
Mukesh Ambani: కొత్త వ్యాపారంలోకి ముఖేష్ అంబానీ.. హెల్త్ డ్రింక్స్ రంగంలో బంపర్ డీల్!
ఈ వార్తాకథనం ఏంటి
ముకేష్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన FMCG విభాగం రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (RCPL) కొత్త ఒప్పందం కుదుర్చుకుంది. ఈసారి కంపెనీ 'నేచర్స్ ఎడ్జ్ బేవరేజెస్'లో భారీ వాటాను కొనుగోలు చేసింది. ఆయుర్వేద మూలికల ఆధారిత పానీయాలను తయారు చేసే ఈ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా, అంబానీ ఇప్పుడు వేగంగా పెరుగుతున్న హెల్త్ అండ్ వెల్నెస్ డ్రింక్స్ మార్కెట్‌లోకి అధికారికంగా ప్రవేశించారు. ఈ భాగస్వామ్యం ద్వారా RCPL పూర్తి స్థాయి పానీయాల కంపెనీగా మారేందుకు తోడ్పడుతుందని సంస్థ పేర్కొంది. నేచర్స్ ఎడ్జ్ బేవరేజెస్ ప్రధానంగా ఫంక్షనల్ డ్రింక్స్ తయారు చేస్తుంది.
Details
కీలక భాగస్వామ్యం కుదుర్చుకున్న RCPL
ఇవి శక్తిని పెంచడం, ఏకాగ్రతను మెరుగుపరచడం, జీర్ణక్రియకు సహాయపడడం వంటి ప్రయోజనాలను అందిస్తాయి. రిలయన్స్ ఇప్పటికే పానీయాల విభాగంలో అనేక ప్రసిద్ధ బ్రాండ్‌లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. అందులో కాంపా (కార్బోనేటేడ్ డ్రింక్), సోషియో సాఫ్ట్ డ్రింక్స్, స్పోర్ట్స్ డ్రింక్ స్పిన్నర్, పండ్ల ఆధారిత బ్రాండ్ రస్కీక్ ఉన్నాయి. ఇప్పుడు ఆయుర్వేద, మూలికా ఉత్పత్తులు చేర్చడంతో RCPL పోర్ట్‌ఫోలియో మరింత బలపడనుంది.
Details
నేచర్స్ ఎడ్జ్ బేవరేజెస్ పుట్టుక
ఈ కంపెనీని 2018లో బైద్యనాథ్ గ్రూప్ మూడవ తరం వారసుడు సిద్ధేష్ శర్మ స్థాపించారు. యువతను ఆకర్షించే ఆధునిక పానీయాల రూపంలో భారతీయ ఆయుర్వేదాన్ని ప్రజలకు అందించడం ఈ సంస్థ లక్ష్యం. ఈ పానీయాలు చక్కెర, కేలరీలు లేనివి కావడం ప్రత్యేకత. అశ్వగంధ, బ్రహ్మి, ఖుస్, కోకుమ్, గ్రీన్ టీ వంటి ఆయుర్వేద మూలికలను ఉపయోగించి తయారు చేస్తారు. ఈ పానీయాలు శరీరానికి శక్తిని ఇవ్వడమే కాకుండా ఆరోగ్యాన్ని, ఫిట్‌నెస్‌ను కాపాడటంలో కూడా సహాయపడతాయి. మార్కెట్ నిపుణుల అంచనాల ప్రకారం రాబోయే సంవత్సరాల్లో హెల్త్ అండ్ ఫంక్షనల్ డ్రింక్స్ రంగం వేగంగా అభివృద్ధి చెందనుంది. ఈ నేపథ్యంలో అంబానీ తీసుకున్న తాజా నిర్ణయం రిలయన్స్‌కు గేమ్ ఛేంజర్‌గా మారే అవకాశం ఉంది.