది. బీఎస్‌ఎన్‌ఎల్ ప్రభుత్వ రంగ సంస్థ కాగా, వొడాఫోన్ ఐడియాలో కేంద్ర ప్రభుత్వానికి సుమారు 49 శాతం వాటా ఉన్న విషయం తెలిసిందే.