LOADING...
Lenovo: ప్రపంచ మార్కెట్ల కోసం భారత్‌లో AI సర్వర్లు తయారు చేయనున్న లెనోవో
ప్రపంచ మార్కెట్ల కోసం భారత్‌లో AI సర్వర్లు తయారు చేయనున్న లెనోవో

Lenovo: ప్రపంచ మార్కెట్ల కోసం భారత్‌లో AI సర్వర్లు తయారు చేయనున్న లెనోవో

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 09, 2026
03:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ స్థాయి టెక్నాలజీ కంపెనీ లెనోవో (Lenovo) తన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వ్యాపారానికి భారత్‌ను కీలక ఎగుమతి కేంద్రంగా మార్చాలని యోచిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లను లక్ష్యంగా చేసుకుని భారత్‌లోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సర్వర్లను డిజైన్ చేసి తయారు చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ విషయాన్ని లెనోవో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సొల్యూషన్స్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్, జనరల్ మేనేజర్ స్కాట్ టీస్ (Scott Tease) పీటీఐకి తెలిపారు.

వివరాలు 

బెంగళూరు ల్యాబ్‌లో డిజైన్, పుదుచ్చేరి ప్లాంట్‌లో తయారీ

AI సర్వర్ సిస్టమ్‌ల డిజైనింగ్‌ను బెంగళూరులోని లెనోవో డెవలప్‌మెంట్ ల్యాబ్‌లో చేపడతామని స్కాట్ టీస్ చెప్పారు. అక్కడ రూపొందించిన డిజైన్‌లను పుదుచ్చేరిలోని కంపెనీ తయారీ కేంద్రంలో ఉత్పత్తి చేస్తామని తెలిపారు. ఈ సర్వర్లు దేశీయ అవసరాలతో పాటు ఎగుమతుల కోసం కూడా ఉపయోగపడతాయని పేర్కొన్నారు. "భవిష్యత్తులో AIకి ప్రధాన బలంగా నిలిచే వన్-సాకెట్, టూ-సాకెట్ సిస్టమ్‌లను ఇక్కడే డిజైన్ చేయబోతున్నాం" అని టీస్ అన్నారు.

వివరాలు 

మొదట దేశీయ మార్కెట్‌పైనే దృష్టి

భారత్‌లో లెనోవో తొలి ప్రాధాన్యం దేశీయ మార్కెట్ అవసరాలను తీర్చడంపైనే ఉంటుందని టీస్ స్పష్టం చేశారు. అయితే, భవిష్యత్తులో ప్రపంచ మార్కెట్ల కోసం కూడా భారత్‌లోనే సర్వర్లు తయారు చేసే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చారు. "భవిష్యత్తులో భారత్ నుంచి ప్రపంచం మొత్తానికి సర్వర్లు తయారు చేయకుండా అడ్డుకునే పరిస్థితులు ఏమీ లేవు" అని ఆయన అన్నారు.

Advertisement

వివరాలు 

₹17 వేల కోట్ల ఐటీ హార్డ్‌వేర్ పీఎల్‌ఐ స్కీమ్‌లో లెనోవో

భారత్ ప్రభుత్వం అమలు చేస్తున్న ₹17,000 కోట్ల విలువైన ఐటీ హార్డ్‌వేర్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకానికి ఎంపికైన కంపెనీల్లో లెనోవో ఇండియా ఒకటిగా నిలిచింది. ఈ పథకం ద్వారా భారత్‌లో టెక్ రంగంలో తన ఉనికిని మరింత బలోపేతం చేసుకోవడంతో పాటు, దేశాన్ని గ్లోబల్ టెక్ హబ్‌గా తీర్చిదిద్దే ప్రయత్నాల్లో భాగస్వామ్యం కావాలని లెనోవో భావిస్తోంది.

Advertisement

వివరాలు 

MSMEలకు హైబ్రిడ్ AI మోడల్ అవసరం

భారత్‌లోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు (MSMEs) హైబ్రిడ్ AI మోడల్ అనుకూలమని స్కాట్ టీస్ అభిప్రాయపడ్డారు. AIని వ్యాపారాల్లోకి తీసుకురావడానికి భారీ పెట్టుబడులు తప్పనిసరి కాదని చెప్పారు. "AI మోడల్ నిర్మాణం కొంత ఖర్చుతో కూడుకున్నదే అయినా, క్లౌడ్ ప్రొవైడర్లు లేదా GPU-as-a-service అందించే భారతీయ కంపెనీల సహాయంతో ఆ పనిని అవుట్‌సోర్స్ చేసుకోవచ్చు" అని వివరించారు.

వివరాలు 

నేచురల్ లాంగ్వేజ్‌తో అందరికీ AI

భవిష్యత్తులో ఇంగ్లిష్ వంటి నేచురల్ లాంగ్వేజ్‌లే AIకి సాధారణ ప్రోగ్రామింగ్ భాషలుగా మారతాయని టీస్ తెలిపారు. దీంతో టెక్నాలజీ అందరికీ సులభంగా అందుబాటులోకి వస్తుందని, AIపై ఆధిపత్యం కొద్ది మందికే పరిమితం కాకుండా విస్తృతంగా వ్యాపిస్తుందని అన్నారు. 'సావరిన్ AI'పై భారత ప్రభుత్వ దృష్టిని ఆయన ప్రశంసించారు.

వివరాలు 

AI డేటా సెంటర్లలో విద్యుత్ వినియోగంపై లెనోవో దృష్టి

AI డేటా సెంటర్లలో పెరుగుతున్న విద్యుత్ వినియోగంపై కూడా స్కాట్ టీస్ స్పందించారు. సంప్రదాయ ఎయిర్ కూలింగ్ విధానాలు ఖర్చును సుమారు 40 శాతం వరకు పెంచుతాయని చెప్పారు. అందుకే లెనోవో లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ (Lenovo Neptune)ని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. దీని ద్వారా విద్యుత్ వినియోగం దాదాపు 40 శాతం తగ్గడంతో పాటు, ఉత్పత్తయ్యే వేడిని ఇతర అవసరాలకు వినియోగించుకునే అవకాశం ఉంటుందని ఆయన వెల్లడించారు.

Advertisement