Loading...
Venkat Chalasani: మ్యూచువల్‌ ఫండ్లలో బిగ్‌ రికార్డు.. త్వరలోనే రూ.100 లక్షల కోట్ల ఏయూఎం!
మ్యూచువల్‌ ఫండ్లలో బిగ్‌ రికార్డు.. త్వరలోనే రూ.100 లక్షల కోట్ల ఏయూఎం!

Venkat Chalasani: మ్యూచువల్‌ ఫండ్లలో బిగ్‌ రికార్డు.. త్వరలోనే రూ.100 లక్షల కోట్ల ఏయూఎం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 19, 2026
09:29 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత స్టాక్‌ మార్కెట్‌ దిశను నిర్ణయించే పరిస్థితి ఒకప్పుడు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల (ఎఫ్‌ఐఐ) చేతుల్లో ఉండేదని.. ఇప్పుడు ఆ పరిస్థితి మారిందని భారతీయ మ్యూచువల్‌ ఫండ్ల సంఘం (యాంఫీ) సీఈఓ వెంకట్‌ చలసాని తెలిపారు. ప్రస్తుతం దేశీయ రిటెయిల్‌ మ్యూచువల్‌ ఫండ్‌ పెట్టుబడిదారులతో పాటు దేశీయ సంస్థాగత మదుపరులే మార్కెట్‌కు కీలకంగా మారారని పేర్కొన్నారు. క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్‌) ద్వారా ప్రతి నెలా వస్తున్న రూ.వేల కోట్ల పెట్టుబడులు దేశీయ ఈక్విటీ మార్కెట్‌కు బలమైన రక్షణ కవచంలా మారాయని ఆయన విశ్లేషించారు. ''2014లో దేశంలో మొత్తం ఫండ్ల నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ రూ.10 లక్షల కోట్లు. 12 ఏళ్లలో ఈ మొత్తం రూ.87 లక్షల కోట్లకు చేరింది.

వివరాలు

కీలకంగా తెలుగు రాష్ట్రాలు

రాబోయే 9-12 నెలల్లో రూ.100లక్షల కోట్ల (రూ.1 కోటి కోట్లు) మైలురాయిని అధిగమిస్తామనే నమ్మకం ఉంది. దేశంలో ఫండ్‌ మదుపర్ల సంఖ్య 6.3 కోట్లకు పైగా ఉందని వెంకట్‌ చలసాని వివరించారు.

మ్యూచువల్‌ ఫండ్‌ పెట్టుబడుల విషయంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు వేగంగా వృద్ధి సాధిస్తున్నాయని వెంకట్‌ చలసాని తెలిపారు.

రెండు రాష్ట్రాల్లో కలిపి మొత్తం మ్యూచువల్‌ ఫండ్‌ ఆస్తుల విలువ రూ.2.95 లక్షల కోట్లకు చేరిందన్నారు.

ఇందులో తెలంగాణలోని ఫండ్‌ ఆస్తుల విలువ రూ.2,12,856 కోట్లుగా ఉందని చెప్పారు. దేశవ్యాప్తంగా 2.5 శాతం వాటాతో తెలంగాణ 8వ స్థానంలో ఉందని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌ నుంచి వచ్చిన ఏయూఎం (ఆస్తుల నిర్వహణ విలువ) రూ.82,409 కోట్ల మేర ఉందని వెంకట్‌ పేర్కొన్నారు.

వివరాలు

బంగారం, స్థిరాస్తులపై అధిక పెట్టుబడులు

విశాఖపట్నం, విజయవాడ నగరాల నుంచి అధిక మొత్తంలో మ్యూచువల్‌ ఫండ్‌ పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు.

సంప్రదాయకంగా బంగారం, స్థిరాస్తులు కొనుగోలు చేసే అలవాటు తెలుగు ప్రజల్లో ఎక్కువగా ఉందని వెంకట్‌ చలసాని తెలిపారు.

జాతీయ సగటుతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో ఈ రెండు విభాగాల్లోనే పెట్టుబడులు అధికంగా ఉన్నాయని పేర్కొన్నారు.

ఆర్థిక ఆస్తుల విషయానికి వస్తే.. దాదాపు 40 శాతం వరకు పెట్టుబడులు బ్యాంకు డిపాజిట్లలోనే ఉంటున్నాయని తెలిపారు.

'మనం కష్టపడి సంపాదించిన సొమ్ము మనకు ఉపయోగపడాలి. కేవలం డిపాజిట్లు, స్థిరాస్తుల్లోనే ఉంచితే ద్రవ్యోల్బణం, పన్నుల తర్వాత నికర రాబడి తక్కువగా లభిస్తుంది.

దీర్ఘకాలిక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లక్ష్యాలకు తగ్గట్లు సంపదను సృష్టించుకోవచ్చని వెంకట్‌ చలసాని సూచించారు.

ADVERTISEMENT