Elon Musk: ఓపెన్‌ఏఐ కేసులో మస్క్‌కు షాక్.. పోరాటం ఇంకా ముగియలేదన్న మస్క్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలోని ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఓపెన్‌ఏఐ పై టెస్లా అధినేత ఎలాన్ మస్క్ వేసిన కేసులో ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. ఓపెన్‌ఏఐ తన అసలు లక్ష్యమైన "మానవాళికి ఉపయోగపడే సేవ"నుంచి తప్పుదోవ పట్టిందని మస్క్ ఆరోపించినప్పటికీ, అమెరికా జ్యూరీ మాత్రం ఆ ఆరోపణలను తిరస్కరించింది. కంపెనీపై ఎలాంటి బాధ్యత లేదని ఏకగ్రీవంగా తీర్పు ఇచ్చింది.దీంతో స్పందించిన మస్క్..ఈ పోరాటం ఇంకా ముగియలేదని, నైన్త్ సర్క్యూట్ కోర్టులో అప్పీల్‌కు వెళ్తానని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X ద్వారా ప్రకటించారు. జ్యూరీ తీర్పు అసలు కేసు అంశాల ఆధారంగా కాకుండా"క్యాలెండర్ టెక్నికాలిటీ"కారణంగా వచ్చిందని మస్క్ విమర్శించారు. సామ్ ఆల్ట్‌మాన్, గ్రెగ్ బ్రాక్‌మన్ కలిసి ఓ చారిటీ సంస్థను తమ లాభాల కోసం ఉపయోగించుకున్నారని ఆరోపించారు.
వివరాలు
2015లో ఓపెన్‌ఏఐ స్థాపకుల్లో ఒకరిగా మస్క్
ఈ తీర్పు అమెరికాలో చారిటీలకు భారీ నష్టం కలిగించేలా ఉందని కూడా అన్నారు. కాలిఫోర్నియాలోని ఓక్‌లాండ్ కోర్టులో జరిగిన ఈ విచారణ మూడు వారాల పాటు సాగింది. చివరకు జ్యూరీ రెండు గంటల లోపే ఏకగ్రీవ నిర్ణయానికి వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్తు, దాని ప్రయోజనాలు ఎవరికి చేరాలి అనే అంశాలపై ఈ కేసు కీలకంగా మారింది. 2015లో మస్క్ కూడా ఓపెన్‌ఏఐ స్థాపకుల్లో ఒకరిగా ఉన్నారు. ప్రారంభ దశలో దాదాపు 38 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టిన ఆయన, 2018లో సంస్థ నుంచి బయటకు వచ్చారు. మస్క్ ఆరోపణల ప్రకారం.. ఓపెన్‌ఏఐను లాభాపేక్షలేని సంస్థగా కొనసాగించాలని మొదట నిర్ణయించుకున్నప్పటికీ, తర్వాత ఆల్ట్‌మన్, బ్రాక్‌మన్ కలిసి దాన్ని లాభాల దిశగా మళ్లించారని చెప్పారు.
వివరాలు
ఆరోపణలను పూర్తిగా ఖండించిన ఓపెన్‌ఏఐ
కంపెనీ విలువ పెరిగిన తర్వాత వ్యక్తిగతంగా భారీగా లాభపడ్డారని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను ఓపెన్‌ఏఐ పూర్తిగా ఖండించింది. సంస్థను ఎప్పటికీ నాన్‌ప్రాఫిట్‌గా కొనసాగిస్తామని ఎలాంటి హామీ ఇవ్వలేదని స్పష్టం చేసింది. కంపెనీ భవిష్యత్ దిశ గురించి మస్క్‌కు ముందే తెలుసని, కానీ పూర్తి నియంత్రణ సాధించలేకపోవడంతోనే ఇప్పుడు కేసు పెట్టారని వాదించింది. ఈ కేసు విచారణలో పలువురు ప్రముఖులు సాక్ష్యమిచ్చారు. సత్య నాదెళ్లతో పాటు ఓపెన్‌ఏఐ మాజీ బోర్డు సభ్యులు హెలెన్ టోనర్, తాషా మెక్‌కాలీ కోర్టులో హాజరయ్యారు. 2023లో ఆల్ట్‌మన్ తిరిగి సీఈఓగా వచ్చిన తర్వాత వీరిని బోర్డు నుంచి తప్పించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మస్క్ చేసిన ట్వీట్
Regarding the OpenAI case, the judge & jury never actually ruled on the merits of the case, just on a calendar technicality.
— Elon Musk (@elonmusk) May 18, 2026
There is no question to anyone following the case in detail that Altman & Brockman did in fact enrich themselves by stealing a charity. The only question…