Stock market today: ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించినా.. నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా ఫెడరల్ రిజర్వ్ (US Fed) మార్కెట్ అంచనాలకు అనుగుణంగా కీలక వడ్డీ రేట్లను పావు శాతం మేర తగ్గించింది. ఇదే సమయంలో భవిష్యత్‌లో వడ్డీరేట్లపై తీసుకోబోయే నిర్ణయాలకు సంబంధించిన ముఖ్య సంకేతాలను కూడా వెల్లడించింది. ఈ ఏడాది మళ్లీ వడ్డీ రేట్ల కోత ఉండదని ఫెడ్ చైర్మన్ జెరోమ్ పోవెల్ స్పష్టం చేయడంతో మదుపర్లలో నిరాశ నెలకొంది. దాంతో గ్లోబల్ మార్కెట్లతో పాటు దేశీయ మార్కెట్లలో కూడా అమ్మకాల ఒత్తిడి పెరిగింది. అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందంపై సానుకూల వార్తలు వచ్చినప్పటికీ, మదుపర్లు జాగ్రత్త ధోరణి అవలంబించారు. ముఖ్యంగా మెటల్, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా రంగాల షేర్లలో భారీగా అమ్మకాలు నమోదయ్యాయి.
వివరాలు
అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 64.53 డాలర్లు
సెన్సెక్స్ 84,997.13 పాయింట్ల క్రితం ముగింపు స్థాయితో పోలిస్తే, ఉదయం 84,750.90 వద్ద నష్టాలతో ప్రారంభమైంది. రోజంతా దిగువస్థాయిల్లోనే కొనసాగి చివరికి 592.67 పాయింట్లు క్షీణించి 84,404.46 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 176.05 పాయింట్లు కోల్పోయి 25,877.85 వద్ద స్థిరపడింది. రూపాయి-డాలర్ మారకం విలువ 88.70 వద్ద నమోదైంది. సెన్సెక్స్-30 సూచీలో భారతీ ఎయిర్‌టెల్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు గణనీయంగా నష్టపోయాయి. మరోవైపు ఎల్‌అండ్‌టీ, బీఈఎల్, అల్ట్రాటెక్ సిమెంట్, మారుతీ సుజుకీ, అదానీ పోర్ట్స్ షేర్లు లాభాల్లో నిలిచాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 64.53 డాలర్ల వద్ద కొనసాగగా, బంగారం ఔన్సు ధర 3,986 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.