Microsoft: స్వచ్ఛంద పదవీవిరమణకు ఆరోగ్య భద్రత, వాటా ప్రయోజనాలు.. మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం
ఈ వార్తాకథనం ఏంటి
కృత్రిమ మేధ రంగంపై విస్తృతంగా దృష్టి పెట్టిన సాంకేతిక సంస్థలు ఈ సంవత్సరంలోనూ ఉద్యోగాల తగ్గింపును కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. తమ వద్ద దీర్ఘకాలంగా పనిచేస్తున్న ఉద్యోగుల కోసం స్వచ్ఛంద పదవీవిరమణ అవకాశాన్ని ప్రవేశపెట్టింది. ఈ అవకాశాన్ని ఎంచుకునే వారికి ఆకర్షణీయమైన సదుపాయాలు అందించనుంది. ఇందులో ఆరోగ్య భద్రత, నగదు చెల్లింపులు, వాటాలకు సంబంధించిన ప్రయోజనాలు ఉన్నాయి.
వివరాలు
70 సంవత్సరాలు మించినవారు ఈ అవకాశానికి అర్హులు
మైక్రోసాఫ్ట్ చరిత్రలో దాదాపు ఐదు దశాబ్దాల తరువాత ఇలాంటి స్వచ్ఛంద పదవీవిరమణ కార్యక్రమాన్ని ప్రారంభించడం ఇదే మొదటిసారి. ఈ ప్రణాళికను గత నెలలోనే సంస్థ వెల్లడించగా, తాజాగా పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఉద్యోగి వయస్సు,సేవా కాలం కలిపి 70 సంవత్సరాలు మించినవారు ఈ అవకాశానికి అర్హులు. ఉదాహరణకు, ఒక ఉద్యోగి వయస్సు 50 సంవత్సరాలు కాగా, 20 సంవత్సరాలుగా సంస్థలో పనిచేస్తే, అతను ఈ పథకానికి అర్హుడవుతాడు. సంస్థ వివరాల ప్రకారం, ఇలాంటి అర్హత కలిగినవారు మొత్తం ఉద్యోగుల్లో సుమారు 7 శాతం మంది ఉన్నారు. 2025 జూన్ నాటికి అమెరికాలో సంస్థకు సుమారు 1,25,000 మంది ఉద్యోగులు ఉండగా, అందులో దాదాపు 8,750 మందికి ఈ అవకాశం వర్తిస్తుంది.
వివరాలు
వాటాలకు సంబంధించిన ప్రయోజనాలు
ఈ పథకాన్ని ఎంచుకునే ఉద్యోగులకు పలు రకాల లాభాలు లభించనున్నాయి. స్వచ్ఛంద పదవీవిరమణకు అంగీకరించిన వారికి ఐదేళ్ల పాటు ఆరోగ్య సేవలను సంస్థ అందిస్తుంది. ఉద్యోగి సీనియారిటీ, సంస్థలో పనిచేసిన కాలాన్ని పరిగణనలోకి తీసుకుని ఒకేసారి చెల్లించే భత్యం ఇవ్వనుంది. అదనంగా, వాటాలకు సంబంధించిన ప్రయోజనాలు కూడా కల్పించనుంది. అర్హత కలిగిన ఉద్యోగులు 30 రోజులలోగా తమ నిర్ణయాన్ని తెలియజేయాలని సంస్థ సూచించింది.
వివరాలు
ఈ కార్యక్రమం కోసం 900 మిలియన్ డాలర్లను కేటాయించిన మైక్రోసాఫ్ట్
ఈ కార్యక్రమం కోసం మైక్రోసాఫ్ట్ దాదాపు 900 మిలియన్ డాలర్లను కేటాయించింది. ఇదిలా ఉండగా, త్వరలోనే ఉద్యోగాల కోతలు కూడా ప్రకటించే అవకాశముందని సమాచారం. రాబోయే నెలల్లో ఉద్యోగుల తగ్గింపు ఉండవచ్చని సంస్థ సంకేతాలు ఇచ్చింది. కొత్త నియామకాల విషయంలోనూ నెమ్మదిగా ముందుకు వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలిపింది. కృత్రిమ మేధపై పెట్టుబడులు పెంచడం, వ్యయాలను నియంత్రించడం వంటి కారణాల వల్లే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.