LOADING...
Microsoft: దేశంలో రూ.1.58 లక్షల కోట్లతో మైక్రోసాఫ్ట్‌ పెట్టుబడులు.. సీఈఓ సత్య నాదెళ్ల ప్రకటన 
సీఈఓ సత్య నాదెళ్ల ప్రకటన

Microsoft: దేశంలో రూ.1.58 లక్షల కోట్లతో మైక్రోసాఫ్ట్‌ పెట్టుబడులు.. సీఈఓ సత్య నాదెళ్ల ప్రకటన 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 10, 2025
08:16 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాకు చెందిన సాంకేతిక దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్‌ భారత్‌లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. మన దేశంలో రాబోయే నాలుగేళ్లలో మొత్తం 17.5 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.1.58 లక్షల కోట్లు) వెచ్చించనున్నట్లు సంస్థ సీఈఓ సత్య నాదెళ్ల ప్రకటించారు. దేశంలో కృత్రిమ మేధ (ఏఐ) భవితవ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అవసరమైన మౌలికసదుపాయాల అభివృద్ధి, నైపుణ్యాలను పెంపొందించే కార్యక్రమాలకు ఈ నిధులు వినియోగించనున్నట్లు సోషల్‌ మీడియా వేదిక 'ఎక్స్‌'లో ఆయన పేర్కొన్నారు. ఆసియాలోనే అత్యధిక పెట్టుబడులు భారత్‌లోనే పెట్టేందుకు మైక్రోసాఫ్ట్‌ సిద్ధంగా ఉందని, దేశ అభివృద్ధి లక్ష్యాలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. దిల్లీలో మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అనంతరం ఈ కీలక ప్రకటన వెలువడింది.

వివరాలు 

2026 క్యాలెండర్‌ సంవత్సరాంతానికి 3 బిలియన్‌ డాలర్ల  ఖర్చు 

ఈ సమావేశంలో దేశ ఏఐ వ్యూహం, వృద్ధి ప్రాధాన్యాలపై విశదంగా చర్చ జరిగినట్లు మైక్రోసాఫ్ట్‌ వెల్లడించింది. 2026 నుంచి 2029 వరకు భారత్‌లో 17.5 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టడం ద్వారా ఏఐ వినియోగాన్ని విస్తృత స్థాయిలో తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ ఏడాది జనవరిలో ప్రకటించిన 3 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.27 వేల కోట్లు) పెట్టుబడులకు అదనంగా ఈ మొత్తం ఉంటుందని సంస్థ స్పష్టం చేసింది. అలాగే 2026 క్యాలెండర్‌ సంవత్సరాంతానికి ఆ 3 బిలియన్‌ డాలర్లను పూర్తిగా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది. హైదరాబాద్‌లో ఇండియా సౌత్‌ సెంట్రల్‌ క్లౌడ్‌ రీజియన్‌ ఏర్పాటుకు కూడా మైక్రోసాఫ్ట్‌ చర్యలు వేగవంతం చేసింది.

వివరాలు 

2030 నాటికి దేశవ్యాప్తంగా 2 కోట్ల మందికి ఏఐ నైపుణ్యాలు

2026 మధ్య నాటికి ఈ రీజియన్‌ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని ప్రకటించింది. ఈ డేటా కేంద్రంలో రెండు ఈడెన్‌ గార్డెన్ల పరిమాణానికి సమానంగా విస్తరించిన మూడు అవైలబులిటీ జోన్లు ఉండనున్నాయి. దీని ద్వారా 2030 నాటికి దేశవ్యాప్తంగా 2 కోట్ల మందికి ఏఐ నైపుణ్యాలు అందించాలనే 2025లో నిర్దేశించుకున్న లక్ష్యాన్ని రెట్టింపు చేస్తున్నట్లు సంస్థ వివరించింది. ఇదిలా ఉండగా, గత రెండు నెలల వ్యవధిలో భారత్‌కు ప్రకటించిన మూడో పెద్ద ఏఐ పెట్టుబడి ఇదే కావడం గమనార్హం.

Advertisement

వివరాలు 

2016 నుంచి 2022 మధ్యకాలంలో మైక్రోసాఫ్ట్ భారత్‌లో 3.7 బిలియన్‌ డాలర్లు

ఐదేళ్లలో భారత్‌ను ఏఐ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో 15 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.1.35 లక్షల కోట్లు) వెచ్చించనున్నట్లు అక్టోబర్‌ 14న గూగుల్‌ ప్రకటించగా, ఆ తర్వాత బ్రూక్‌ఫీల్డ్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, డిజిటల్‌ రియాల్టీల సంయుక్త సంస్థ డిజిటల్‌ కనెక్జన్‌ కూడా 11 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.99 వేల కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించింది. అంతకుముందే, 2030 నాటికి తెలంగాణ, మహారాష్ట్రల్లో 12.7 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.1.14 లక్షల కోట్లు) పెట్టుబడులు పెడతామని 2023 మేలో అమెజాన్‌ ప్రకటించింది. ఇప్పటికే 2016 నుంచి 2022 మధ్యకాలంలో ఈ సంస్థ భారత్‌లో 3.7 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.33,300 కోట్లు) వెచ్చించడం విశేషంగా నిలుస్తోంది.

Advertisement