LOADING...
Meta: మెటాలో భారీ ఉద్యోగాల కోత.. 8 వేల మందికి ఉద్వాసన
మెటాలో భారీ ఉద్యోగాల కోత.. 8 వేల మందికి ఉద్వాసన

Meta: మెటాలో భారీ ఉద్యోగాల కోత.. 8 వేల మందికి ఉద్వాసన

వ్రాసిన వారు Sirish Praharaju
May 20, 2026
01:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఫేస్‌ బుక్‌ మాతృసంస్థ మెటా మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగుల తగ్గింపుకు సిద్ధమైంది. ఈ నెల 20న సంస్థలో పనిచేస్తున్న సుమారు 8 వేల మందికి పైగా ఉద్యోగులను విధుల నుంచి తొలగించనున్నట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం ఉద్యోగుల్లో ఇది దాదాపు పది శాతంగా భావిస్తున్నారు. ఉద్యోగాల కోతతో పాటు సంస్థలోని మరో 7 వేల మంది సిబ్బందిని కొత్త బాధ్యతల్లోకి మార్చనున్నారు. ముఖ్యంగా కృత్రిమ మేధ ఆధారిత విభాగాలను బలోపేతం చేసే దిశగా ఈ మార్పులు చేపడుతున్నట్లు తెలుస్తోంది.

వివరాలు 

మూడు విడతల్లో ఉద్యోగులకు సమాచార సందేశాలు

ప్రస్తుతం మెటాలో 78 వేల మందికి తక్కువగా ఉద్యోగులు ఉన్నారు. తాజా నిర్ణయాలతో ప్రభావితమయ్యే ఉద్యోగుల సంఖ్య మొత్తం సిబ్బందిలో దాదాపు 20 శాతానికి చేరినట్లు అంచనా. సంస్థ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ఉద్యోగుల తొలగింపులు, బదిలీలు చేపడుతున్నట్లు ఉద్యోగులకు అంతర్గత సమాచార పత్రం ద్వారా తెలియజేసినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థ వెల్లడించింది. ఈ నెల 20న మూడు విడతల్లో ఉదయం 4 గంటలకు ఉద్యోగులకు సమాచార సందేశాలు పంపనున్నట్లు సంస్థ వర్గాలు తెలిపాయి.

వివరాలు 

స్టాండర్డ్‌ చార్టెర్డ్‌లోనూ కోతలు

బ్రిటన్‌కు చెందిన అంతర్జాతీయ బ్యాంకింగ్‌ సంస్థ స్టాండర్డ్‌ చార్టెర్డ్‌ కూడా భారీ ఉద్యోగాల కోతకు సిద్ధమైంది. 2030 నాటికి సుమారు 7,800 మంది ఉద్యోగులను తొలగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించింది. ఇది సంస్థ మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 15 శాతం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ బ్యాంకులో 82 వేల మంది పనిచేస్తుండగా, వారిలో 52 వేల మందికి పైగా సంస్థ లక్ష్యంగా పెట్టుకున్న విభాగాల్లో ఉన్నారు. ఆసియా మార్కెట్‌పై ఎక్కువగా ఆధారపడిన స్టాండర్డ్‌ చార్టెర్డ్‌ సంస్థ, వెనుకస్థాయి కార్యకలాపాలను తగ్గించి కృత్రిమ మేధ సాయంతో పనితీరును మెరుగుపర్చాలని యోచిస్తోంది. ఈ మార్పుల ప్రభావంతోనే ఉద్యోగుల తొలగింపులు చేపట్టనున్నట్లు సమాచారం.

Advertisement