Meta: CRED సీఈవో పదవి నుంచి తప్పుకున్న కునాల్ షా.. మెటాలో కొత్త బాధ్యతలు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ CRED వ్యవస్థాపకుడు కునాల్ షా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన మెటా సంస్థలో చేరి ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్‌కు నాయకత్వం వహించనున్నట్లు సోమవారం ప్రకటించారు. గత కొన్ని సంవత్సరాలుగా CREDను విజయవంతంగా నడిపిన అనంతరం తన కార్యనిర్వాహక బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన కునాల్ షా, CRED ఇప్పుడు తదుపరి వృద్ధి దశకు సిద్ధంగా ఉందని తెలిపారు. సంస్థకు తాత్కాలిక సీఈవోగా మితెన్ సంపత్ బాధ్యతలు స్వీకరించనున్నారని చెప్పారు. 2020 నుంచి తనతో కలిసి పనిచేస్తున్న మితెన్ సంపత్ ఇప్పటివరకు సంస్థలో వ్యూహాత్మక ప్రణాళికలు, ఆర్థిక వ్యవహారాలను పర్యవేక్షించారని పేర్కొన్నారు.
వివరాలు
1.7 కోట్లకు CRED సభ్యుల సంఖ్య
తన వ్యాపార ప్రయాణాన్ని గుర్తు చేసుకున్న కునాల్ షా, 2015-2018 మధ్య ఫ్రీచార్జ్ నుంచి నిష్క్రమించిన తర్వాత కొత్త ఆలోచనలను అన్వేషించానని చెప్పారు. తన సొంత నిధుల నుంచి 10 లక్షల డాలర్ల పెట్టుబడితో CREDను ప్రారంభించి, సమయానికి క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించే వినియోగదారులను ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. 2019 నుంచి 2025 మధ్య CRED సభ్యుల సంఖ్య సున్నా నుంచి 1.7 కోట్లకు పెరిగిందని కునాల్ షా తెలిపారు. వినియోగదారుల ప్రవర్తనకు అనుగుణంగా ప్రోత్సాహకాలు అందించడం వల్ల ఈ వృద్ధి సాధ్యమైందన్నారు. కోవిడ్ లాక్‌డౌన్ కాలంలో కూడా పలు కొత్త ఉత్పత్తులను ప్రారంభించామని, ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారుల నుంచి 900 మిలియన్ డాలర్లకు పైగా నిధులు సమీకరించామని వెల్లడించారు.
వివరాలు
మెటా నుంచి 900 మిలియన్ డాలర్ల పెట్టుబడులు
అదేవిధంగా సంస్థ నాలుగు ESOP బైబ్యాక్ కార్యక్రమాలను నిర్వహించిందని, అవసరమైన అన్ని నియంత్రణ అనుమతులను పొందిందని చెప్పారు. చెల్లింపులు, రుణాలు, బీమా, వాణిజ్యం, సంపద నిర్వహణ, క్రెడిట్ కార్డ్ సేవలు వంటి విభాగాల్లో సంస్థ వార్షిక ఆదాయం సుమారు 325 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.3,200 కోట్లు) చేరిందని తెలిపారు. 2026లో CRED తన తొలి లాభదాయక త్రైమాసికాన్ని నమోదు చేసిందని కునాల్ షా వెల్లడించారు. అలాగే మెటా నుంచి మరో 900 మిలియన్ డాలర్ల పెట్టుబడులు సమీకరించినట్లు, ఐదో ESOP బైబ్యాక్ కార్యక్రమాన్ని కూడా ప్రకటిస్తున్నట్లు చెప్పారు.
వివరాలు
పంచవ్యాప్తంగా వాట్సాప్ కార్యకలాపాలకు నాయకత్వం
తాను రోజువారీ నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకున్నప్పటికీ CREDలో వాటాదారుడిగా కొనసాగుతానని కునాల్ షా స్పష్టం చేశారు. సంస్థ అభివృద్ధి పట్ల తన నిబద్ధతలో ఎలాంటి మార్పు ఉండదని, కేవలం తన పాత్ర మాత్రమే మారుతోందని పేర్కొన్నారు. మెటాలో తన కొత్త బాధ్యతల గురించి మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ కార్యకలాపాలకు నాయకత్వం వహించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం వాట్సాప్ భారీ స్థాయికి చేరుకున్నప్పటికీ, ఇంకా అపారమైన వృద్ధి అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. అలాగే CREDలో మెటా మైనారిటీ పెట్టుబడిదారుగా మాత్రమే ఉంటుందని, సంస్థ సభ్యుల వ్యక్తిగత డేటాకు మెటాకు ఎలాంటి ప్రాప్యత ఉండదని కునాల్ షా స్పష్టం చేశారు.