Gold-Oil prices: ట్రంప్ ప్రకటనతో మార్కెట్లలో సంచలనం.. చమురు ధరలు కిందకి.. బంగారం, వెండి పైకి!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. హర్మూజ్ జలసంధిని 48 గంటల్లో తెరవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)ఇచ్చిన అల్టిమేటం ఒకవైపు.. దానికి ప్రతిగా హర్మూజ్‌ను పూర్తిగా మూసివేస్తామని ఇరాన్ హెచ్చరిక మరోవైపు రావడంతో యుద్ధం ఎటు దిశగా వెళ్తుందోనన్న ఆందోళనలు పెరిగాయి. ఈ ఉద్రిక్తతల ప్రభావంతో సోమవారం ఉదయం అంతర్జాతీయంగా చమురు ధరలు ఎగిసిపడగా.. బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా క్షీణించాయి.
వివరాలు
సాయంత్రానికి మారిన సీన్
అయితే అదే రోజు సాయంత్రానికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్‌పై కాల్పుల విరమణ ప్రకటించారు. ఇరాన్‌లోని ఇంధన మౌలిక వసతులు, విద్యుత్ కేంద్రాలపై దాడులను ఐదు రోజులపాటు నిలిపివేయాలని తమ సైన్యానికి ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. దీంతో ఒక్కసారిగా గ్లోబల్ మార్కెట్లలో సెంటిమెంట్ మారిపోయింది. చమురు ధరలు పడిపోగా.. బంగారం, వెండి మళ్లీ పుంజుకున్నాయి. కిందికి జారిన చమురు ధరలు ఇరాన్‌పై దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు వచ్చిన ప్రకటనతో అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు సుమారు 13 శాతం పడిపోయి 96 డాలర్ల వద్దకు చేరింది.
వివరాలు
మళ్లీ పెరిగిన బంగారం,వెండి
అంటే ఒక్క ప్రకటనతోనే దాదాపు 17 డాలర్లు తగ్గింది. అలాగే వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ కూడా 13 డాలర్ల మేర క్షీణించి 85 డాలర్ల స్థాయికి దిగివచ్చింది. పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా సోమవారం ఉదయం బంగారం,వెండి ధరలు భారీగా పడిపోయాయి. ద్రవ్యోల్బణ భయాలు, డాలర్ బలోపేతం ఈ పతనానికి కారణమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ధర ఒక దశలో ఔన్సుకు 4099 డాలర్లకు చేరింది. అయితే Donald Trump ప్రకటనతో పరిస్థితి తిరగబడింది. రాత్రి 8 గంటల సమయానికి బంగారం ధర మళ్లీ పెరిగి 4474 డాలర్లకు చేరింది.
వివరాలు
స్టాక్ మార్కెట్లపై ప్రభావం
వెండి ధర కూడా ఔన్సుకు 70 డాలర్ల వద్దకు చేరింది. దేశీయంగా హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఉదయం 10 గ్రాముల బంగారం రూ.1.36 లక్షల వరకు దిగివచ్చినా.. సాయంత్రానికి మళ్లీ రూ.1.46 లక్షలకు పెరిగింది. వెండి ధర కిలోకు రూ.2.10 లక్షల నుంచి రూ.2.32 లక్షల వరకు పెరిగింది. ఈ కీలక ప్రకటన స్టాక్ మార్కెట్ ముగియకముందే వచ్చి ఉంటే దేశీయ మార్కెట్లు భారీ నష్టాల నుంచి బయటపడేవని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం గిఫ్ట్ నిఫ్టీ 920 పాయింట్లకు పైగా లాభంతో 23,391 వద్ద ట్రేడవుతోంది. ఈ మధ్యలో మరే ప్రతికూల వార్తలు రాకపోతే మంగళవారం భారత మార్కెట్లు బలంగా పెరిగే అవకాశముందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.