MRF Q2 Results: MRF త్రైమాసిక ఫలితాల విడుదల.. డౌన్ అయ్యిన షేర్లు
ప్రముఖ టైర్ల తయారీ సంస్థ MRF తమ రెండో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో (MRF Q2 Results) సంస్థ ఏకీకృత ప్రాతిపదికన రూ.470.70 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ఇది గత సంవత్సరం ఇదే సమయంలో ఉన్న రూ.586.60 కోట్ల లాభంతో పోలిస్తే 19 శాతం తగ్గుదలను సూచిస్తోంది. MRF ప్రకారం, ఈ త్రైమాసికంలో కార్యకలాపాల నుండి వచ్చిన మొత్తం ఆదాయం రూ.6,881.09 కోట్లుగా ఉంది, గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో నమోదు చేసిన రూ.6,217.10 కోట్లతో పోలిస్తే 10 శాతం పెరిగింది.
స్టాండలోన్ పద్ధతిలో MRF లాభం 20 శాతం క్షీణించింది
స్టాండలోన్ పద్ధతిలో MRF లాభం 20 శాతం క్షీణించింది, అంటే రూ.571.93 కోట్ల నుండి రూ.455.43 కోట్లకు తగ్గిందని కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ఆదాయం 11.1 శాతం పెరిగి రూ.6,087.56 కోట్ల నుండి రూ.6,760.37 కోట్లకు చేరింది. కంపెనీ మార్జిన్లు కూడా 14.4 శాతం తగ్గినట్టు వెల్లడించబడింది. మొత్తం ఖర్చులు 16 శాతం పెరిగి రూ.5,497 కోట్ల నుండి రూ.6,363 కోట్లకు చేరాయి. ఈ నేపథ్యంలో,MRF బోర్డు మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది.ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.3 చొప్పున డివిడెండ్ చెల్లించాలని నిర్ణయించింది,నవంబర్ 19ని రికార్డు తేదీగా ప్రకటించింది. ఫలితాల ప్రకటన తర్వాత, మధ్యాహ్నం 1:45 గంటలకు ఎన్‌ఎస్‌ఈలో MRF షేర్లు రూ.2,052.35 పాయింట్లు (1.70శాతం) తగ్గి రూ.1,18,969.35 వద్ద ట్రేడవుతున్నాయి.