భారత స్టాక్ మార్కెట్‌లో చరిత్ర సృష్టించిన ఎంఆర్ఎఫ్; రూ.1 లక్షకు చేరిన షేరు ధర
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ టైర్ల తయారీ సంస్థ ఎంఆర్ఎఫ్ దలాల్ స్ట్రీట్‌లో చరిత్ర సృష్టించింది.
భారత స్టాక్ మార్కెట్‌లో తొలిసారిగా షేరు ధర రూ.1లక్షకు చేరిన మొదటి కంపెనీగా ఎంఆర్ఎఫ్ ఖ్యాతిని గడించింది.
ఎంఆర్ఎఫ్ షేర్లు ఉదయం 10:45 గంటలకు 1.04శాతం పెరిగి ఒక్కొక్కటి రూ. 1,00,000.95వద్ద ట్రేడయ్యాయి.
దీంతో ఆ కంపెనీ మరో మైలురాయిని అందుకున్నట్లు అయ్యింది. ఈ కంపెనీ షేరు ధర 2021లో తొలిసారిగా రూ.90,000వేలకు చేరుకుంది.
ఈ స్టాక్ రూ.10వేలు పెరిగి రూ.1లక్షకు చేరుకోవడానికి రెండేళ్లు పట్టింది. దేశీయ మార్కెట్‌లో ప్రస్తుతం అత్యంత ఖరీదైన స్టాక్ గా ఎంఆర్ఎఫ్ ఉంది.
అయితే ప్రైస్-టు-ఎర్నింగ్స్ (పీ/ఈ) లేదా ప్రైస్-టు-బుక్ వాల్యూ(పీ/బీవీ) వంటి కొలమానాల విషయానికి వస్తే ఇది అత్యంత ఖరీదైనది కాదనే చెప్పాలి.
స్టాక్ మార్కెట్
ఈ ఏడాది 14శాతం లాభపడిన స్టాక్
ఎంఆర్ఎఫ్ స్టాక్ గతేడాది 45శాతానికి పైగా గరిష్ట లాభాలను చవిచూశాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఈ షేరు దాదాపు 14శాతం లాభపడింది.
కాగా, గడిచిన మూడేళ్లలో 82శాతం రాబడిని అందించింది. Q4FY23లో కంపెనీ నికర లాభం 86 శాతం పెరిగి రూ. 313.5కోట్లకు చేరుకుంది.
క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.168.5కోట్లుగా ఉంది. ఈ త్రైమాసికంలో కోర్ కార్యకలాపాల ద్వారా ఏకీకృత ఆదాయం కూడా 10 శాతం పెరిగి రూ.5,842 కోట్లకు చేరుకుంది.
ఎంఆర్ఎఫ్ షేర్లు 54.52 రెట్లు (పీ/ఈ) గుణకారంతో ట్రేడవుతుండగా, అది ప్రైస్-టు-బుక్ విలువ (పీ/బీవీ) 2.89 రెట్లు మల్టిపుల్‌తో ట్రేడవుతోంది. మూలధనంపై దాని రాబడి 7.34 శాతంగా ఉంది. ఈక్విటీపై దాని రాబడి 5.23 శాతంగా ఉంది.