RBI: ఆర్బీఐ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లు తగ్గించనున్న ఆర్బీఐ గవర్నర్
ఈ వార్తాకథనం ఏంటి
దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక నిర్ణయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ) తీసుకుంది. మానిటరీ పాలసీ కమిటీ ఈ రోజు జరిగిన సమావేశంలో రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించాలని నిర్ణయించింది.
ఈ నిర్ణయం ఏకగ్రీవంగా తీసుకున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు.
తాజా తగ్గింపుతో రెపో రేటు 6.25%కి చేరింది. దాదాపు ఐదేళ్ల తర్వాత ఆర్‌బీఐ రెపో రేటును తగ్గించడం గమనార్హం. రెపో రేటు తగ్గింపు ప్రకటన సందర్భంగా గవర్నర్ మల్హోత్రా గ్లోబల్ ఆర్థిక పరిస్థితులపై మాట్లాడారు.
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు సవాళ్లను ఎదుర్కొంటున్నాయని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ద్రవ్యోల్బణం కాస్త తగ్గుముఖం పడుతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయని వెల్లడించారు.
Details
రెపో రేటు తగ్గింపు ప్రభావం
రెపో రేటు తగ్గింపు వల్ల బ్యాంకులు తక్కువ వడ్డీ రేటుతో రిజర్వ్ బ్యాంక్ నుంచి రుణాలు పొందగలవు.
దీని ప్రభావంగా వాణిజ్య బ్యాంకులు వినియోగదారులకు అందించే రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉంది.
ముఖ్యంగా గృహ రుణాలు, వాహన రుణాలు, వ్యక్తిగత రుణాలపై ఈ నిర్ణయం ప్రభావం చూపనుంది. ఈ క్రమంలో దేశీయ మార్కెట్ స్పందనపై ఆర్థిక రంగం దృష్టి సారించింది.
రానున్న రోజుల్లో ఈ నిర్ణయం భారత ఆర్థిక వ్యవస్థపై ఎలా ప్రభావం చూపుతుందో చూడాలి.