Microsoft Xbox: మైక్రోసాఫ్ట్ ఎక్స్‌బాక్స్‌లో మరిన్ని లేఆఫ్‌లు.. ఉద్యోగుల్లో ఆందోళన!
ఈ వార్తాకథనం ఏంటి
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌కు చెందిన గేమింగ్ విభాగం ఎక్స్‌బాక్స్‌లో మరోసారి ఉద్యోగుల తొలగింపులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో సంస్థ కొత్త లేఆఫ్‌లను ప్రకటించే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఎక్స్‌బాక్స్ వ్యాపారం ప్రస్తుతం ఆశించిన స్థాయిలో లాభాలను ఆర్జించడం లేదని, సంస్థలో సమగ్ర మార్పులు అవసరమని సీఈఓ ఆశా శర్మ భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఉద్యోగుల కోతపై సంస్థ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గత ఐదేళ్లలో కంటెంట్ అభివృద్ధి, ప్లాట్‌ఫామ్ విస్తరణ కోసం మైక్రోసాఫ్ట్ సుమారు 20 బిలియన్ డాలర్లు వెచ్చించినప్పటికీ, అందుకు తగ్గ ఆదాయం రాలేదని కంపెనీ ఉద్యోగులకు పంపిన మెమోలో వెల్లడించినట్లు వార్తలు వెలువడ్డాయి.
వివరాలు
గతేడాది 9 వేల మంది ఉద్యోగుల తొలగింపు
ఈ పరిస్థితుల దృష్ట్యా జూన్ 30తో ముగియనున్న ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అనంతరం ఉద్యోగుల తొలగింపులు చేపట్టాలని సంస్థ యోచిస్తున్నట్లు సమాచారం. అయితే ఈసారి ఎంతమంది ఉద్యోగులపై ప్రభావం పడనుందనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. కాగా, గతేడాది మైక్రోసాఫ్ట్ సుమారు 9 వేల మంది ఉద్యోగులను తొలగించింది. ఆ సమయంలో ఎక్స్‌బాక్స్ విభాగానికి చెందిన పలువురు ఉద్యోగులు కూడా తమ ఉద్యోగాలను కోల్పోయారు.