Diwali Festival Sales: దీపావళి పండుగ వేళ భారీ వ్యాపారం.. దేశవ్యాప్తంగా రూ.5 లక్షల కోట్ల అంచనా!
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా దీపావళి పండుగ సీజన్ వ్యాపార వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఈ ఏడాది పండుగ సీజన్లో దేశవ్యాప్తంగా సుమారు రూ.5 లక్షల కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉందని ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (సీటీఐ) అంచనా వేసింది. ఢిల్లీలోనే దాదాపు రూ.80,000కోట్ల వాణిజ్యం నమోదవుతుందని వెల్లడించింది. ఈ పండుగ సీజన్ దేశవ్యాప్తంగా వ్యాపారులకు మంచి అవకాశాలను తీసుకొచ్చిందని సీటీఐ చైర్మన్ బ్రిజేష్ గోయల్ తెలిపారు. వినియోగదారులు స్వదేశీ ఉత్పత్తుల కొనుగోలుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని పేర్కొన్నారు. గత నెలలో ర్యాలీలు, నిరసనల కారణంగా వ్యాపార నష్టాలను ఎదుర్కొన్న ఢిల్లీ వ్యాపారులు.. దీపావళి అమ్మకాల ద్వారా ఆ నష్టాలను భర్తీ చేసుకుని మళ్లీ లాభాల బాట పట్టాలని ఆశిస్తున్నట్లు వివరించారు.
వివరాలు
ఆటోమొబైల్ విక్రయాలు 55 శాతం
దేశవ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలు సానుకూలంగా సాగుతున్నాయనడానికి ఆటోమొబైల్ అమ్మకాల గణాంకాలే నిదర్శనమని గోయల్ అన్నారు.
ఇటీవల విడుదలైన నివేదిక ప్రకారం రిటైల్ ఆటోమొబైల్ విక్రయాలు 55 శాతం పెరిగినట్లు తెలిపారు.
ఇందులో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 70 శాతం, ద్విచక్ర వాహనాల విక్రయాలు 52 శాతం, త్రీ-వీలర్ల అమ్మకాలు 110 శాతం వృద్ధి సాధించాయని వివరించారు.
ఈ గణాంకాలు మార్కెట్లో వినియోగదారుల నుంచి బలమైన డిమాండ్ ఉందని సూచిస్తున్నాయని పేర్కొన్నారు.
ఈ ఏడాది పండుగ సీజన్లో ప్రజలు స్వదేశీ వస్తువులకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని బ్రిజేష్ గోయల్ తెలిపారు.
వివరాలు
అలంకరణ వస్తువులకు ఫుల్ గిరాకీ
మట్టి ప్రమిదలు, దేవుళ్ల విగ్రహాలు, హస్తకళా ఉత్పత్తులు, గోడల అలంకరణ వస్తువులు, శుభ్-లాభ్, ఓం వంటి సంప్రదాయ చిహ్నాలకు మంచి గిరాకీ ఉందన్నారు.
స్థానిక కళాకారులు, చేతివృత్తి నిపుణులు తయారు చేసిన ఉత్పత్తుల అమ్మకాలు గణనీయంగా పెరిగాయని చెప్పారు.
జీఎస్టీ సంస్కరణలు కూడా భారతీయ ఉత్పత్తులకు మరింత గుర్తింపు తీసుకొచ్చాయని, స్థానికంగా తయారైన వస్తువులకు డిమాండ్ పెరగడానికి దోహదపడ్డాయని సీటీఐ తన ప్రకటనలో పేర్కొంది.
దీపావళి సందర్భంగా ఎఫ్ఎంసీజీ (FMCG), కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఎలక్ట్రానిక్స్, వస్త్రాలు, ఫ్యాషన్ దుస్తులు, మొబైల్ ఫోన్లు, గృహోపకరణాలు, ఫర్నిచర్ వంటి రంగాల్లోనూ భారీగా వ్యాపారం జరిగే అవకాశం ఉందని అంచనా వేసింది.
వివరాలు
అదే మార్కెట్లో అమ్మకాలు పెరగడానికి కారణం
ఈ పండుగ సమయంలో దేశవ్యాప్తంగా సుమారు 5 కోట్ల బహుమతులను ప్రజలు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారని, ఇది కూడా మార్కెట్లో అమ్మకాలు పెరగడానికి కారణమవుతోందని తెలిపింది.
ఇక ఢిల్లీలోని ప్రధాన మార్కెట్లలో కొనుగోళ్ల సందడి నెలకొంది. చాందినీ చౌక్, సదర్ బజార్, కమలా నగర్, రాజౌరీ గార్డెన్, లజపత్ నగర్ వంటి ప్రాంతాలు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి.
మొబైల్ ఫోన్లు, బహుమతులు, డ్రై ఫ్రూట్స్, దుస్తులు, ఎలక్ట్రానిక్ వస్తువుల కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి.
ఇవన్నీ దేశ రాజధానిలో వ్యాపార కార్యకలాపాలు మళ్లీ పుంజుకుంటున్నాయనడానికి సంకేతాలని బ్రిజేష్ గోయల్ పేర్కొన్నారు.