Reliance: రిలయన్స్ వాటాదారులకు బోనస్ షేర్లు ప్రకటించిన ముకేశ్ అంబానీ.. త్వరలో బోర్డు ఆమోదముద్ర
రిలయెన్స్ సంస్థ తన వాటాదారులకు శుభవార్త అందించింది.షేర్‌హోల్డర్లకు 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లు జారీ చేయడానికి ప్రతిపాదనను పరిశీలించేందుకు కంపెనీ బోర్డు సెప్టెంబర్ 5న సమావేశం కానుందని బీఎస్‌ఈ ఫైలింగ్‌లో వెల్లడించింది. వార్షిక సాధారణ సమావేశంలో (ఏజీఎం) కంపెనీ ఛైర్మన్ ముకేష్ అంబానీ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. సెప్టెంబర్ 5న బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశం జరగనుందని, సెబీ నిబంధనల ప్రకారం ఈ సమావేశంలో 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్ల జారీ అంశాన్ని పరిశీలిస్తుందని ఫైలింగ్ వివరించింది.
ఒక షేర్ ఉంటే అదనంగా మరొక బోనస్ షేర్
గతంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 2009, 2017లో 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను జారీ చేసింది. బోనస్ షేర్లు అనేవి, కంపెనీ అదనపు షేర్లను ఉచితంగా ఇస్తున్నాయని అర్థం. ఇప్పటికే ఉన్న షేర్ల ఆధారంగా వాటాదారులకు ఈ బోనస్ షేర్లను కేటాయిస్తారు. అంటే, ఒక షేర్ ఉంటే అదనంగా మరొక బోనస్ షేర్ లభిస్తుంది. ముఖేశ్ అంబానీ ప్రకటన వెలువడటానికి ముందు నుంచి మార్కెట్‌లో రిలయన్స్ షేర్ ధరలు భారీ లాభాలను నమోదు చేశాయి. నేడు ట్రేడింగ్ రూ. 3,007 వద్ద ప్రారంభమై మధ్యాహ్నం 2:29 సమయానికి రూ. 3,049 వద్దకు చేరుకుంది. ఒక దశలో రూ. 3,065 ను కూడా తాకింది.