PMUY: ఉజ్వల యోజన లబ్ధిదారులకు అలర్ట్: ₹300 గ్యాస్ సబ్సిడీ కోసం మార్చి 31లోపు eKYC తప్పనిసరి
ఈ వార్తాకథనం ఏంటి
పేద మహిళలకు స్వచ్ఛమైన వంట ఇంధనం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రధాన మంత్రి ఉజ్వల యోజన ప్రస్తుతం దేశవ్యాప్తంగా కోట్ల కుటుంబాలకు మేలు చేస్తోంది. ఈ పథకం ద్వారా ఉచితంగా ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్లు అందిస్తూ మహిళల ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా, వంటలో వచ్చే కాలుష్యాన్ని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ యోజన కింద ప్రతి 14.2 కిలోల గ్యాస్ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ అందిస్తున్నారు. దీంతో పేద కుటుంబాలకు గ్యాస్ వినియోగం సులభమైంది. ఇప్పటికే దేశంలో లక్షలాది మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు.
వివరాలు
కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు జారీ
అయితే ప్రస్తుతం దేశంలో ఎల్‌పీజీ గ్యాస్ కొరత సమస్య తలెత్తింది. అనేక ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు జారీ చేసింది. ముఖ్యంగా ఉజ్వల యోజన లబ్ధిదారులు తప్పనిసరిగా పాటించాల్సిన కొన్ని నిబంధనలను వెల్లడించింది. ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ సంస్థ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ తెలిపిన ప్రకారం, ఉజ్వల యోజన లబ్ధిదారులు రూ.300 సబ్సిడీ పొందాలంటే బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ (eKYC) తప్పనిసరిగా పూర్తి చేయాలి. ఈ ప్రక్రియను ప్రతి ఆర్థిక సంవత్సరంలో కనీసం ఒకసారి చేయాల్సి ఉంటుంది.
వివరాలు
సబ్సిడీ కోల్పోకూడదంటే..
14.2 కిలోల గ్యాస్ సిలిండర్లకు 8వ మరియు 9వ రీఫిల్‌లపై డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) ద్వారా రూ.300 సబ్సిడీ పొందాలంటే eKYC తప్పనిసరి. ఇక 5 కిలోల సిలిండర్లకు అయితే 21వ రీఫిల్ నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుంది. ఈ సబ్సిడీని కోల్పోవద్దంటే లబ్ధిదారులు తప్పకుండా 2026 మార్చి 31లోపు eKYC పూర్తి చేయాలని సూచించారు. సమయానికి ఈ ప్రక్రియ పూర్తి చేస్తే గ్యాస్ రీఫిల్స్ పొందడంలో ఎలాంటి అంతరాయం ఉండదని తెలిపారు. అదేవిధంగా, ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా 9 రీఫిల్స్ వరకు మాత్రమే ఈ డీబీటీ సబ్సిడీ వర్తిస్తుందని స్పష్టం చేశారు.
వివరాలు
గ్యాస్ డెలివరీ చేసే వ్యక్తి ద్వారా కూడా eKYC
ఇక eKYC ప్రక్రియను వినియోగదారులు చాలా సులభంగా పూర్తి చేయవచ్చు. ఇంటి నుంచే సెల్ఫ్ బయోమెట్రిక్ విధానంలో HP Pay మొబైల్ యాప్ ద్వారా చేయవచ్చు. లేకపోతే గ్యాస్ డెలివరీ చేసే వ్యక్తి ద్వారా కూడా ఈ ప్రక్రియను పూర్తి చేసే అవకాశం ఉంది. ప్రతి సంవత్సరం తప్పనిసరిగా eKYC పూర్తి చేసిన వారికి మాత్రమే రీఫిల్ బుకింగ్,డెలివరీ సాఫీగా కొనసాగుతాయని హెచ్‌పీసీఎల్ వెల్లడించింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
హెచ్‌పీసీఎల్ చేసిన ట్వీట్
Kind Attention: Pradhan Mantri Ujjwala Yojana (PMUY) Beneficiaries
— Hindustan Petroleum Corporation Limited (@HPCL) March 30, 2026
To receive ₹300 Targeted DBT Subsidy on your 8th & 9th refills of 14.2 kg cylinders (or proportionate subsidy from the 21st refill onwards for 5 kg cylinders), Biometric Aadhaar Authentication (eKYC) must be… pic.twitter.com/eaZjA2CWDT