LOADING...
Stock market : ఉద్రిక్తతల మధ్య మార్కెట్ హ్యాట్రిక్ లాభాలు.. రూపాయి చరిత్రలో కనిష్ఠం
ఉద్రిక్తతల మధ్య మార్కెట్ హ్యాట్రిక్ లాభాలు.. రూపాయి చరిత్రలో కనిష్ఠం

Stock market : ఉద్రిక్తతల మధ్య మార్కెట్ హ్యాట్రిక్ లాభాలు.. రూపాయి చరిత్రలో కనిష్ఠం

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 18, 2026
04:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా మూడో రోజు కూడా లాభాలతో ముగిశాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ మార్కెట్లు స్థిరంగా రాణించడం విశేషం. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు, ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టడం వంటి అంశాలు పెట్టుబడిదారుల భావోద్వేగాన్ని బలపరిచాయి. ఈ ప్రభావంతో సెన్సెక్స్ ఒక దశలో 900 పాయింట్ల వరకు ఎగబాకగా, మొత్తం మూడు ట్రేడింగ్ సెషన్లలో 2100 పాయింట్లు పెరిగింది. ఇదే సమయంలో మదుపర్ల సంపద దాదాపు రూ.6 లక్షల కోట్ల మేర పెరిగింది. సెన్సెక్స్ 76,367.55 వద్ద (మునుపటి ముగింపు 76,070.84) లాభాలతో ప్రారంభమై రోజంతా పాజిటివ్ జోన్‌లోనే కదిలింది. ఇంట్రాడేలో 77,000 మార్క్‌ను తాకి, చివరకు 633 పాయింట్లు పెరిగి 76,704.13వద్ద ముగిసింది.

Details

ఐటీ రంగంలో కొనుగోళ్ల జోరు

నిఫ్టీ కూడా 196.65 పాయింట్లు లాభపడి 23,777.80 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌లోని 30 కంపెనీల్లో ఎటర్నల్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. మరోవైపు హిందుస్థాన్ యూనిలీవర్, ఎన్టీపీసీ, సన్ ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐటీసీ షేర్లు నష్టాల్లో ముగిశాయి. ముఖ్యంగా ఐటీ రంగంలో కొనుగోళ్ల జోరు స్పష్టంగా కనిపించింది. ఇక దేశీయ కరెన్సీ రూపాయి పతనం కొనసాగింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ తొలిసారిగా 92.50 దాటింది. చివరకు 92.65 వద్ద జీవితకాల కనిష్ఠాన్ని తాకింది.

Details

మార్కెట్ లాభాలకు ప్రధాన కారణాలు ఇవే

అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ధరలు సుమారు 1శాతం తగ్గి బ్యారెల్‌కు 102డాలర్ల వద్ద కొనసాగడం పెట్టుబడిదారులకు ఊరటనిచ్చింది. తుర్కియేలోని సెహాన్ పోర్టు ద్వారా చమురు ఎగుమతులపై ఇరాక్ ప్రభుత్వం, కుర్దిష్ అధికారులు ఒప్పందం కుదుర్చుకోవడం ఇందుకు కారణం. వాల్ స్ట్రీట్ లాభాలతో ముగియడంతో ఆసియా మార్కెట్లతో పాటు భారత మార్కెట్లు కూడా పాజిటివ్‌గా స్పందించాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై ఇవ్వబోయే ప్రకటనపై మార్కెట్ల దృష్టి కేంద్రీకృతమైంది యుద్ధ ప్రభావంతో గత రెండు వారాల్లో మార్కెట్లు భారీ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. దాదాపు 10% వరకు సూచీలు పడిపోవడంతో స్టాక్స్ తక్కువ ధరలకు చేరాయి. దీంతో కనిష్ఠ స్థాయిల్లో పెట్టుబడిదారులు కొనుగోళ్లకు దిగడంతో మార్కెట్లు మళ్లీ లాభాల బాట పట్టాయి.

Advertisement