Microsoft: మైక్రోసాఫ్ట్‌కు చారిత్రక రికార్డు.. ఒక్కరోజే రూ.42 లక్షల కోట్లకు పైగా మార్కెట్ విలువ పెరుగుదల
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ అమెరికా స్టాక్ మార్కెట్‌లో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒక్క ట్రేడింగ్ రోజులోనే 450 బిలియన్ డాలర్లు పెరిగి కొత్త చరిత్రను సృష్టించింది. భారత కరెన్సీలో ఈ పెరుగుదల విలువ దాదాపు రూ.42 లక్షల కోట్లకు మించి ఉండటం విశేషం. అమెరికా కాలమానం ప్రకారం గురువారం జరిగిన ట్రేడింగ్‌లో మైక్రోసాఫ్ట్ షేర్లు ఏకంగా 16 శాతం ఎగబాకాయి. ఈ భారీ ర్యాలీతో కంపెనీ మార్కెట్ విలువ ఒక్కరోజులోనే అపూర్వ స్థాయికి చేరుకుంది. అమెరికా స్టాక్ మార్కెట్ చరిత్రలో ఒకే రోజులో ఏ కంపెనీ మార్కెట్ విలువ ఇంత భారీగా పెరగడం ఇదే మొదటిసారి.
వివరాలు
మైక్రోసాఫ్ట్‌కు బలమైన ఊతం..
ఇప్పటి వరకు ఈ రికార్డు చిప్ తయారీ దిగ్గజం ఎన్విడియా పేరిట ఉండేది.
గత ఏడాది ఏప్రిల్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై విధించిన టారిఫ్‌లను 90 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఎన్విడియా షేర్లు భారీగా పుంజుకున్నాయి.
ఆ ట్రేడింగ్ సెషన్‌లో ఎన్విడియా మార్కెట్ విలువ 440 బిలియన్ డాలర్లు పెరిగి అప్పటివరకు అత్యధికంగా నమోదైంది.
తాజాగా మైక్రోసాఫ్ట్ ఆ రికార్డును అధిగమించి కొత్త మైలురాయిని నెలకొల్పింది. ఈ పెరుగుదలతో కంపెనీ మొత్తం మార్కెట్ విలువ 3.35 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది.
ఇటీవల ప్రకటించిన త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మైక్రోసాఫ్ట్‌కు బలమైన ఊతమిచ్చాయి.
వివరాలు
ఒక్క రోజే దాదాపు 16 శాతం పెరుగుదల..
ముఖ్యంగా కంపెనీ అజ్యూర్ క్లౌడ్ విభాగం ఆదాయం మార్కెట్ అంచనాలను మించి 43 శాతం వృద్ధిని నమోదు చేసింది.
అలాగే సంస్థ అభివృద్ధి చేసిన ఏఐ ఆధారిత మైక్రోసాఫ్ట్ 365 కోపైలట్‌కు ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ లభిస్తోందని, దాని వినియోగదారుల సంఖ్య ఇప్పటికే 3 కోట్ల మార్కును దాటిందని కంపెనీ వెల్లడించింది.
ఈ సానుకూల పరిణామాల ప్రభావంతో మైక్రోసాఫ్ట్ షేరు ధర ఒకే రోజులో దాదాపు 16 శాతం పెరిగింది.
వివరాలు
నష్టాల్లో మెటా షేర్లు..
కంపెనీ షేర్లు ఈ స్థాయిలో ఒక్కరోజులో పెరగడం 2008 తర్వాత ఇదే మొదటిసారి కావడం మరో విశేషం.
ఇదిలా ఉండగా, మరో టెక్ దిగ్గజం మెటా షేర్లు మాత్రం ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.
కంపెనీ ప్రకటించిన త్రైమాసిక ఫలితాలు మదుపర్ల అంచనాలను అందుకోకపోవడంతో పాటు, కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో పెరుగుతున్న పెట్టుబడులపై ఆందోళనలు వ్యక్తమవడంతో మెటా షేర్లు 8 శాతం వరకు పడిపోయాయి.
దీంతో వరుసగా 11వ ట్రేడింగ్ రోజూ మెటా షేర్లు నష్టాల్లోనే ముగిశాయి.