LOADING...
Personal Loan: తక్కువ వడ్డీ, తక్కువ ఒత్తిడి.. వ్యక్తిగత రుణాన్ని వేగంగా తీర్చే మార్గాలివే!
తక్కువ వడ్డీ, తక్కువ ఒత్తిడి.. వ్యక్తిగత రుణాన్ని వేగంగా తీర్చే మార్గాలివే!

Personal Loan: తక్కువ వడ్డీ, తక్కువ ఒత్తిడి.. వ్యక్తిగత రుణాన్ని వేగంగా తీర్చే మార్గాలివే!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 30, 2025
12:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

అవసర సమయంలో, ఇంటి మరమ్మతు, పిల్లల విద్య ఖర్చులు వంటి అంశాల కోసం ఎక్కువమందికి ముందుగా గుర్తొచ్చేది పర్సనల్ లోన్. ఈ రుణం పొందడం ఎంత సులభమో, దీన్ని కాలపరిమితిలోగా, ముఖ్యంగా త్వరగా తీర్చేయడం అంతే ముఖ్యం. అలా చేయడం వల్ల వడ్డీ భారం తక్కువగా ఉండటంతో పాటు ఆర్థికంగా కూడా లాభదాయకం. అందుకోసమే కొన్ని ముఖ్యమైన చిట్కాలు పాటించాలి.

Details

అదనపు చెల్లింపు చేసేటప్పుడు

మీ నెలవారీ ఈఎంఐకి (EMI) అదనంగా కొంత మొత్తం చెల్లించడం ద్వారా రుణ కాలాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. ఉదాహరణకి, మీరు రూ.5 లక్షల రుణాన్ని 12 శాతం వడ్డీ రేటుతో 5 ఏళ్లకు తీసుకుంటే, ఈఎంఐ రూ.11,222గా ఉంటుంది. కానీ ప్రతినెలా అదనంగా రూ.2,000 చెల్లిస్తే, ఈ రుణ వ్యవధి సుమారు 3.5 సంవత్సరాలకు తగ్గిపోతుంది. దీని వల్ల మొత్తం వడ్డీ భారం కూడా తక్కువ అవుతుంది. ఇది సాధించేందుకు మీ నెలవారీ బడ్జెట్‌లో అనవసర ఖర్చులను నియంత్రించాల్సిన అవసరం ఉంది.

Details

తక్కువ వడ్డీకి రుణ బదిలీ

మీరు ఉన్నత వడ్డీ రేటుతో రుణం తీసుకుని ఉంటే, అదే రుణాన్ని తక్కువ వడ్డీ ఇచ్చే సంస్థకు బదిలీ చేయడం ద్వారా నష్టాన్ని తగ్గించుకోవచ్చు. ఉదాహరణకు 16 శాతం వడ్డీ ఉన్న రుణాన్ని 11-12 శాతం వడ్డీ ఇచ్చే బ్యాంకుకు బదిలీ చేస్తే, మొత్తం వడ్డీ ఖర్చు తగ్గుతుంది. అయితే రుణ బదిలీ ప్రక్రియలో ప్రాసెసింగ్ ఫీజులు, ఇతర ఛార్జీలు ఉండొచ్చు. ఇవి ముందుగా తెలుసుకొని అంచనాలు వేసుకోవాలి.

Advertisement

Details

 ఊహించని ఆదాయంతో అప్పు తీర్చేయండి

ఒక్కొసారి మీకు ఊహించని ఆదాయ వనరులు రావచ్చు - బోనస్, టాక్స్ రీఫండ్, ఆస్తుల విక్రయం వంటి వాటి రూపంలో. అలాంటి సమయంలో వాటిని ఖర్చు చేయడం కన్నా, వాటిని రుణ అసలుకు జమ చేయడం మేలైన ఆర్థిక నిర్ణయం. ఉదాహరణకు మీరు రూ.50,000 బోనస్ పొందితే, దానిని రుణ అసలుకు చెల్లిస్తే మిగతా కాలానికి వడ్డీ భారం తగ్గుతుంది. చలన వడ్డీ ఉన్న రుణాలపై ముందస్తు చెల్లింపు చేసేందుకు RBI మార్గదర్శకాల ప్రకారం ఎలాంటి రుసుములు ఉండవు. అయితే, కొన్ని సంస్థలు పాక్షిక చెల్లింపులను అనుమతించకపోవచ్చు. ఈ విషయాన్ని రుణం తీసుకునే సమయంలోనే తెలుసుకోవాలి.

Advertisement

Details

క్రెడిట్ స్కోరు బాగుంటే - మంచి వడ్డీ రేటు పొందొచ్చు

రుణాన్ని క్రమంగా చెల్లిస్తే, మీ క్రెడిట్ స్కోరు మెరుగవుతుంది. మంచి స్కోరు ఉన్నప్పుడు, మీరు రుణదాతతో చర్చించి వడ్డీ రేటును తగ్గించమని కోరొచ్చు. ఉదాహరణకు మీరు రెండేళ్లుగా ఈఎంఐలు సకాలంలో చెల్లిస్తుంటే, బ్యాంకుతో మాట్లాడి వడ్డీ రేటును 1-2 శాతం తగ్గించమని అభ్యర్థించవచ్చు. కొన్ని బ్యాంకులు దీనికి అంగీకరించవచ్చు. కొన్ని మాత్రం చిన్న మొత్తంలో రివిజన్ ఫీజు వసూలు చేస్తాయి.

Details

క్రమశిక్షణే కాపాడుతుంది

ఏ రుణమైనా తీసుకున్న తర్వాత దాన్ని క్రమంగా తీర్చాలన్న ఆర్థిక క్రమశిక్షణ అవసరం. అనవసర ఖర్చులను తగ్గించుకోవడం, ఖరీదైన కొనుగోళ్లను నివారించడం వంటి అలవాట్లను కలుపుకుంటే అప్పుల బారిన పడే పరిస్థితి తలెత్తదు. అప్పు చేసుకోవాల్సిన అవసరాలు కూడా తగ్గుతాయి. తిరిగి చెప్పాలంటే... అప్పు తీసుకోవడంలో తప్పులేదు. కానీ దాన్ని తొందరగా తీర్చాలన్న సంకల్పం, క్రమశిక్షణ ఉండాలి. అప్పుడే వడ్డీ భారం తగ్గుతుంది.. ఆర్థిక స్వేచ్ఛ దిశగా అడుగులు వేయొచ్చు.

Advertisement