Loading...
Stock market: ఐటీ స్టాక్స్‌లో భారీ కొనుగోళ్లు.. 888 పాయింట్లు దూసుకెళ్లిన సెన్సెక్స్‌!
ఐటీ స్టాక్స్‌లో భారీ కొనుగోళ్లు.. 888 పాయింట్లు దూసుకెళ్లిన సెన్సెక్స్‌!

Stock market: ఐటీ స్టాక్స్‌లో భారీ కొనుగోళ్లు.. 888 పాయింట్లు దూసుకెళ్లిన సెన్సెక్స్‌!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 29, 2026
04:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్‌ మార్కెట్ గురువారం భారీ లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు వచ్చినప్పటికీ.. ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, మెటల్‌, బ్యాంకింగ్‌ రంగాల షేర్లకు బలమైన కొనుగోళ్లు నమోదవడంతో సూచీలు గణనీయంగా పుంజుకున్నాయి. దీనికి విదేశీ పెట్టుబడిదారుల (ఎఫ్‌పీఐలు) పెట్టుబడుల మద్దతు కూడా తోడైంది. ఫలితంగా సెన్సెక్స్‌ 888.68 పాయింట్లు ఎగబాకి 77,654.60 వద్ద ముగియగా.. నిఫ్టీ 264.85 పాయింట్లు లాభపడి 24,250.20 వద్ద స్థిరపడింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.64 వద్ద కొనసాగింది. సెన్సెక్స్‌-30లో ఆదానీ పోర్ట్స్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, పవర్‌ గ్రిడ్‌, బీఈఎల్‌, ఎన్‌టీపీసీ షేర్లు మినహా మిగిలిన అన్ని స్టాక్స్‌ లాభాల్లో ముగిశాయి.

వివరాలు

మార్కెట్‌ ర్యాలీకి ప్రధాన కారణాలు

అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 87.65 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. బంగారం ధర ఔన్స్‌కు 4,031.84 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

ఏఐ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టిన మదుపర్లు.. ఆశించిన స్థాయిలో రాబడులు లభించకపోవచ్చనే అంచనాలతో ఇప్పుడు ఐటీ షేర్ల వైపు దృష్టి మళ్లిస్తున్నారు.

దీంతో నేటి ట్రేడింగ్‌లో ఐటీ, బ్యాంకింగ్‌ రంగాల షేర్లలో భారీ కొనుగోళ్లు కనిపించాయి. మరోవైపు విదేశీ పెట్టుబడిదారుల పెట్టుబడుల ప్రవాహం భారత మార్కెట్లకు బలాన్నిచ్చింది.

అలాగే అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ (యూఎస్‌ ఫెడ్‌) వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించే అవకాశాలపై ఉన్న అంచనాలు కూడా మార్కెట్‌ సెంటిమెంట్‌ను మరింత బలపరిచాయి.

ADVERTISEMENT