Xbox: ఎక్స్‌బాక్స్‌లో మళ్లీ లేఆఫ్‌లు.. మూడు విడతల్లో ఉద్యోగుల తొలగింపు?
ఈ వార్తాకథనం ఏంటి
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌కు చెందిన గేమింగ్ విభాగం ఎక్స్‌బాక్స్ (Microsoft Xbox) మరోసారి ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో సంస్థలో మరిన్ని లేఆఫ్‌లు ప్రకటించే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ప్రస్తుతం గేమింగ్ వ్యాపారం ఆశించిన స్థాయిలో లాభదాయకంగా లేదని, సంస్థలో పూర్తిస్థాయి మార్పులు అవసరమని ఎక్స్‌బాక్స్ సీఈఓ ఆశా శర్మ(Asha Sharma)కొన్ని నెలల క్రితం ప్రకటించారు. ఈ నేపథ్యంలో వ్యాపారాన్ని స్థిరీకరించడంతో పాటు అదనపు ఖర్చులను తగ్గించుకోవడంపై కంపెనీ దృష్టి సారించినట్లు సమాచారం. ఈ వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా మొత్తం మూడు విడతల్లో ఉద్యోగుల తొలగింపులు చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెలతో పాటు నవంబర్, జనవరిలోనూ లేఆఫ్‌లు ప్రకటించవచ్చని వార్తలు వస్తున్నాయి.
వివరాలు
ఖర్చుల తగ్గింపుపై ఆశా శర్మ దృష్టి
అయితే, ఈ మూడు విడతల్లో కలిపి ఎంతమంది ఉద్యోగాలు కోల్పోతారనే విషయంపై ఇప్పటివరకు స్పష్టత లేదు. 2026 ఫిబ్రవరిలో ఎక్స్‌బాక్స్ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన ఆశా శర్మ.. సంస్థ వ్యయాలను కట్టడి చేయడం, నిధులను ఆదా చేయడం లక్ష్యంగా కీలక మార్పులు చేపడుతున్నారు.
గతంలో అమలు చేసిన ప్రణాళికలు, పెట్టుబడులు కంపెనీకి ఆశించిన ఫలితాలను అందించలేకపోయాయని ఆమె పేర్కొన్నారు.
ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు ఉద్యోగుల సంఖ్యను తగ్గించడంతో పాటు గేమింగ్ స్టూడియోల నిర్వహణ విధానంలోనూ మార్పులు చేస్తున్నారు.
ఈ క్రమంలో డబుల్ ఫైన్ ప్రొడక్షన్స్ (Double Fine Productions), కంపల్షన్ గేమ్స్ (Compulsion Games) వంటి స్టూడియోలను స్వతంత్ర వ్యవస్థలుగా మార్చినట్లు తెలుస్తోంది.
వివరాలు
నింజా థియరీ స్టూడియో మూసివేతపై ప్రచారం
గేమింగ్ విభాగాన్ని మరింత సమర్థంగా నిర్వహించడం, ఖర్చులను తగ్గించడం వంటి లక్ష్యాలతో ఈ మార్పులు చేపడుతున్నట్లు సమాచారం.
మరోవైపు ప్రముఖ గేమ్ 'హెల్‌బ్లేడ్' (Hellblade)ను రూపొందించిన నింజా థియరీ (Ninja Theory) స్టూడియో భవిష్యత్తుపైనా అనిశ్చితి నెలకొంది.
ఈ స్టూడియోను పూర్తిగా మూసివేయవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, దీనిపై అధికారికంగా స్పష్టత వచ్చినట్లు సమాచారం లేదు.
కాగా ఈ ఏడాది జులైలోనే ఎక్స్‌బాక్స్ సుమారు 3,200 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇప్పటికే భారీ స్థాయిలో ఉద్యోగాల కోత చేపట్టిన సంస్థ.. ఇప్పుడు మరో మూడు విడతల్లో లేఆఫ్‌లకు సిద్ధమవుతున్నట్లు వస్తున్న వార్తలు గేమింగ్ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి.