Shriram Finance: శ్రీరామ్ ఫైనాన్స్‌లో 20% వాటా.. రూ.39,618 కోట్ల పెట్టుబడితో ఎంయూఎఫ్‌జీ సంచలనం!
ఈ వార్తాకథనం ఏంటి
భారత ఆర్థిక రంగంలో చరిత్రాత్మక విదేశీ పెట్టుబడిగా జపాన్‌కు చెందిన మిత్సుబిషి యూఎఫ్‌జే ఫైనాన్షియల్ గ్రూప్ (ఎంయూఎఫ్‌జీ) ముందుకొచ్చింది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్‌లో 20 శాతం వాటాను రూ.39,618 కోట్లకు (దాదాపు 4.4 బిలియన్ డాలర్లు) కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. ఇది ఇప్పటివరకు భారత ఆర్థిక సేవల రంగంలో జరిగిన అతిపెద్ద విదేశీ పెట్టుబడిగా నిలవడం విశేషం. ప్రిఫరెన్షియల్ ఈక్విటీ షేర్ల ద్వారా ఈ మైనారిటీ వాటాను ఎంయూఎఫ్‌జీ కొనుగోలు చేయనున్నట్లు శ్రీరామ్ ఫైనాన్స్ వెల్లడించింది.
Details
అనుమతులు పొందాల్సి ఉంది
ఈ పెట్టుబడికి సంబంధించి ఇరు సంస్థల మధ్య డెఫినిటివ్ ఒప్పందం కుదిరినట్లు తెలిపింది. ఈ ఒప్పందం భారత ఆర్థిక సేవల రంగంపై ఎంయూఎఫ్‌జీకి ఉన్న విశ్వాసాన్ని, అలాగే భవిష్యత్‌లో ఈ రంగం కలిగిన వృద్ధి సామర్థ్యాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తోందని సంస్థ పేర్కొంది. అయితే ఈ పెట్టుబడి అమలుకు ముందు వాటాదారులు, నియంత్రణ సంస్థల నుంచి అవసరమైన అనుమతులు పొందాల్సి ఉందని శ్రీరామ్ ఫైనాన్స్ స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా, ఈ ఏడాది అక్టోబరులో యూఏఈకు చెందిన ఎమిరేట్స్ ఎన్‌డీబీ బ్యాంక్, ఆర్‌బీఎల్ బ్యాంక్‌లో 60 శాతం వాటాను రూ.26,853 కోట్లకు కొనుగోలు చేసేందుకు ఆసక్తి వ్యక్తం చేసిన విషయం గమనార్హం.
Details
మన దేశంలో 1.7 బిలియన్ డాలర్ల పెట్టుబడులు
ఇక ఎంయూఎఫ్‌జీ బ్యాంక్‌కు మాతృసంస్థ అయిన మిత్సుబిషి యూఎఫ్‌జే ఫైనాన్షియల్ గ్రూప్‌కు భారత్‌లో 130 ఏళ్ల చరిత్ర ఉంది. ఇప్పటివరకు మన దేశంలో సుమారు 1.7 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టిన ఈ సంస్థ, దాదాపు 5,000 ఉద్యోగాలను సృష్టించింది. ఈ తాజా పెట్టుబడితో భారత్‌లో తన ఉనికిని మరింత బలపరచుకోనున్నట్లు ఆర్థిక వర్గాలు విశ్లేషిస్తున్నాయి.