Netflix lay offs: నెట్‌ఫ్లిక్స్‌లో లేఆఫ్స్ కలకలం.. 5 శాతం మంది ఉద్యోగులకు షాక్!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ (Netflix)ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. సంస్థలోని మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 5 శాతం మందిని తగ్గించాలని యాజమాన్యం యోచిస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి వచ్చే వారం అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ పలు ఆంగ్ల మీడియా సంస్థలు ఈ విషయాన్ని వెల్లడించాయి. అయితే, ఈ వార్తలపై స్పందించేందుకు నెట్‌ఫ్లిక్స్ నిరాకరించింది. కాగా 2022లోనూ నెట్‌ఫ్లిక్స్ భారీ స్థాయిలో ఉద్యోగుల తొలగింపును చేపట్టింది. ఆ సమయంలో సంస్థ వృద్ధి మందగించడం, సబ్‌స్క్రైబర్ల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో వందలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. గతేడాది చివరి నాటికి నెట్‌ఫ్లిక్స్‌లో సుమారు 16 వేల మంది పూర్తిస్థాయి ఉద్యోగులు పనిచేస్తున్నట్లు సమాచారం.
వివరాలు
రోజురోజుకూ పోటీ తీవ్రతరం
ప్రస్తుతం స్ట్రీమింగ్ రంగంలో పోటీ రోజురోజుకూ తీవ్రమవుతోంది.
మరోవైపు ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం యూట్యూబ్ ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయంతో పాటు వీక్షకుల సంఖ్యలోనూ వేగంగా వృద్ధి చెందుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో పోటీని తట్టుకుని ఆదాయాన్ని పెంచుకునేందుకు నెట్‌ఫ్లిక్స్ తన వ్యాపార వ్యూహాల్లో మార్పులు చేస్తోంది.
ఈ వ్యూహంలో భాగంగా ప్రకటనల ఆధారిత సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లను ప్రోత్సహించడం, లైవ్ ప్రోగ్రామింగ్‌పై దృష్టి సారించడం, గేమింగ్ విభాగంలో పెట్టుబడులు పెట్టడం వంటి చర్యలు చేపడుతోంది.
స్ట్రీమింగ్ మార్కెట్‌లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవడంతో పాటు ఆదాయ వృద్ధిని సాధించడమే లక్ష్యంగా సంస్థ ఈ మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది.